శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం
ఉదయం ఆరు గంటల అనంతరం ప్రయోగం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): అగ్నికుల్ కాస్మోస్ ప్రయివేట్ లిమిటెడ్ (చెన్నై) అనే ప్రయివేట్ అంతరిక్ష సంస్థకు చెందిన అగ్నిబాన్ ఎస్‌ఓఆర్ టీఈడీ మిషన్–01 అనే చిన్న తరహా రాకెట్‌ను సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని అగ్నికుల్ ప్రయోగవేదిక నుంచి శనివారం ఉదయం 6గంటలకు ప్రయోగించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ విషయాన్ని షార్ శుక్రవారం మీడియాకు తెలిపింది. ఇస్రోలోని వాణిజ్యవిభాగమైన ఇన్‌స్పేస్ సంస్థ ఆహ్వానం మేరకు షార్‌లోని సౌండింగ్ రాకెట్ లాంచ్‌పాడ్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు.
శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభమవుతుంది. ఈ ప్రయోగంలో సుమారు వంద కిలోలు బరువు కలిగిన పేలోడ్ (ఉపగ్రహం)ను లోయర్ ఎర్త్ ఆర్బిట్ (లియో)లోకి పంపించనున్నారు. అయితే రాకెట్‌కు సంబంధించిన అన్ని విషయాలను అగ్నికుల్ సంస్థ చూసుకుంటుండగా, షార్ అధికారులు, ఇంజినీర్లు ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్నారు. అందుకే ఈ రాకెట్‌కు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడించడం లేదు.
అయితే షార్ వేదికగా ప్రయివేట్ అంతరిక్ష సంస్థల్లో స్కైరూట్, అగ్నికుల్ అనే రెండు సంస్థలకు చెందిన చిన్న తరహా ప్రయోగాలకు ఇస్రో వీలు కల్పిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రయోగ వేదికలను కూడా కల్పించి మరీ ప్రయివేట్ అంతరిక్ష సంస్థలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. అందుకే అగ్నికుల్ సంస్థకు షార్‌కేంద్రంలో ఒక ప్రయోగవేదికను కూడా కేటాయించారు.
అగ్నిబాన్ రాకెట్ వివరాలివి
పేటెంట్ పొందిన అగ్నిలెట్ ఇంజన్‌లతో ఈ రాకెట్ నడవడం విశేషం. ఇది త్రీడీ–ప్రింటెడ్ 6 కేఎన్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ సాయంతో నిలువునా నింగిలోకి ఎగురుతుంది. అగ్నికుల్ రాకెట్ 18 మీటర్లు ఎత్తు కలిగి 1.3 మీటర్లు వెడల్పు ఉంది. ప్రయోగ సమయంలో 14వేల కిలోల బరువు కలిగి ఉంటుంది.
ఈ అగ్నిలెట్ ఇంజిన్లలో ద్రవ ఆక్సిజన్, ద్రవ ఆక్సిడైజర్ అనే ఇంధనం సాయంతో మూడు దశలుగా రాకెట్‌ను ప్రయోగిస్తారు. అగ్నికుల్ కాస్మోస్ సంస్థ గతేడాది ఆగస్టు 15న ఒకసారి ప్రయోగాన్ని నిర్వహించగా, రెండోసారి శనివారం ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
Comments
Please login to add a commentAdd a comment