కక్ష్యలోకి చేరిన జీశాట్–29 ఉపగ్రహం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 14న జీఎస్‌ఎల్‌వీ మార్క్3డీ2 రాకెట్ ద్వారా ప్రయోగించిన జీశాట్–29 ఉపగ్రహాన్ని శనివారం భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఉపగ్రహంలోని ల్యాం ఇంజిన్‌లో ఉన్న 1,742 కిలోల ఇంధనంలో కొంతభాగాన్ని ఈ నెల 15, 16న రెండు విడతలుగా వినియోగించి కక్ష్య దూరాన్ని పెంచారు. ఈనెల 14న షార్ కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ మార్క్3 డీ2 రాకెట్ ద్వారా రోదసీలోకి పంపిన జీశాట్–29 ఉపగ్రహాన్ని 190 కిలోమీటర్లు పెరిజీ (భూమికి దగ్గరగా) 35,975 కిలోమీటర్లు అపోజీ (భూమికి దూరంగా) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
హసన్‌లోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం (ఎంసీఎఫ్) వారు ఉపగ్రహాన్ని తమ అదుపులోకి తీసుకుని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టే ప్రక్రియను చేపట్టారు. 190 కిలోమీటర్లు పెరిజీని (భూమికి దగ్గరగా) 10,287 కిలోమీటర్ల ఎత్తుకు పెంచుతూ అపోజీని (భూమికి దూరంగా) 35,873 కిలోమీటర్లకు తగ్గించారు. ఆఖరి విడతగా 488 సెకెండ్ల పాటు ల్యాం ఇంజిన్లు మండించి భూ బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఇస్రో శాస్త్రవే త్తలు విజయవంతంగా స్థిరపరిచారు. ఈ ఉపగ్రహం సుమారు 10 ఏళ్ల పాటు సేవలను అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment