షార్‌లోని రెండో ప్రయోగ వేదికపై ప్రయోగానికి సిద్ధంగా జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3డీ2 రాకెట్
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లోని రెండో ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 5.08 గంటలకు జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3డీ2 ఉపగ్రహవాహక నౌకను ప్రయోగించనున్నారు. 25.30 గంటల ముందు అంటే.. మంగళవారం సాయంత్రం 3.38 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సోమవారం ప్రయోగ సమయాన్ని ఎంఆర్‌ఆర్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. షార్‌లోని బ్రహ్మ ప్రకాష్ హాల్లో సోమవారం ఎంఆర్‌ఆర్ చైర్మన్ బీఎన్ సురేష్, కాటూరి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఆర్‌ఆర్ కమిటీ భేటీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాకెట్‌లోని అన్ని దశలకు తుది విడత పరీక్షలు నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆ«థరైజేషన్ బోర్డుకు అప్పగించారు. బోర్డు చైర్మన్ పాండ్యన్ ఆధ్వర్యంలో రిహార్సల్స్ నిర్వహించి కౌంట్‌డౌన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3డీ2 రాకెట్‌లో రెండో దశలోనే ద్రవ ఇంధనాన్ని నింపాల్సి ఉండడంతో కౌంట్‌డౌన్ సమయాన్ని 25:30 గంటలు గానే నిర్ణయించారు. ఇస్రో చరిత్రలో అతిపెద్ద ప్రయో గం కావడంతో శాస్త్రవేత్తలు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. మూడున్నర టన్నులపైగా బరువున్న ఉపగ్రహాన్ని షార్ నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి.
మేకిన్ ఇండియాగా గుర్తింపు: 2014 డిసెంబర్ 18న జీఎఎస్‌ఎల్‌వీ మార్క్–3 ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించి విజయం సాధించారు. ఆ ప్రయోగంలో క్రయోజనిక్ దశ లేకుండా డమ్మీని పెట్టి ప్రయోగించారు. 2017 జూన్ 5న జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3డీ1 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించా రు. ఇప్పుడు మూడోసారి జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3డీ2 ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. మార్క్–3 లాంటి భారీ ప్రయోగాలు విజయవంతమైతే రాకెట్ టెక్నాలజీలో భారత్ ఇతర దేశాలపై ఆధారపడకుండా మేకిన్ ఇండియాగా గుర్తింపు సాధిస్తుంది.
3,700 కిలోల బరువున్న ఉపగ్రహం రోదసీలోకి..
ప్రయోగం ద్వారా 3,700 కిలోలు బరువుగల జీశాట్–29 అనే సరికొత్త కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా కేఏ, ఎక్స్, కేయూ మల్టీబీమ్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్ పేలోడ్స్‌ను పంపిస్తున్నారు. ఇలాంటి ట్రాన్స్‌ఫాండర్లు పంపడం ఇస్రో ఇదే మొదటిసారి. గ్రామీణ ప్రాంతాల్లోని వనరులు తదితరాలను గుర్తించి సమాచారాన్ని అందించడమే కాకుండా దేశ ఆర్మీకి ఆవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉపగ్రహం 12ఏళ్ల పాటు సేవలందిస్తుంది. గజ తుపాన్ ప్రభావంతో 30 కిలో మీటర్లు వేగంతో గాలులు వీస్తాయని ఇస్రో ఉపగ్రహలు సమచారం ఇచ్చినట్టుగా తెలిసింది. గాలులతో ప్రయోగానికేమీ ఇబ్బంది ఉండదని శాస్త్రవేత్తలు భావించి ప్రయోగ, కౌంట్‌డౌన్ సమయాన్ని వెల్లడించారు.
ఇస్రో చైర్మన్ రాక నేడు
ఇస్రో చైర్మ్‌న్ ఏఎస్ కిరణ్‌కుమార్ మంగళవారం సాయంత్రం షార్‌కు చేరుకుని కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించి సహచర శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment