న్యూఢిల్లీ: శాటిలైట్ టీవీ ఎంఎస్‌వోల (మల్టీ–సిస్టం ఆపరేటర్లు) రిజిస్ట్రేషన్‌ను 10 ఏళ్ల వ్యవధికి రెన్యువల్ చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కేంద్రానికి సూచించింది. ఇందుకోసం ప్రాసెస్ ఫీజును రూ. 1 లక్షగా నిర్ణయించాలని సిఫార్సు చేసింది. కేబుల్ టీవీ నెట్‌వర్క్స్ నిబంధనల్లో ఎంఎస్‌వోల రిజిస్ట్రేషన్ల రెన్యువల్ నిబంధనలు లేకపోవడంతో తగు సూచనలు చేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కోరిన మీదట ట్రాయ్ ఈ మేరకు సిఫార్సులు చేసింది. రెన్యువల్‌కి దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరిగేలా చూడాలని, బ్రాడ్‌కాస్ట్ సేవా పోర్టల్ ద్వారా పత్రాలన్నీ డిజిటల్ విధానంలో అప్‌లోడ్ చేసే వెసులుబాటు కల్పించాలని పేర్కొంది.
అలాగే రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం పెండింగ్‌లో ఉన్న ఎంఎస్‌వోల జాబితాను, నిర్దిష్ట గడువులోగా దరఖాస్తు చేసుకోని వాటి లిస్టును పోర్టల్‌లో పొందుపర్చాలని సూచించింది. ఒకవేళ దరఖాస్తు పరిశీలనలో ఉన్నా, నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచినా తుది నిర్ణయం తీసుకునే వరకూ సదరు ఎంఎస్‌వోలకు పొడిగింపునివ్వాలని పే ర్కొంది. గడువు తేదీ ముగియడానికి ఏడు నుంచి రెండు నెలల ముందు వరకూ రెన్యువల్ కోసం దరఖాస్తులను స్వీకరించవచ్చని ట్రాయ్ సూచించింది. రెండు నెలల కన్నా తక్కువ సమయంలో దరఖాస్తు చేసుకుంటే జాప్యానికి చూపిన కారణాలను పరిశీలించి శాఖ తగు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment