సపోజ్.. ఫర్ సపోజ్.. ఉపగ్రహం లేదా దానిలోని ఓ భాగం మీ నెత్తిన పడితే ఏం చేస్తారు? పోనీ.. మీ నెత్తిన కాదు.. మీ ఇంటిపై పడితే ఏం చేస్తారు?పిచ్చిలేచిందా.. ఇదేం తిక్క ప్రశ్న అనేగా మీ ఫీలింగు..
మీ ఫీలింగును మేము ఫీలయ్యేలోపు.. ఓసారి ఈ ఫొటో చూడండి.. ఇది భూమి కక్ష్యకు సంబంధించి నాసా రూపొందించిన కంప్యూటర్ జనరేటెడ్ ఫొటో... ఇక్కడ కొన్ని కోట్ల సంఖ్యలో భూమి చుట్టూ వేగంగా తిరుగుతున్నాయే.. వీటిల్లో పనిచేస్తున్న ఉపగ్రహాలు మినహాయిస్తే.. మిగతాదంతా కేవలం చెత్త.. అంటే అంతరిక్ష వ్యర్థాలు.. ప్రస్తుతం ఇక్కడ ఉన్నదాంట్లో 95% అదే.. ఇవి అడపాదడపా.. అక్కడక్కడా వచ్చి పడుతుంటాయి...
గత నెల్లో భారత్‌కు చెందిన అంతరిక్ష శిథిలం ఒకటి ఆస్ట్రేలియాలో పడింది కూడా.. ఈ నేపథ్యంలో అసలు అంతరిక్ష వ్యర్థాలు అంటే ఏమిటి? పడితే పరిహారంలాంటిది చెల్లించాలా? అసలు దీనికి సంబంధించిన అంతర్జాతీయ చట్టాలేం చెబుతున్నాయి? లాంటి పెద్ద విషయాలతోపాటు అస లు మన నెత్తిన లేదా ఇంటిపై పడే చాన్సుందా.. పడితే.. మనకూ పరిహారం లాంటిదేమైనా ఇస్తారా వంటి చిన్నపాటి వివరాలు కూడా తెలుసుకుందాం..
అంతరిక్ష వ్యర్థం అంటే..
♦ స్పేస్‌లో మిగిలిపోయిన, పనికి రాని భాగాలు.. అది కాలపరి మితి ముగిసిన ఉపగ్రహం కావచ్చు లేదా రాకెట్ ప్రయోగ దశలోని భాగాలు కావచ్చు. వ్యోమ గాములు వాడిన గ్లవ్స్‌లాంటివి కావచ్చు. లక్ష్యాలను పూర్తిచేసు కుని పనికిరానివిగా మిగిలిపోయి నవి ఏవైనా కావచ్చు.
♦ నాసా లెక్క ప్రకారం ఒక మిల్లీమీటర్ కంటే చిన్నవున్న అంతరిక్ష వ్యర్థాలు 10 కోట్లు ఉంటే.. సాఫ్ట్ బాల్ సైజు కన్నా పెద్దవిగా ఉన్నవి 23 వేలు ఉన్నాయి. కొన్నిటిని శాస్త్రవేత్తలే ఎలాంటి ఇబ్బంది లేకుండా.. నియంత్రిత పద్ధతిలో సము ద్రంలో కూలేలా చేస్తుంటారు. ఒకవేళ అలా కాకున్నా.. సాధా రణంగా ఎక్కువ శాతం వ్యర్థాలు సముద్రంలో పడి పోతుంటాయి.
ఎందుకంటే.. భూమ్మీద నీటి శాతమే ఎక్కువ గనుక.. కొన్ని ఎడారులు, అడవుల్లాంటి నిర్మానుష్య ప్రదేశాల్లో పడుతుంటాయి. చిన్నసైజు వ్యర్థాలు భూ వాతావరణంలోకి రాగానే మండిపోతాయి. కొంచెం పెద్దగా ఉండేవి కిందకు వస్తాయి. ఒకవేళ అలా వస్తే..
పైసా నికాలో..
అంతరిక్ష వ్యర్థాల వల్ల పర్యావరణానికి లేదా భూమిపై పడినప్పుడు ఆ ప్రదేశంలో ఏదైనా నష్టం వాటిల్లితే.. దాన్ని ప్రయోగించిన దేశం(లాంచింగ్ కంట్రీ) బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి. 1967 నాటి ఔటర్ స్పేస్ ట్రీటీ, 1972 నాటి స్పేస్ లయబి లిటీ కన్వెన్షన్ ప్రకారం.. నష్టం జరిగిందని బాధిత దేశం కోరితే.. పరిహా రం చెల్లించాల్సి ఉంటుంది.
గతంలో ఎవరైనా చెల్లించారా?
ఒక్కసారి జరి గింది. 1978లో కెనడా అప్పటి సోవి యట్ యూనియన్ నుంచి పరిహారాన్ని కోరింది. సోవియట్ ఉపగ్రహ భాగం కెన డాలో పడింది. అది కొంచెఅణు ధార్మికత వెదజల్లిందంటూ కెనడా పరిహా రాన్ని డిమాండ్ చేసింది. కొంచెం ఎక్కు వే అడిగినప్పటికీ.. సోవి యట్ యూనియన్‌రూ.18 కోట్లే(ప్రస్తుత లెక్క ప్రకారం) చెల్లించింది.
మన దేశం విషయానికొస్తే..
పశ్చిమ ఆస్ట్రేలియాలో పడిన అంతరిక్ష వ్యర్థం పీఎస్‌ఎల్‌వీ రాకెట్ మూడో స్టేజ్‌కు సంబంధించినదని ఇస్రో నిర్ధారించింది. అది సముద్రంలో పడి.. తర్వాత కొంత కాలానికి తీరానికి కొట్టుకొచ్చి ఉంటుందని తేల్చారు. ఈ సంఘటనలో ఆస్ట్రేలియా పరిహారం కోరితే మనం చెల్లించాల్సి ఉంటుంది.
అయితే.. తొలుత దీని నుంచి ఏమైనా విష రసాయనాలు లీకై ఉంటాయనే అనుమానాలు వ్యక్తమైనా.. తర్వాత అలాంటిదేమీ జరగలేదని శాస్త్రవేత్తలు తేల్చారు. దీన్ని బట్టి.. మన దేశం ఎలాంటి పరిహారాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే.. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ ఎఫైర్స్ ప్రకారం.. తమ దేశంలో పడ్డ..విదేశీ అంతరిక్ష భాగాన్ని యాజమాన్య దేశానికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది.
సాధారణంగా మిషన్ అనాలసిస్ కోసం వీటిని తిరిగి తీసుకుంటారు. అయితే.. ఇక్కడ ఈ పరికరం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ప్రతినిధి చెబుతున్నారు. భారత్‌కు ఇది అక్కర్లేకుంటే.. స్కైల్యాబ్ ఉంచిన.. మ్యూజియంలోనే దీన్ని కూడా పెడతామని చెబుతున్నారు.
స్కైల్యాబ్ గుర్తుందిగా.. అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం. 1979లో ఇది కూలిపోతుందని చెప్పి.. ఇక ప్రపంచం అంతమే అన్నట్లు.. అదే ఇక చివరి రోజు అన్నట్లు ఆస్తులు అమ్మి విందులు వినోదాలు చేసుకున్నారు.. చాలామందికి స్కైల్యాబ్ పేరిట పిల్లలకు పేర్లు కూడా పెట్టారు. ఆ మధ్య తెలుగులో సినిమా కూడా వచ్చింది. ఆ స్కైల్యాబ్ భాగాలు కూడా పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలోనే కూలాయి.
ఇక మన విషయానికొస్తే...
♦నిజంగానే మన మీదో లేక మన ఇంటి మీదో పడిందనుకోండి.. మనమేమీ చేయనక్కర్లేదు. మన తరఫున మన దేశమే.. అది ఏ దేశానిదైతే.. ఆ దేశం నుంచి పరిహారాన్ని కోరుతుంది. ఇప్పిస్తుంది కూడా.. అయితే.. ఇప్పటివరకూ ఏ లెక్క ప్రకారం చూసినా.. అలా పడే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.
అయినా.. ఏమో గుర్రం ఎగరావచ్చు.. ఎగిరి కింద పడనూవచ్చు.. న్యూటన్ చెప్పింది గుర్తుందిగా.. పైకి వెళ్లే ప్రతీది కిందకు రావాల్సిందే.. బీ కేర్‌ఫుల్ మరి..
– సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment