
ఆదిత్య ఎల్–1 ఉపగ్రహ ఊహాచిత్రం (సూర్యుడి కక్ష్యలో ఉపగ్రహం పరిభ్రమించే స్థితి)
సూళ్లూరుపేట: సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సిద్ధమైంది. ఇందుకోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)తో కలిసి పని చేస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆదిత్య ఎల్–1 ఉపగ్రహాన్ని సూర్యుడి చెంతకు పంపించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఇందుకు సంబంధించి భారత, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థలు చర్చలు జరిపిన విషయం విదితమే. సూర్యుడిపై పరిశోధనల నిమిత్తం ఇటీవలే అమెరికా ‘సోలార్ ప్రోబ్’ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సూర్యుడిపై మరిన్ని పరిశోధనలు జరిపేందుకు శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ–ఎక్సెల్ రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్–1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. దీనికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఈ ఏడాది జూన్ లేదా జూలై నెలల్లో ప్రయోగం చేపట్టేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రంలో దీనిని తయారు చేస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రయోగం ఎందుకంటే..
సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్లు దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత 5 వేల కెల్విన్ డిగ్రీల వరకు ఉంటుంది. అయితే, కరోనా ప్రాంతంలో ఉష్ణోగ్రత మాత్రం దాదాపు 10 లక్షల కెల్విన్ డిగ్రీల వరకు ఉంటోంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి గల కారణం ఏమిటనేది అంతు చిక్కడం లేదు. ప్రధానంగా ఈ అంశంపైనే ఆదిత్య ఎల్–1 ఉపగ్రహం దృష్టి సారిస్తుంది.
సౌర గోళాన్ని పరిశోధించేందుకు ఆదిత్య ఎల్–1 ఉపగ్రహంలో అమర్చే ఆరు పరికరాల ఊహాచిత్రం
సౌర గోళం పరిస్థితులపైనా అధ్యయనం
సౌర గోళంలో సౌర గాలులు, జ్వాలలు, రేణువుల తీరు తెన్నులపై పరిశో«ధనలు జరిపేందుకు ఇస్రో–నాసా శాస్త్రవేత్తలు సంయుక్త ప్రణాళికలు సిద్ధం చేశారు. సౌర తుపాను సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని అంచనా వేశారు. దీంతో పాటు కాంతి మండలం (ఫొటోస్ఫియర్), వర్ణ మండలాలను (క్రోమోస్ఫియర్)లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరిస్తారు.
ఆదిత్య ఎల్–1 ప్రత్యేకతలివీ
- ఆదిత్య ఎల్–1 ఉపగ్రహంలో ఆరు పేలోడ్స్‌ను అమర్చి సూర్యుడి చెంతకు పంపిస్తారు.
- సూర్యుని వలయంలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు యాస్‌పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్ అనే ఆరు ఉపకరణాలు ఇందులో ఉంటాయి.
- ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో భూమి, సూర్యుడి అభికేంద్ర బలాలు సమానమయ్యే చోట (లాగ్రేంజియన్ బిందువు–1 (ఎల్–1)లోకి చేరవేస్తారు.
- అక్కడి నుంచి ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేకుండా సూర్యుడిని నిరంతరం పరిశీలించేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment