రాకెట్‌ స్టార్స్‌.. లిటిల్‌ స్టార్స్‌ | ISRO demonstration | Sakshi
Sakshi News home page

రాకెట్‌ స్టార్స్‌.. లిటిల్‌ స్టార్స్‌

Published Fri, Jun 16 2017 11:15 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

రాకెట్‌ స్టార్స్‌..  లిటిల్‌ స్టార్స్‌

రాకెట్‌ స్టార్స్‌.. లిటిల్‌ స్టార్స్‌

మన చిన్నారులలోని కలామ్‌లు బయటికి రావాలంటే, మన మేధ ఎల్లలు

ఇస్రో   ప్రదర్శన

మన చిన్నారులలోని కలామ్‌లు బయటికి రావాలంటే, మన మేధ ఎల్లలు దాటి విదేశాలకు తరలకుండా ఉండాలంటే... ఇలాంటి ఎగ్జిబిషన్‌లు నగరాలను దాటి జిల్లాలకూ రావాలి. గ్రామాల్లోని విద్యార్థులకు చేరాలి.

‘నాన్నా! రాకెట్‌ ఆకాశంలోకి ఎలా వెళ్తుంది?’ ‘అమ్మా! ఆకాశం ఎంత ఎత్తు ఉంటుంది?’ ‘రాకెట్‌లో మనం వెళ్లొచ్చా?’ ‘ఎందుకు వెళ్లకూడదు? తాతయ్య చెప్పిన కథలో రాకుమారుడు కీలుగుర్రం మీద అంత ఎత్తుకు పోతాడు కదా! చుక్కల్ని తాకి వస్తాడు కదా! మనం కూడా రాకెట్‌లో వెళ్తే చుక్కల్ని తాకొచ్చా?’ ‘ఇందాక టీవీలో... రాకెట్‌ మబ్బుల్లోకి వెళ్లేటప్పుడు దాన్నుంచి మంటలు వచ్చాయి నాన్నా! రాకెట్‌ లోపలున్న వాళ్లు కాలిపోరా?’ ‘రాకెట్‌ లోపల ఎంత ఖాళీ ఉంటుంది బాబాయ్‌? మన గది అంత ఉంటుందా? రాకెట్‌లో ఉన్న వాళ్లకు దాహం వేస్తే నీళ్లు ఎలా? అన్నం ఎవరు పెడతారు?’

ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే... ఇలాంటివి ఎన్నెన్ని ప్రశ్నలో! కొన్నింటికి తెలిసింది చెబుతాం. కొన్నిటికి ఏదో చెప్పి సమాధానపరుస్తాం. అయ్య బాబోయ్‌! ఏం పిల్లలు... క్వశ్చన్‌ బ్యాంక్‌ని మింగేశారా ఏంటి... అనిపిస్తుంది. వీటన్నింటికీ సమాధానం ఈ నెల 13న హైదరాబాద్, రవీంద్రభారతిలో దొరికింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మన ఇస్రో శాస్త్రవేత్తలు ఏకంగా 104 శాటిలైట్లను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడమే దీనికి నేపథ్యం. వారందరికీ రవీంద్రభారతి వేదిక మీద ఆ రోజు సాయంత్రం ఘన సన్మానం జరిగింది. సన్మానానికి ముందు అదే ఆవరణలో ఇస్రో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. అక్కడంతా గుంపులుగుంపులుగా రకరకాల స్కూల్‌ యూనిఫామ్స్‌లో పిల్లలు. ఒక్కో బ్యాచ్‌తో ఇద్దరు–ముగ్గురు టీచర్లు. ఆర్గనైజర్‌లు, సైంటిస్టులు పిల్లలకు శ్రద్ధగా ఇస్రో అంటే ఏమిటో వివరిస్తున్నారు. రాకెట్‌ లాంచర్‌ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. శాటిలైట్‌ అంటే ఏమిటో, అది నింగిలోకి వెళ్లాక ఎలా విచ్చుకుంటుందో చూపిస్తున్నారు. పిల్లలకు బుర్రల్లోకి సారమంతా ఇంకిపోవాలన్నంత ఆర్ద్రంగా తాతయ్యలు కథ చెప్పినంత ఇష్టంగా చెబుతున్నారు.

‘స్టవ్‌ మీద మంట పెట్టిన తర్వాత ప్రెషర్‌ కుక్కర్‌లోని ఆవిరి ఒత్తిడికి లోనయ్యి వెయిట్‌ (విజిల్‌) పైకి లేచినట్లే... రాకెట్‌ కూడా. అందులో వాయువులను నింపిన తర్వాత అవి ఒత్తిడికి లోనయ్యి రాకెట్‌ గాల్లోకి లేస్తుంది. రాకెట్‌ ఎంత ఎత్తుకి వెళ్లాలి, ఎంత బరువును మోసుకెళ్లాలి వంటి విషయాలను బట్టి ఇంధనం ఎంత నింపాలో నిర్ణయించాలి. అది మీరు పెద్దయ్యాక, బాగా చదువుకుంటే తెలుస్తుంది...’ అని చెప్తున్నారు. అంత పెద్ద సైంటిస్టులు పిల్లల ఐక్యూ లెవెల్‌కి తగ్గి వాళ్లకు ఎలా చెబితే చక్కగా అర్థమవుతుందో అలాగే చెప్పారు. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్లాంజెరీ ఫౌండేషన్‌. ఈ ఎగ్జిబిషన్‌ ద్వారా పిల్లలకు మరో ప్రపంచాన్ని చూపించే విండో ఓపెన్‌ చేశారు ప్లాంజెరీ ఫౌండేషన్‌ నిర్వహకులు శంకర్‌ ప్లాంజెరీ.

రేపటి సైంటిస్టులు మీరే!
‘మీరు రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లాలి’... అని పిల్లలను చైతన్యపరచడానికి ఇది మంచి వేదికైంది. ఇంటర్‌ తర్వాత ఐఐఎస్‌టిలో చేరండి, అందులో సీట్‌ రాకపోతే ఫలానా కోర్సులు చేసి ఫలానా వెబ్‌సైట్‌ ద్వారా ఇస్రోలో ఉద్యోగాలకు అప్లయ్‌ చేయండి, దేశంలో ఉన్న 14 ఇస్రో సెంటర్లలో ఎక్కడైనా ఉద్యోగం చేయవచ్చు... అని మార్గదర్శనం చేస్తున్నారు. ఇదంతా అయిన తర్వాత సైంటిస్టుల సన్మానం మొదలైంది. త్రివేండ్రంలోని విక్రమ్‌సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ శివన్‌తోపాటు తొమ్మిదిమంది శాస్త్రవేత్తలకు జరిగిన చిన్న పురస్కారం అది. ‘‘ఫిబ్రవరిలో మన పిఎస్‌ఎల్‌వి సి 37.. నూట నాలుగు శాటిలైట్లను మన స్పేస్‌ స్టేషన్‌ నుంచి విజయవంతంగా లాంచ్‌ చేయడంతో... ఇప్పుడు ప్రపంచం అంతరిక్ష పరిజ్ఞానంలో మనదేశం వైపు చూస్తోంది. ఇందులో పాల్గొన్న శాస్త్రవేత్తలంతా భారతీయులే. మనదేశంలో ఆర్థికంగా బలహీనమైన కుటుంబాల్లోని పిల్లల్లో చాలా మేధ ఉంది. అది బయటకు రావాలని, వాళ్లు సైంటిస్టులు కావడానికి ఉన్న దారులను చూపించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ... భారత్‌కు సేవలందించే రేపటి సైంటిస్టులు మీరేనని పిల్లలకు పిలుపునిచ్చారు వక్తలు. ఈ కార్యక్రమానికి ముందు రాకెట్‌ లాంచింగ్‌ ప్రక్రియను వీడియో ప్రదర్శించారు.

చంద్రయాన్‌ ఉపగ్రహం చంద్రుడి దగ్గరకు వెళ్లి తీసిన ఫొటోలను, భారత్‌ తిరంగాను చూపించినప్పుడు హాలంతా చప్పట్లతో మారుమోగింది. నిజమే! ఇలాంటి ప్రోత్సాహకరమైన షోలను చూస్తే పిల్లల మెదళ్లలో భవిష్యత్తు గురించి గొప్ప లక్ష్యం ముద్రగా పడుతుంది. అబ్దుల్‌ కలాం చెప్పినట్లు పిల్లలు ఒక గొప్ప కలను కంటారు. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఇష్టంగా కష్టపడతారు.

జయహో ఇస్రో!
ఓఎన్‌జిసి– ఎస్‌పిజి (సొసైటీ ఫర్‌ పెట్రోలియం జియో ఫిజిసిస్ట్స్‌) సంస్థలు సంయుక్తంగా ఏటా వర్క్‌షాప్, క్విజ్‌ పోటీ నిర్వహిస్తుంటాయి. అందులో విజేతలకు కాంప్లిమెంటరీగా అమెరికాలోని నాసా స్పేస్‌ సెంటర్‌ను సందర్శించే వీలు కల్పిస్తాయి. ఇలాంటివి చూసినప్పుడు... ‘భారత్‌ తలుపులన్నీ మూసేసుకుని ఉంది. అమెరికాలోని నాసా ప్రతిభకు పగ్గం వేసి లాక్కుంటోంది’ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు టీనేజ్‌లో ఒకసారి నాసా పరిశోధన కేంద్రంలోకి వెళ్లి రాకెట్స్‌ని, ప్లానెట్స్‌ పరిభ్రమణం గురించి వీడియోలను చూసిన తర్వాత వాళ్ల బుర్రలు ఊరికే ఉండవు. మనుషులు నేల మీద ఉన్నా, ఆలోచనలు అంతరిక్షంలో పరిభ్రమిస్తాయి. ఆ లక్ష్యాలకు దారులను కూడా అమెరికా నుంచే వెతుక్కుంటారు. ఒకసారి ఎక్కిన గుమ్మంలో నుంచి లోపలికి వెళ్లడం సులువు కాబట్టి. ఇప్పుడు రవీంద్రభారతిలో జరిగిన ఈ ఎగ్జిబిషన్‌ మన మాణిక్యాలను మన దగ్గరే నిలుపుకోవడానికి జరిగిన ఓ మంచి ప్రయత్నం. ఈ ప్రోగ్రామ్‌లో గీతిక అనే అమ్మాయి సైంటిస్టులు చెప్తున్న వివరాలను నోట్స్‌ రాసుకుంటూ కనిపించడం.. మన శాస్త్రరంగ అభివృద్ధికి ఒక శుభసూచకం.

హైదరాబాద్, రవీంద్ర భారతి... ఇస్రో ఎగ్జిబిషన్‌లో స్కూలు పిల్లలు
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement