
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ44 (పీఎస్‌ఎల్‌వీ–డీఎల్) అనే వినూత్న ఉపగ్రహ వాహక నౌకను గురువారం రాత్రి 11.37 గంటలకు 70వ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 46వ ప్రయోగమైన పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను మొట్ట మొదటిసారిగా రెండు స్ట్రాపాన్ బూస్టర్లతో రూపొందించి విజయవంతంగా ప్రయోగించారు.
పోలార్ శాటిలైట్ లాంఛింగ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ సీ44) ఉపగ్రహ వాహకనౌక తమిళనాడులోని హైస్కూల్ విద్యార్థులు తయారు చేసిన కలాంశాట్, ఇండియన్ డిఫెన్స్‌కు ఉపయోగపడే మైక్రోశాట్–ఆర్ అనే రెండు ఉపగ్రహాలను అలవోకగా రోదసీలోకి మోసుకెళ్లి నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి నిశిరాత్రిలో నిశ్శబ్ధ విజయాన్ని నమోదు చేసుకుంది. 44.4 మీటర్లు పొడవు కలిగిన పీఎస్‌ఎల్‌వీ సీ44 ప్రయోగ సమయంలో 290 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమైంది. బుధవారం రాత్రి 7.37 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 28 గంటల పాటు నిర్విఘ్నంగా కొనసాగింది.
కౌంట్‌డౌన్ ముగిసే సమయం దగ్గర పడడంతో మిషన్ కంట్రోల్ రూమ్‌లో శాస్త్రవేత్తలు టెన్ నుంచి వన్ దాకా అంకెలు చెబుతుండగా జీరో అనగానే గురువారం రాత్రి 11.37 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ44 ఎరుపు నారింజ రంగు మంటలు చిమ్ముతూ విజయవంతంగా నింగికి దూసుకెళ్లింది. ప్రయోగం జరిగిన తరువాత 13.55 గంటలకు ముందుగా మైక్రోశాట్–ఆర్ ఉపగ్రహాన్ని భూమికి 274.2 కిలోమీటర్లు ఎత్తులోని సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1.5 కిలోలు బరువు కలిగిన కలాంశాట్‌ను 450 కిలోమీటర్ల ఎత్తులోని సన్‌సింక్రనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. రెండు ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లోకి దిగ్విజయంగా ప్రవేశపెట్టడంతో మిషన్ కంట్రోల్‌రూంలో శాస్త్రవేత్తల కరతాళ ధ్వనులు మిన్నంటాయి.
ప్రయోగం ఇలా..
ఇస్రో శాస్త్రవేత్తలు సరికొత్తగా మొట్టమొదటిగా రూపాందించిన పీఎస్‌ఎల్‌వీ సీ44 (పీఎస్‌ఎల్‌వీ–డీఎల్) ప్రయోగాన్ని 13.55 నిమిషాల్లో నిర్వహించారు. ఈ ప్రయోగంలో పీఎస్‌ఎల్‌వీ 4వ దశ (పీఎస్04 మోటార్)ను ఎక్స్‌పర్‌మెంటల్‌గా రీస్టార్ట్ చేశారు. అదే విధంగా పీఎస్–4 దశలోనే అమర్చిన కలాంశాట్‌ను భూమికి 450 కిలోమీటరు ఎత్తులో, మైక్రోశాట్–ఆర్‌ను 274.2 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ పోలార్ అర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అయితే పీఎస్–4ను ప్రయోగాత్మకంగా రెండుసార్లు రీస్టార్ట్ చేయనున్న దృష్ట్యా 54 వేల సెకన్లు (15 గంటలు)సమయాన్ని తీసుకున్నారు. మొదటి రీ స్టార్ట్ 3275 సెకన్లకు, రెండోసారి రీ స్టార్ట్‌ను 6026 సెకన్లకు చేశారు. ఈ ప్రయోగాత్మక పరీక్ష పూర్తయ్యే సరికి 15 గంటలు సమయం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే మొదటి దశలోని రెండు స్ట్రాపాన్ బూస్టర్లు నింపిన 24.4 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 139 టన్నుల ఘన ఇంధన సాయంతో 44.4 మీటర్లు పొడవు, 290 టన్నుల బరువు కలిగిన పీఎస్‌ఎల్‌వీ–డీఎల్ రాకెట్ ప్రయాణం ప్రారంభించి 109 సెకన్లలో మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసింది. రెండో దశలో నింపింన 4.1 టన్నుల ద్రవ ఇంధనంతో 262 సెకన్లకు పూర్తి చేసింది. అంతకు ముందే అంటే 168 సెకన్లకే హీట్‌షీల్టు ఓపెన్ ఇయింది. 7.65 టన్నుల ఘన ఇంధనంతో మూడో దశను 387 సెకన్లకు, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 766 సెకన్లకు నాలుగోదశను పూర్తి చేసింది. ఆ తరువాత 813 సెకన్లకు (13.55 నిమిషాల్లో) మైక్రోశాట్–ఆర్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టి అంతరిక్ష విజయాల వినువీధిలో భారతఖ్యాతిని ఇనుమడింపజేశారు.
ఇదో అద్భుతమైన ప్రయోగం..
మిషన్ కంట్రోల్‌రూంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ మాట్లాడుతూ ఇదొక అద్భుతమైన ప్రయోగమని అన్నారు. 13.55 నిమిషాలకు మనదేశానికి చెందిన ఉపగ్రహాలను నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత 3,275 సెకన్లకు పీఎస్–4 (నాలుగోదశ)ను రీస్టార్ట్ చేశామని, మళ్లీ 6026 సెకన్లకు రెండోసారి రీస్టార్ట్ చేసి విజయం సాధించామన్నారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న ఇస్రో శాస్త్రవేత్తలకు ఉద్యోగులకు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్
తిరుమల: ఇస్రో చైర్మన్ శివన్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.
వైఎస్ జగన్ అభినందనలు..
పీఎస్‌ఎల్‌వీ సీ44 (పీఎస్‌ఎల్‌వీ–డీఎల్) ప్రయోగం విజయవంతమవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భశిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాక్షించారు. తమిళనాడులోని హైస్కూల్ విద్యార్థులు తయారు చేసిన కలాంశాట్, ఇండియన్ డిఫెన్స్‌కు ఉపయోగపడే మైక్రోశాట్–ఆర్ అనే రెండు ఉపగ్రహాలను పోలార్ శాటిలైట్ లాంఛింగ్ వెహికల్ గత రాత్రి నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment