Let Us Know The Information By Own Satellite - Sakshi
Sakshi News home page

సొంతానికి ఓ శాటిలైట్‌.. మనకు మనమే సమాచారం తెలుసుకునే వీలు!

Published Mon, Dec 12 2022 10:32 AM | Last Updated on Mon, Dec 12 2022 2:37 PM

Let Us Know The Information By Own Satellite - Sakshi

రమేష్‌ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. వచ్చే వారం రోజులు వర్షాలు అనే సమాచారం ఉంది. అయితే, తాను ఉంటున్న ప్రాంతంలో వర్షాలు పడతాయో లేదో తెలుసుకునేందుకు తాను పంపిన ప్రైవేటు శాటిలైట్‌ ద్వారా వర్షం పడుతుందా? లేదా చూశాడు. వర్షం పడదని నిర్ధారించుకుని తన పనిలో మునిగిపోయాడు.  

ఒక ప్రైవేటు విద్యా సంస్థ.. దేశవ్యాప్తంగా ఉన్న తన నెట్‌వర్క్‌లోని అన్ని విద్యా సంస్థల్లో ఒకేసారి ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించేందుకు ఎవరిపై ఆధారపడాల్సిన అవసరంలేకుండా తమ విద్యార్థి ప్రయోగించిన శాటిలైట్‌ ద్వారా నేరుగా సేవలను ఉపయోగించుకుంటోంది. అదీ తక్కువ ఖర్చుతోనే.. 

ఒక ప్రైవేటు సంస్థ మారుమూల ప్రాంతాల్లో పనులను చేపడుతోంది. దేశవ్యాప్తంగా అటు కశ్మీర్‌ నుంచి ఇటు కన్యాకుమారి వరకు పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించేందుకు తాను సొంతంగా నిర్వహిస్తున్న శాటిలైట్‌ ఆధారంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆదేశాలు జారీచేస్తోంది. 

..అవును కేంద్రం కొత్తగా అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తూ తీసుకున్న నిర్ణయంతో మనమూ సొంతంగా ఒక ప్రైవేటు శాటిలైట్‌ను ప్రయోగించుకుని సేవలను పొందే రోజు దగ్గర్లోనే ఉంది. ట్విట్టర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ సొంతంగా ఏర్పాటుచేసుకున్న అంతరిక్ష రవాణా కంపెనీ ‘స్పేస్‌ ఎక్స్‌’ తరహాలో కాకపోయినా.. ప్రైవేటు పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, మెడికల్‌ సంస్థలు మొదలైనవి తమ సొంత శాటిలైట్‌ ద్వారా నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేసుకునే వీలు కలగనుంది.  

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ఎప్పుడో తలుపులు తెరిచారు. కానీ, భారత్‌లో మాత్రం కేంద్రం ఇటీవలే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వేతర ప్రైవేటు సంస్థలు (ఎన్‌జీపీఈ).. అంతరిక్ష పరిశోధనలను తమ సొంత అవసరాలకు స్వయంగా చేసుకునేందుకు వీలుగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. తద్వారా విద్యా సంస్థలు, స్టార్టప్స్, పరిశ్రమలకు ఎండ్‌ టు ఎండ్‌ (నేరుగా సమాచారం చేరే విధంగా) అంతరిక్ష కార్యక్రమాల నిర్వహణకు అవకాశం కల్పించాలని సంకల్పించింది. ఇందుకోసం ఇండియన్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌–స్పేస్‌)ను ఏర్పాటుచేసింది. ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో)తో అనుసంధానం చేసుకుంటూ ప్రైవేటు సంస్థలకు సహాయ సహకారాలతో పాటు నియంత్రణ కూడా చేస్తుంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఇస్రోకు చెందిన సాధన సంపత్తిని ప్రధానంగా రాకెట్‌ లాంచింగ్‌ కేంద్రాలతో పాటు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రైవేటు సంస్థలూ వినియోగించుకునే వెసులుబాటు లభించింది.  

ఇక బోలెడు అవకాశాలు.. 
ప్రైవేటు పెట్టుబడులను అనుమతించడంతో అంతరిక్ష రంగంలో అనతికాలంలోనే భారత్‌ గొప్ప ముందడుగు వేసే అవకాశాలున్నాయని అంతరిక్ష పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు వారు ఒక ఉదాహరణ చెబుతున్నారు. వాస్తవానికి మార్స్‌ (అంగారకుడు)లో అడుగుపెట్టేందుకు భారత్‌ కేవలం 75 బిలియన్‌ డాలర్లు మాత్రమే వెచ్చించింది. మిగిలిన పాశ్చాత్య దేశాల కంటే చాలా తక్కువ ఖర్చుతో మనం అంగారకుడిపై అడుగు పెట్టగలిగామనేది వారి అభిప్రాయం.

అంతేకాక.. భారత్‌లో ఉన్న నిపుణులైన యువత ఈ అవకాశాలను మరింత త్వరగా అందిపుచ్చుకునే అవకాశం ఉందనేది వారి అంచనా. ప్రైవేటు సంస్థలకు అవకాశమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదటగా విశాఖ, హైదరాబాద్‌కు చెందిన యువకులు.. స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ ద్వారా దేశంలోనే మొదటి ప్రైవేట్‌ రాకెట్‌ను శ్రీహరికోట నుంచి 2022 నవంబరు 18న విజయవంతంగా ప్రయోగించారు. అవకాశాలు అందుబాటులోకి వస్తే భారత యువత రాకెట్‌ కంటే వేగంగా దూసుకెళ్లి ప్రపంచ మార్కెట్‌లో త్వరలోనే పాగావేసే అవకాశం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 2019 నాటికి భారత అంతరిక్ష మార్కెట్‌ విలువ 7 బిలియన్‌ డాలర్లు కాగా... ఇది కాస్తా 2025 నాటికి 50 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.  

స్టార్టప్స్‌ షురూ.. 
ప్రపంచ అంతరిక్ష మార్కెట్‌ విలువ 2020 నాటికి 447 బిలియన్‌ డాలర్లు కాగా.. 2025 నాటికి ఇది 600 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. వాస్తవానికి అంతర్జాతీయంగా ఇప్పటికే స్పేస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎక్విప్‌మెంట్, శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌లో ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్‌లో దెబ్బతిన్న సమాచార వ్యవస్థ పునరుద్ధరణలో స్టార్‌ లింక్‌ ప్రధాన పాత్ర పోషించింది. ‘స్పేస్‌ ఎక్స్‌’ సంస్థ అంతరిక్షంలో ఏకంగా 3,271 శాటిలైట్స్‌ను ప్రయోగించింది. ఇందులో 3,236 శాటిలైట్స్‌ ప్రస్తుతం పనిచేస్తున్నాయి. అయితే, భారత్‌లో కూడా అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడుల క్రమం ఇప్పుడే మొదలవుతోంది.

పాశ్చాత్య దేశాలతో పోలిస్తే అంతరిక్ష రంగ పరిశోధనలకు మనం వెచ్చిస్తున్న మొత్తం తక్కువే. అమెరికా అంతరిక్ష బడ్జెట్‌ 41 బిలియన్‌ డాలర్లు కాగా.. ఇందులో నాసా ప్రాజెక్టుల మీద 23.3 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెడుతున్నారు. మరోవైపు.. భారత్‌ అంతరిక్ష బడ్జెట్‌ రూ.13,700 కోట్లు మాత్రమే. అయితే, ఎవరి ప్రమేయం లేకుండా ఎండ్‌ టు ఎండ్‌ సర్వీసులను ప్రైవేటు సంస్థలు పొందేందుకు వీలుగా జూన్‌ 2022లో ప్రైవేటు రంగాన్ని ఆహ్వానిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో భారత్‌లోనూ వేగం పుంజుకునే అవకాశాలున్నాయి. భారత్‌లో ఇప్పటికే ఇస్రో వద్ద 60 స్టార్టప్స్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి.  

సమాచారం మరింత ఖచ్చితంగా.. 
అంతరిక్షంలో మరిన్ని శాటిలైట్లను ప్రయోగించడం ద్వారా మారుమూల ప్రాంతాల సమాచారాన్ని కూడా మరింత సమగ్రంగా, ఖచ్చితంగా విశ్లేషించే అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. నిజానికి.. ఇంట్లో కూర్చుని మనం వివిధ సినిమాలు, న్యూస్, సీరియల్స్, గేమ్స్‌ చూస్తున్నామంటే అందుకు కారణం శాటిలైట్సే. ఎక్కడో దూరాన ఉన్న మన వారితో ఫోన్‌లో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నామన్నా.. మనం ఉన్న చోటునుంచే ఎక్కడో ఉన్న వారి బ్యాంకు అకౌంట్‌లోకి నగదు బదిలీ చేస్తున్నామన్నా.. ఎక్కడెక్కడో ఉన్న కంపెనీల ప్రతినిధులు ఆన్‌లైన్‌లో సమావేశం కావడం, ఫలానా తేదీన, ఫలానా ప్రాంతాల్లో వర్షాలు పడతాయన్న సమాచారం కానీ.. మనం ఉన్న ప్రాంతం నుంచి ఫలానా ప్రదేశం ఎంతదూరం ఉందన్న సమాచారం కానీ మనకు వస్తోందంటే శాటిలైట్స్‌ ఎప్పటికప్పుడు అందిస్తున్న సమాచారమే కారణం. ఇక అంతరిక్షంలోకి మరిన్ని శాటిలైట్లను ప్రయోగిస్తే ఏయే లాభాలు కలుగుతాయంటే.. 

  • వాతావరణంలో వచ్చే మార్పులను మరీ సూక్ష్మంగా విశ్లేషించొచ్చు. తద్వారా ఆయా సమాచారాన్ని రైతులకు, సంస్థలకు అందించడం ద్వారా నష్టాన్ని నివారించే వీలు కలుగుతుంది. 
  • స్టూడెంట్‌ శాటిలైట్స్‌ ద్వారా మారుమూలప్రాంతాలకు చెందిన సమాచారాన్ని తక్కువ ఖర్చుతో సేకరించొచ్చు.  
  • ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్స్‌కు కనెక్ట్‌ కాని 49 శాతం మంది  ప్రజలు వీటి ద్వారా సమాచారాన్ని చేరవేసేందుకు
  • అవకాశం ఉంటుంది.  
  • రాబోయే రోజుల్లో తక్కువ ఖర్చుతో తయారుచేసే చిన్నచిన్న శాటిలైట్లు ప్రధానపాత్ర పోషించనున్నాయి. తక్కువ ఖర్చుతో ఆయా సంస్థలు అంతరిక్ష నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేసుకోవడం ద్వారా ఇతరులకు తమ సమాచారమేదీ పొక్కకుండా కాపాడుకోవచ్చు.   
  • మెడికల్‌ రంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశముంది.   
  •  మన భూమిని ప్రకృతి వైపరీత్యాల నుంచి, వాతావరణ మార్పుల నుంచి కాపాడుకునే వీలుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement