‘నిండు పున్నమిరాత్రి... ఆకాశం నిర్మలంగా ఉంది.. ఇంటిపైకప్పుపై నక్షత్రాలు లెక్కబెట్టుకుంటూ..’ ఇలాంటి వర్ణన విన్నా.. చదివినా వెంటనే పౌర్ణమి ఎప్పుడొస్తుందా... వెంటనే రూఫ్‌టాప్‌పైకి వెళ్లిపోయి కాసేపైనా ఆ ఆనందాన్ని అనుభవిద్దాం అనిపిస్తుంది కదా! ఇంకొన్నేళ్లు ఆగండి.. ఎంచక్కా ప్రతిరోజూ పున్నమిలా మారిపోతుంది! ఎందుకంటారా? ఓ బుల్లి ఉపగ్రహం రాత్రిపూట తెల్లటి కాంతితో నింపేయనుంది. మన పొరుగుదేశం చైనా ఈ దిశగా తొలి అడుగు వేసింది కూడా. సూర్యుడి కాంతి చంద్రుడిపై పడి ప్రతిఫలించడాన్ని మనం వెన్నెల కాంతులంటాం. జాబిల్లి స్థానంలో ఓ పెద్ద అద్దం ఉందనుకోండి. అది కూడా చందమామ మాదిరిగానే భూమ్మీదకు కాంతులను ప్రసారం చేస్తుంది.
ఈ ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది చైనాలోని సియాచున్ ప్రాంత రాజధాని చెంగ్డూ. కాకపోతే భారీ సైజు అద్దం కాకుండా ఓ బుల్లి ఉపగ్రహాన్ని ఉపయోగిస్తున్నారు. దీనికున్న రెక్కలనే అద్దాలుగా వాడుకోనున్నారు. అన్నీ సవ్యంగా సాగితే 2020 నాటికల్లా ఈ ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెడతామని, సూర్యకాంతి నేరుగా చెంగ్డూ నగరంపై పడేలా చేస్తామని చెంగ్డూ ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మైక్రో ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ వూ ఛున్‌ఫెంగ్ అంటున్నారు. ఒక్కో ఉపగ్రహం 10 నుంచి 80 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రాంతాన్ని కాంతివంతం చేస్తుందని అంచనా. అంతేకాదు.. అవసరమైతే కొన్ని మీటర్లు తగ్గించుకునేందుకు లేదా పెంచుకునేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి.
బోలెడంత ఆదా...
ప్రతిరోజూ పున్నమి వెన్నెల ఉంటే లాభం ఏమిటన్న డౌట్ వస్తోందా? చాలానే ఉంది. ఈ ఆలోచన ఆచరణలోకి వస్తే చెంగ్డూ నగరం మొత్తమ్మీద వీధిదీపాలనేవి ఉండవు. ఫలితంగా విద్యుత్తు బిల్లుల రూపంలో భారీ మొత్తం ఆదా అవుతుందని స్థానిక ప్రభుత్వం అంటోంది. పైగా ఇలాంటి హైటెక్ ఏర్పాటును చూసేందుకు వచ్చేవారితో చెంగ్డూ ప్రాంత పర్యాటకానికి ఊతం లభిస్తుందని అంచనా. జాబిల్లి కంటే 8 రెట్లు ఎక్కువ వెలుతురును ప్రసరింప చేస్తున్నా దీంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదని వూ ఛున్‌ఫెంగ్ తెలిపారు. ఈ కృత్రిమ చంద్రుడికి సంబంధించిన పరిశోధన కొన్నేళ్ల క్రితమే చేపట్టామని.. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానం అమలుకు సిద్ధంగా ఉందని అన్నారు.
నార్వేలోనూ ఇలాంటి ప్రయత్నం...
కొన్నేళ్ల క్రితం ఫ్రెంచ్ కళాకారుడు ఒకరు ఇలాంటి ప్రతిపాదనే ఒకటి చేశారు. ఆకాశంలో భారీసైజు అద్దాల నెక్లెస్‌ను అమర్చడం ద్వారా ప్యారిస్ నగర వీధులు రాత్రి కూడా వెలుగులతో నింపవచ్చన్న ఆ ఆలోచన ఆచరణలోకి రాలేదు. 2013లో నార్వేలోనూ ఇలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది. అయితే అద్దాలు ఆకాశంలో కాకుండా రజుకాన్ పట్టణ శివార్లలో ఉన్న కొండపై ఏర్పాటు చేశారు. సూర్యుడి కదలికలను గమనిస్తూ కాంతిని రజుకాన్ సెంటర్‌పైకి ప్రసరింపజేయాలన్నది లక్ష్యం.
ఉత్తర ధ్రువానికి కొంచెం దగ్గరగా ఉండే రజుకాన్‌లో 6 నెలలపాటు చీకటిగానే ఉంటుంది. అద్దాలు అమర్చిన తరువాత చీకటి సమస్య తీరిపోయిందని ప్రజలు అంటున్నారు. 1990 ప్రాంతంలో రష్యా వ్యోమగాములు కొందరు ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించి సూర్యకాంతిని ప్రతిఫలింప చేయడంలో విజయం సాధించారు కూడా. 1999లో మరింత భారీ స్థాయిలో ఇలాంటి ప్రాజెక్టును చేపట్టాలని అనుకున్నారు. కానీ... ప్రయోగ సమయంలో ప్రమాదం జరగడం.. ఆ తరువాత నిధుల సమస్యతో ‘‘జన్మయా–2.5’’పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అక్కడితో ఆగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment