నాసాకు పోయేకాలం
చంద్రుడు చల్లగా ఉంటాడు కాబట్టి మన పప్పులు ఉడికాయి. ఆయనపైన కాలు మోపి, కాసేపు ఉండి వచ్చాం. కానీ ఈయనెవరు?! సూర్యుడు! పప్పులు ఉడకడం కాదు, మాడిపోతాయి. మాడి మసైపోతాయి. ఆ మసి కూడా మిగల్దు. తెలియన్దేముందీ... మామూలు హీటేం కాదు కదా. అయితే అంత హీట్‌లోకి ఇప్పుడు ‘నాసా’ బయల్దేరబోతోంది. పోయేకాలమే! అదింకా రాలేదు లెండి. 2018కి తన పోయేకాలాన్ని ప్లాన్ చేసుకుంటోంది నాసా.
ఇంత కూల్ థాట్ నాసాకు ఎందుకొచ్చింది చెప్మా! అది తర్వాత చూద్దాం. ముందు మాట్లాడుకోవలసిన సంగతేంటంటే... నాసా సూర్యుడిపైకి వెళుతోంది. కానీ మనిషిని పంపడం లేదు. అలాగని శాటిలైట్‌నూ పంపడం లేదు. మరి ఎవరు వెళుతున్నట్లు? ఒక రోబో వెళుతోంది. వెళ్లి అదేం చేస్తుందంటే... కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం కనుక్కుంటుంది! అయితే అది మరీ సూర్యుడి మీదకు వెళ్లి దిగదు. సూర్యుడికి దూరంగా ఉండి, శలభంలా ఆ చుట్టుపక్కలే తిరుగుతూ భూమి మీదకు సమాచారం పంపుతుంది. ‘ఇక్కడ అలా ఉంది, అక్కడ ఇలా ఉంది’ అని. అన్నిటికన్నా కూడా శాస్త్రవేత్తల్ని ఏళ్లుగా ఒక ప్రశ్న పీడిస్తోంది. సూర్యుడి లోపల వేడి తక్కువగా ఉంటుంది. సూర్యుడి బయట వేడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకలా అన్నదే ఆ పీడించే ప్రశ్న. దానికి సమాధానం కనుక్కోడానికే నాసా ఇప్పుడీ రోబోను పంపుతోంది.
సూర్యుడి ఉపరితలాన్ని ‘ఫొటోస్పియర్’ అంటారు. అక్కడ సహజంగానే వేడి అదిరిపోతుంది. సూర్యుడి చుట్టూ వాతావరణాన్ని ‘కరోనా’ అంటారు. అక్కడ మరీ అంత అదిరిపోకూడదు. కానీ ఫొటోస్పియర్‌లో కన్నా, కరోనాలోనే ఎక్కువ వేడి ఉంటున్నట్లు ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తలు కనిపెట్టారు! సూర్యుడి ఉపరితలంపై 5,500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే, సూర్యుడి చుట్టుపక్కల 20 లక్షల డిగ్రీల సెల్సియస్ ఉంటోంది!! అలా ఎందుకు ఉంటోందన్నది మాత్రం ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. ఆ సంగతి తేల్చుకోడానికే నాసా ఇప్పుడు చొక్కా చేతులు పైకి మడుస్తోంది. భూమి నుంచి సూర్యుడి దూరం 14 కోట్ల 90 లక్షల కిలోమీటర్లు. అంత దూరంలో ఉండి కూడా ఆ మహానుభావుడు ఎవ్రీ సమ్మర్ మన భూగోళాన్ని ఫ్రై చేసేస్తుంటాడు. ఇప్పడీ రోబో తగుదునమ్మా అంటూ సూట్‌కేస్ పట్టుకుని ఆయన దగ్గరికే బయల్దేరుతోంది. అందులో ఏవో టూల్స్ ఉంటాయట! వాటితో పరిశోధనలు చేస్తుందట. ఎంత వెళ్లినా, సూర్యుడికి 60 లక్షల కిలో మీటర్ల దూరం వరకే ఆ రోబో వెళ్లగలదు. అంతవరకే మనిషి శాస్త్రవిజ్ఞాన సామర్థ్యం. సరే, ఇన్ని చెప్పుకున్నాం, ఎరిక్ క్రిస్టియన్ అనే పెద్దాయన గురించి కూడా చెప్పుకోవాలి. నాసా సైంటిస్ట్ ఈయన. సూర్యుడి మీదకు రోబోను పంపించే ప్రాజెక్టుకు ఈయనే హెడ్డు.