
అంతరిక్షంలోకి ‘ఇస్రో బాహుబలి’!
జూన్ 3న తుదివిడత ఎంఆర్‌ఆర్ సమావేశం నిర్వహించి 4న కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ ఉపగ్రహ వాహకనౌక ద్వారా జీశాట్–19 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడతారు. ఇప్పటి దాకా ఇస్రో చరిత్రలో అత్యంత బరువైన 3,136 కిలోల జీశాట్–19 ఉపగ్రహాన్ని ‘షార్’ నుంచి ప్రయోగించడం ఇదే ప్రథమం. ఈ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్య(జియోసింక్రనస్ ఆర్బిట్)లో ప్రవేశ పెడతారు. అయితే ముందుగా ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టి ఆ తరువాత మూడు దశల్లో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహంలో కా–బాం డ్, కేయూ బాండ్ హై కమ్యూనికేషన్ ట్రాన్స్‌పాం డర్స్‌తోపాటు జియో స్టేషనరీ రేడియేషన్ స్పెక్ట్రోమీటర్ అనే పేలోడ్స్ అమర్చి పంపుతున్నారు.
ఈ ఉపగ్రహం రోదసీలో 15 ఏళ్లపాటు సేవలందిస్తుంది. ఉపగ్రహంలో అమర్చిన పేలోడ్స్ ప్రభావంతో ఆండ్రాయిడ్ టెక్నాలజీ, ఇంటర్‌నెట్ స్పీడ్, డీటీహెచ్ ప్రసారాల్లో మరింత నాణ్యత పెరగడమేగాక కమ్యూనికేషన్ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తుంది. ఇదిలా ఉంటే.. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లోనూ ఇదే అత్యంత పెద్ద రాకెట్ కావడం, ఇస్రో చరిత్రలో ఇదే భారీ ప్రయోగం కావడంతో దీన్ని ‘ఇస్రో బాహుబలి’గా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మూడువేల కిలోలనుంచి ఐదువేల కిలోల బరువు కలిగిన సమాచార ఉపగ్రహాల్ని ఫ్రెంచిగయానా కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి పంపే బాధ తప్పిపోవడమేగాక వాణిజ్యపరంగా ఇస్రో మరో అడుగు ముందుకేయడానికి దోహదపడుతుంది.