పీఎస్‌ఎల్‌వీ సీ41 రాకెట్ ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి గురువారం వేకువజామున 4.04 గంటలకు రాకెట్ ప్రయోగం జరిగింది. 19.19 నిమిషాల తర్వాత రాకెట్ లక్ష్యాన్ని చేరుకుంది. నాలుగు దశల అనంతరం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహం నిర్ణయించిన సమయానికి విడిపోయి కక్ష్యలోకి ప్రవేశించింది. గతేడాది ఆగస్టు 31న పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహం విఫలం కావడంతో దాని స్థానంలో గురువారం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని పంపారు. ఇది విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. దేశీయ దిక్సూచి వ్యవస్థ కింద ఇప్పటికే 8 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది.