స్పీకర్‌ కోడెల  తనయుడి నిర్వాకం | kodela siva prasada rao son Impairments with satellite piracy | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ కోడెల  తనయుడి నిర్వాకం

Published Fri, Apr 19 2019 5:44 AM | Last Updated on Fri, Apr 19 2019 3:14 PM

kodela siva prasada rao son Impairments with satellite piracy - Sakshi

నరసరావుపేటటౌన్‌: శాటిలైట్‌ పైరసీకి పాల్పడుతూ కోట్ల రూపాయలను దండుకుంటున్న స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ తనయుడు శివరామకృష్ణకు చెందిన ‘కే చానల్‌’ కార్యాలయంలో ఢిల్లీ హైకోర్టు నియమించిన అడ్వకేట్‌ కమిషన్‌ గురువారం సోదాలు నిర్వహించింది. పైరసీకి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో స్పీకర్‌ కోడెల తనయుడు శివరామకృష్ణ గౌతమ్‌ కమ్యూనికేషన్‌ పేరిట కే చానల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ‘కే చానల్‌’కు ఈటీవీ, జెమినీ టీవీ ప్రసారాలకు మాత్రమే హక్కులు ఉన్నాయి. జీ, స్టార్‌ మా చానళ్లకు సంబంధించి ఆయా సంస్థల ద్వారా ఎలాంటి ప్యాకేజ్‌ అనుమతులు తీసుకోకుండా డీటీహెచ్‌ సన్‌ డైరెక్ట్‌ ద్వారా శాటిలైట్‌ పైరసీకి పాల్పడుతూ గత కొన్నేళ్లుగా వినియోగదారులకు ప్రసారం చేస్తున్నారు. స్టార్‌ మా ప్యాకేజీకి ప్రసార హక్కులు తీసుకొని ఉంటే ఒక్కో వినియోగదారుడి తరఫున రూ. 39, జీ ప్యాకేజీకి సంబంధించి రూ. 25 శివరామకృష్ణ చెల్లించాల్సి ఉంది. ఇలా ఒక్కో ఏడాదికి సుమారుగా రూ. 5.46 కోట్లతోపాటు అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుందని పే చానళ్ల సంస్థ సభ్యులు చెబుతున్నారు. అయితే తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని శివరామ్‌ డీటీహెచ్‌ ద్వారా సాంకేతికపరమైన నేరానికి పాల్పడుతున్నారు. అదే సమయంలో వినియోగదారుల నుంచి ప్రతి నెలా కోట్లలో సొమ్ము ముక్కుపిండి మరీ వసూలుచేసుకుంటున్నారు.



ఈ అక్రమ వ్యవహారాన్ని గమనించిన స్టార్‌ ప్లస్‌ ప్రతినిధులు రెండేళ్ల కిందట టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే నిందితుడు స్పీకర్‌ కుమారుడు కావటంతో పోలీసులు కేసు నమోదు చేసేందుకు వెనుకడుగు వేశారు. దీంతో బాధితులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం శాటిలైట్‌ పైరసీపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌ సభ్యుల బృందం గురువారం నరసరావుపేటలోని స్పీకర్‌ కోడెల క్యాంపు కార్యాలయంలోని కే చానల్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించింది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు అక్కడకు చేరుకొని కమిషన్‌ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. తమకు సహకరించకుంటే కోర్టు ధిక్కారం కింద ఫిర్యాదు చేస్తామని కమిషన్‌ సభ్యులు హెచ్చరించటంతో టీడీపీ నాయకులు వెనక్కి తగ్గారు. టూటౌన్‌ పోలీసుల సహకారంతో శాటిలైట్‌ పైరసీకి వినియోగించిన ఎన్‌కోడర్, సెట్‌ టాప్‌ బాక్స్‌లను స్వాధీనం చేసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ మధ్యవర్తుల సమక్షంలో సీజర్‌ నామా నిర్వహించి స్వాధీనం చేసుకున్న వస్తువులను కోర్టులో సమర్పించేందుకు తమ వెంట తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా, మాచర్ల టీడీపీ నాయకుడు కూడా ఇదే తరహాలో శాటిలైట్‌ పైరసీకి పాల్పడటంతో అతని కార్యాలయంపై కూడా అడ్వకేట్‌ కమిషన్‌ సభ్యులు సోదాలు నిర్వహించి పైరసీకి వినియోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement