5వ తేదీ.. సాయంత్రం 5.28 గంటలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(జీఎస్‌ఎల్‌వీ మార్క్3–డీ1)ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3డీ1 ప్రయోగ సమయం ఖరారు
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(జీఎస్‌ఎల్‌వీ మార్క్3–డీ1)ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5.28 గంటలకు దీనిని శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో శుక్రవారం జరిగిన మిషన్ సంసిద్ధత సమావేశం(ఎంఆర్‌ఆర్)లో ప్రయోగ సమయాన్ని ప్రకటించారు. ఎంఆర్‌ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. సమావేశానంతరం ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. అనంతరం బోర్డు చైర్మన్ పి.కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో లాంచ్ రిహార్సల్స్ నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 3.28 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
జీశాట్–19 ఉపగ్రహాన్ని మోసుకెళ్లనున్న వాహకనౌక
ఇస్రో సుమారు 18 ఏళ్లు శ్రమించి రూపొందించిన ఈ జీఎస్‌ఎల్‌వీ మార్క్3–డీ1 ఉపగ్రహ వాహకనౌక ద్వారా 3,136 కిలోల బరువు కలిగిన జీశాట్–19ను రోదసిలోకి పంపనున్నారు. ఇప్పటివరకు ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్లను మాత్రమే ప్రయోగించిన ఇస్రో భవిష్యత్‌లో మానవ సహిత ప్రయోగాలు నిర్వహించేందుకు జీఎస్‌ఎల్‌వీమార్క్3–డీ1 లాంటి భారీ ఉపగ్రహ వాహక నౌకను రూపొందించింది. దీనిద్వారా 5వేల కిలోల బరువు కలిగిన ఉపగ్రహాల్ని సైతం షార్ నుంచి పంపించుకునే వెసులుబాటు కలుగుతుంది. కాగా, 43.43 మీటర్లు ఎత్తు కలిగిన జీఎస్‌ఎల్‌వీ–మార్క్3–డీ1 ప్రయోగం 16.20 నిమిషాల్లో పూర్తి కానుంది. మూడుదశల్లో ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తారు. దీనిద్వారా జీశాట్–19 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కి.మీ. ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహం రోదసిలో పదేళ్లపాటు సేవలందిస్తుంది.