సౌరగోళంపై అధ్యయనానికే ఆదిత్య–ఎల్‌1 మిషన్‌ | satellite from Bangalore URSC reached Shaar | Sakshi
Sakshi News home page

సౌరగోళంపై అధ్యయనానికే ఆదిత్య–ఎల్‌1 మిషన్‌

Published Wed, Aug 16 2023 5:50 AM | Last Updated on Wed, Aug 16 2023 6:58 AM

satellite from Bangalore URSC reached Shaar - Sakshi

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా) : సౌరగోళం రహస్యాలను ఛేదించే లక్ష్యంతో ఇస్రో సీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ ద్వారా 1,475 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహ ప్రయోగాన్ని సెప్టెంబర్‌ మొదటివారంలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో రాకెట్‌ అనుసంధానం పనులు జరుగుతుండగా ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహం బెంగళూరు నుంచి షార్‌కు చేరుకుంది.

ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహం ప్రయోగం ద్వారా సూర్యునిపై దాగి ఉన్న రహస్యాలను పరిశోధనలు చేయనున్నారు. సౌర తుఫాన్‌ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు ఒక  అంచనా వేశారు.  దీంతో పాటు కాంతిమండలం (ఫోటోస్పి­యర్‌), వర్ణ మండలం (క్రోమోస్పియర్‌)పై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించాలని ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు పూనుకున్నారు.

బెంగళూరులోని ఫ్రొపెసర్‌ యూఆర్‌ రావు స్పేస్‌ సెంటర్‌ (యూఆర్‌ఎస్‌సీ)లో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. యూఆర్‌ఎస్‌సీ సెంటర్‌లో పనిచేస్తున్న సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ కే శంకర సుబ్రమణియన్‌  శాటిలైట్‌ సెంటర్‌లో స్పేస్‌ ఆస్ట్రానమీ గ్రూపు (సాగ్‌)కు నాయకత్వం వహిస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహం రూపకల్పన చేశారు. శంకర్‌ సుబ్రమణియన్‌ గతంలో ఖగోళ పరిశోధనకు ఉపయోగించిన ఆస్ట్రోశాట్‌ ఆనే ఉపగ్రహాన్ని,  చంద్రయాన్‌–1. చంద్రయాన్‌–2 మిషన్లకు అనేక హోదాల్లో పనిచేశారు. 

ఆదిత్య ఎల్‌–1 ప్రయోగంలో పరిశోధనలకు పేలోడ్స్‌ ఇవే
1,475 కేజీలు బరువు  కలిగిన ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహంలో ఆరు  పేలోడ్స్‌ బరువు 244 కేజీలు మాత్రమే. మిగిలిన 1,231 కేజీలు ద్రవ ఇంధనం ఉంటుంది. మొదట ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (భూ మధ్యంతర కక్ష్య)లోకి ప్రవేశపెట్టిన తరువాత ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్‌ బింవు–1 (ఎల్‌–1)లోకి చేరవేయడానికి 177 రోజుల సమయం పడుతుంది. అక్కడి నుంచి  సూర్యుడిపై జరిగే మార్పులను నిరంతరం పరిశోధించేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నారు.

ఆదిత్య ఎల్‌–1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్‌పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్‌ అనే ఆరు  ఉపకరణాలు (పేలోడ్స్‌) అమర్చి పంపుతున్నారు. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్‌ వరకు ఉంటుంది. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్‌ డిగ్రీలు వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతు చిక్కడం లేదు. ఈ అంశంపై ఆదిత్య–ఎల్‌1 దృష్టి సారించి పరిశోధనలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. చంద్రుడు, ఆంగారకుడిపై చేసిన పరిశోధనలు మొదటి ప్రయత్నంలోనే  సక్సెస్‌ కావడంతో సూర్యుడిపై కూడా పరిశోధనలు  చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. 

ఆదిత్య ఎల్‌1లో ఆరు పేలోడ్స్‌ పరిశోధనలు.. 
సూర్యుడిపై అధ్యయనం చేయడానికి 1,470 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్‌ 1 ఉపగ్రహంలో ఆరు పేలోడ్స్‌ను అమర్చి పంపుతున్నారు. 

  • 170 కేజీల బరువు కలిగిన  విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ (వెల్సి) అనే పేలోడ్‌ ద్వారా సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది. సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూమి యొక్క వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై పరిశోధనలు చేస్తుంది.  
  • సౌర అతినీలలోహిత ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ (సూట్‌) అనే పేలోడ్‌ 35 కేజీల బరువు వుంటుంది. 200–400 ఎన్‌ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించడం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్‌ చిత్రాలను అందిస్తుంది. సూర్యుడ్ని నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. ఇస్రో ఇతర సంస్థల సహకారంతో పుణేలోని ఇంటర్‌–యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ నుంచి ఏఎన్‌ రామ్‌ ప్రకాష్, దుర్గేష్‌ త్రిపాఠి నేతృత్వంలో ఈ పేలోడ్‌ను అభివృద్ధి చేశారు. 
  • ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (యాస్‌పెక్స్‌) అనే పేలోడ్‌ ద్వారా సౌర గాలి యెక్క వైవిధ్యం, లక్షణాలను తెలియజేయడమే కాకుండా దాని వర్ణపటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది. 
  •  ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్‌ ప్యాకేజీ (పాపా) సౌరగాలి యొక్క కూర్పు దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తుంది. 
  • సోలార్‌ ఎనర్జీ ఎక్స్‌–రే స్పెక్ట్రోమీటరు (సోలెక్స్‌) సోలార్‌ కరోనా యొక్క సమస్యాత్మకమైన కరోనల్‌ హీటింగ్‌ మెకానిజంను అ«ధ్యయనం చేయడానికి, ఎక్స్‌–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోధనలు చేస్తుంది.
  •   హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌–రే స్పెక్ట్రోమీటర్‌ (హెలియోస్‌) సౌర కరోనాలో డైనమిక్‌ ఈవెంట్‌లను గమనించడానికి, విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement