వడ్డీ పెరిగితే ఏం చేద్దాం? | how to move on bank interest! | Sakshi
Sakshi News home page

వడ్డీ పెరిగితే ఏం చేద్దాం?

Published Sun, Feb 2 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

వడ్డీ పెరిగితే ఏం చేద్దాం?

వడ్డీ పెరిగితే ఏం చేద్దాం?

కిషోర్‌కు కారుంది. ఇల్లుంది. కాకపోతే ఇంటిపై లోనుంది. ఇటీవలే రిజర్వు బ్యాంకు కీలకమైన రెపో రేటు 0.25% పెంచటంతో... వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఏర్పడింది. తాను ఇప్పటికే తీసుకున్న హౌసింగ్ లోనుపై వడ్డీ రేట్లు పెరుగుతాయేమోనన్న భయం కిషోర్‌కు పట్టుకుంది. ఎందుకంటే అప్పటికే తన బడ్జెట్ బొటాబొటిగా సరిపోతోంది. బ్యాంకులైతే ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు పెంచబోమని చెబుతున్నాయి. కానీ ఆర్‌బీఐ దగ్గర అవి తీసుకునే రుణాలపై వడ్డీ రేటు పెరిగింది కనక... ఇప్పుడు కాకపోతే కాస్త లేటుగానైనా అవి వడ్డీరేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోక తప్పదు. మరి కిషోర్ ఏం చేయాలి? కిషోర్ ఒక్కడే కాదు... అలా రుణాలు తీసుకున్న వారంతా ఇప్పుడేం చేయాలి? ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? అదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం..
 
 ఈఎంఐ బదులు వ్యవధి పెరగొచ్చు!!
 అత్యవసరం అనిపించినపుడు అప్పు దొరికితే చాలనుకుంటాం. ఏదో ఒక బ్యాంకు... ఎంతో కొంత వడ్డీ.. అప్పు దొరికితే అదే పదివేలు... అనుకుంటాం. తీరా తీసుకున్నాక ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లు పెరుగుతుంటే... కట్టాల్సిన మొత్తం కూడా పెరుగుతుంటుంది. అప్పుడు... అసలు లోను ఎందుకు తీసుకున్నాంరా!! అని బాధపడటమూ సహజమే. ఇలాంటివి ఎదురుకాకుండా ఉండాలంటే..
 సాధారణంగా ఆర్‌బీఐ పాలసీ రేట్లను పెంచిన ప్రతిసారీ బ్యాంకులూ వడ్డీ రేట్లు పెంచేస్తాయని, రుణాలపై నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐలు కూడా భారమవుతాయని మీడియా ఊదరగొడుతూ ఉంటుంది. నిజానికి బ్యాంకుల బేస్ రేటు మారినంత మాత్రాన ఈఎంఐలు మారాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా రుణం తిరిగి చెల్లించే వ్యవధి పెరగొచ్చు. వ్యవధి పెరిగితే.. కట్టే మొత్తమూ పెరుగుతుంది. ఉదాహరణకు రాము 15 ఏళ్ల వ్యవధికి, రాజా 17 ఏళ్ల వ్యవధికి రూ.20 లక్షల గృహ రుణాన్ని 10 శాతం వడ్డీకి తీసుకున్నారనుకుందాం. అదే రేటు కొనసాగిన పక్షంలో రాము మొత్తంగా రూ.38,68,560 కడితే, రాజా మాత్రం రూ.41,66,496 కట్టాల్సి ఉంటుంది. రాజా ఎక్కువ కాలాన్ని ఎంచుకున్నందున ఈఎంఐ కాస్త తగ్గినా.. అదనంగా సుమారు రూ. 2.97 లక్షలు కట్టుకోవాల్సి వస్తుంది.
 కాబట్టి.. వడ్డీ రేటు పెరిగితే ఈఎంఐ మారకుండా .. వ్యవధి మాత్రమే మారినా కట్టాల్సిన మొత్తం పెరుగుతుంది. అందుకని ఇలాంటి పరిస్థితికి సిద్ధపడాలి. వీలైతే... ఈఎంఐని పెంచుకోవడమో లేదా అదనపు భారాన్ని ముందే చెల్లించే మార్గం చూసుకోవటమో చేయాలి.

 

ఇలాంటప్పుడు కొందరు ఒకవైపు ఈఎంఐ కడుతూనే మరోవైపు నెలకింత చొప్పున రికరింగ్ డిపాజిట్‌లో ఉంచి... ఏడాది తర్వాత కొంత మొత్తాన్ని ప్రీపేమెంట్ చేస్తుంటారు. ఈఎంఐని పెంచుకోవడం కన్నా ఈ విధంగా చేయడం వల్ల ఆర్‌డీపై తమకు వడ్డీ కూడా వస్తుంది కనుక.. ఆ మేరకు ప్రయోజనం ఉంటుందనుకుంటారు. కానీ, ఆర్‌డీపై వచ్చే వడ్డీతో పోలిస్తే హోమ్‌లోన్‌పై చెల్లించే వడ్డీ చాలా ఎక్కువ. ఉదాహరణకు ఆర్‌డీపై గరిష్టంగా 9 శాతం మేర వడ్డీ వచ్చినా.. హోమ్ లోన్‌పై వడ్డీ రేటు 10 శాతంపైనే ఉంటోంది. పెపైచ్చు .. ఆర్‌డీ ఆదాయంపై పన్ను భారం కూడా ఉంటుంది. దీనికి బదులుగా వెసులుబాటును బట్టి ఈఎంఐని పెంచుకునే అవకాశాన్ని చూడాలి. ఒకవేళ ఆ తర్వాత వడ్డీ రేటు తగ్గినా.. దానికి అనుగుణంగా చెల్లించాల్సిన మొత్తం కూడా తగ్గి త్వరగా రుణ విముక్తులు కావొచ్చు. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. ఈఎంఐని పెంచుకునేటప్పుడు.. తర్వాత దశల్లో కూడా కొనసాగించగలమా లేదా అన్నది చూసుకోవాలి. లేకపోతే డిఫాల్టయ్యే ప్రమాదముంది. పెరిగిన ఈఎంఐలను తట్టుకోగలిగేదాకా ఇతర ఖర్చులను కొంతైనా తగ్గించుకోవడం మంచిది.
 
 వేరే బ్యాంకుకు మారడం...
 తక్కువ రాబడులిచ్చే సాధనాల్లో నుంచి వైదొలిగి తద్వారా మిగిలే మొత్తాన్ని.. రుణంలో కొంత భాగం ప్రీపేమెంట్ చేసే అవకాశాన్నీ పరిశీలించవచ్చు. అలాగే, రుణం తీసుకున్న బ్యాంకులో వడ్డీ భారం అధికంగా ఉంటే తక్కువ వడ్డీ వసూలు చేసే వేరే బ్యాంకుకు రుణాన్ని మార్చుకోవచ్చు. అయితే, ఇలా మార్చడానికి అయ్యే వ్యయాలు భారీ స్థాయిలో కాకుండా తక్కువగా ఉంటేనే అలాంటి నిర్ణయం తీసుకోవాలి.


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement