Bank Personal Loan Interest Rate Details check Inside,, - Sakshi
Sakshi News home page

పర్సనల్ లోన్ తీసుకోవాలా.. ఈ విషయాలు తెలుసుకున్నారా?

Published Sun, Mar 26 2023 10:56 AM | Last Updated on Sun, Mar 26 2023 11:47 AM

Bank personal loan interest rate details - Sakshi

ఈ రోజు మనిషి ఎంత సంపాదించినా ఏదో తక్కువైనట్లు, ఏమీ మిగలటం లేదని భావిస్తూనే ఉంటాడు, దీనికి ప్రధాన కారణం పెరిగిన నిత్యావసరాల ధరలు కావచ్చు లేదా అధికమైన కుటుంబ ఖర్చులు కావచ్చు. దీనికోసం చాలీ చాలని సంపాదనతో ముందుకు వెళ్లలేక కొన్ని సందర్భాల్లో బ్యాంకుల నుంచి ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి లోన్ తీసుకుంటాడు.

ఒక వ్యక్తి పర్సనల్ లోన్ తీసుకున్న తరువాత ప్రతి నెలా ఈఎమ్ఐ రూపంలో డబ్బు చెల్లిస్తూ ఉంటాడు. లోన్ అనేది ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది, అదే సమయంలో క్రెడిట్ స్కోర్ పెంచుకోవడనికి కూడా సహాయపడుతుంది. కానీ మీరు తీసుకునే లోన్ ఒకే రకమైన వడ్డీ రేటుతో లభించే అవకాశం ఉండదు. వడ్డీ బ్యాంక్, ఇతర ఫైనాన్స్ కంపెనీల మీద ఆధారపడి ఉంటుంది.

లోన్ తీసుకునే వారు తప్పకుండా బ్యాంకు పర్సనల్ లోన్ వడ్డీ రేట్లను తెలుసుకోవాలి. పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు సిబిల్ స్కోర్, రీపేమెంట్ హిస్టరీ, ప్రిన్సిపల్ అమౌంట్, టెన్యూర్ వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా వడ్డీ అనేది పర్సనల్ లోన్ మొత్తంపై లెక్కించబడుతుంది.

ఉదాహరణకు ఒక వ్యక్తి 16 శాతం వడ్డీ రేటుపైన ఐదు లక్షలు, 60 నెలలు/5 సంవత్సరాల సమయానికి (తిరిగి చెల్లించే కాల వ్యవధి) తీసుకున్నప్పుడు అతడు మొత్తం రూ. 7.29 లక్షలు చెల్లించాలి. అంటే ఆ వ్యక్తి అదనంగా రూ. 2.29 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా వివిధ బ్యాంకులు విధించే వడ్డీ రేటుపైన ఆధారపడి ఉంటుంది. వినియోగదారుడు తప్పకుండా గమనించాలి.

వివిధ బ్యాంకులలో వివిధ రకాల వడ్డీ రేట్లు:

  • పర్సనల్ లోన్ వడ్డీ రేటు విషయంలో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. ఇందులో రూ. 20 లక్షల వరకు లోన్ తీసుకుంటే తిరిగి చెల్లించే కాల వ్యవధి 7 సంవత్సరాలు/84 నెలలు ఉంటె వడ్డీ రేటు 9.10 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది.
  • కరూర్ వైశ్యా బ్యాంక్‌లో రూ.10 లక్షల వరకు లోన్ తీసుకుంటే 12 నుంచి 60 నెలల కాలవ్యవధికి గానూ 10.20% నుంచి 13.20% వడ్డీ రేటు లభిస్తుంది.
  • ఇండియన్ బ్యాంక్‌లో రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వ్యక్తిగత రుణానికి 12 నుంచి 36 నెలల కాలవ్యవధికి 10.65% నుంచి 12.15% వడ్డీ రేటు లభిస్తుంది.
  • ఐసీఐసీఐ బ్యాంక్‌లో రూ.50 వేల నుంచి రూ. 50 లక్షల లోపు పర్సనల్ లోన్ కోసం 12 నుంచి 72 నెలల కాలవ్యవధికి 10.75% నుంచి 19% వరకు వడ్డీ రేటు లభిస్తుంది. 

పర్సనల్ లోన్ తీసుకునే వ్యక్తి క్రెడిట్ స్కోరు బాగున్నప్పుడు ఎక్కువ లోన్, కొంత తక్కువ వడ్డీకే తీసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ 750 కంటే తక్కువగా ఉన్నప్పుడు పర్సనల్ లోన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒక వేళా లోన్ లభించినా తక్కువ మొత్తంలో, ఎక్కువ వడ్డీ రేటుకి లభిస్తుంది. వడ్డీ రేట్లను గురించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్స్ గానీ, సమీపంలోని బ్యాంకు ద్వారా తెలుసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement