RD
-
దూసుకొస్తున్న క్రిప్టో కరెన్సీ బ్యాంక్
సాక్షి, ముంబై: ఇటీవలి క్రిప్టోకరెన్సీకి ఆదరణపెరుగుతున్న నేపథ్యంలో యూకేకు చెందిన క్రిప్టో బ్యాంక్ కాషా భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. కాషా, యునైటెడ్ మల్టీ స్టేట్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీల జాయింట్ వెంచర్ అయిన క్రిప్టో బ్యాంక్ యునికాస్ ఆగస్టు15 నాటికి దేశంలో కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రపంచంలోని మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ బ్యాంకుగా అవతరించనున్నామని యూనికాస్ వెల్లడించింది. ఇతర బ్యాంకుల మాదిరిగానే క్రిప్టో బ్యాంక్ పొదుపు, రుణ, వాణిజ్య సేవలను అందిస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన వెంటనే, బ్యాంక్ ఎఫ్‌డీల మాదిరిగానే బిట్‌కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలలో ఎఫ్డీలను,ఆర్డీలను ప్రారంభించాలని భావిస్తోంది. క్రిప్టో ఎఫ్డీకి నిర్దిష్ట మెచ్యూరిటీ వ్యవధి ఉంటుంది. అదేవిధంగా, ఇతర బ్యాంకుల ఆర్డీ మాదిరిగానే చిన్న పెట్టుబడిదారులు చిన్న మొత్తంలో రోజువారీ పెట్టుబడి పెట్టడానికి యూనికాస్ అనుమతించాలని యోచిస్తోంది. రిటైల్ పెట్టుబడిదారులు, వ్యాపారులను ఆకర్షించడమే లక్ష్యమనీ, రీటైల్ పెట్టుబడిదారులు తమ భవిష్యత్ అవసరాల నిమితం పెట్టుబడిపెట్టేలా ప్రోత్సహిస్తామని యునికాస్ మేనేజింగ్ పార్టనర్, సీఈఓ దినేష్ కుక్రేజా చెప్పారు. ఎఫ్డిలతోపాటు ఆర్డీల మాదిరిగానే, చిన్నపెట్టుబడిదారులు చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టొచ్చన్నారు. ప్రస్తుతం యునికాస్కు దేశంలో ఢిల్లీ, జైపూర్, గుజరాత్లో మూడు శాఖలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం రాజస్థాన్ లోని జైపూర్‌లో ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని శాఖలను ప్రారంభించాలని భావిస్తున్నామని కుక్రేజా చెప్పారు. క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ జెబ్‌పే, ఇప్పటికే ఎఫ్డీలను ఆఫర్ చేస్తోంది. ఇక్కడ క్రిప్టోకరెన్సీని 90 రోజుల వరకు డిపాజిట్ చేసి స్థిర వడ్డీని సంపాదించవచ్చు మరోవైపు యునికాస్ క్రిప్టో కరెన్సీ పొదుపు ఖాతాలపై సంవత్సరానికి 4 శాతం నుండి 9.67 శాతం దాకా వడ్డీ అందిస్తుంది. అంతేకాదు క్రిప్టో బ్యాంక్ ఫిజికల్ బ్రాంచెస్ ఉన్న నగరాల్లో తన ప్రీమియం కస్టమర్లకు డోర్-స్టెప్ సేవలను కూడా అందిస్తుంది. -
అలాగైతే ఫ్లెక్సీ ఆర్డీ నయం!
సాక్షి, బిజినెస్ విభాగం : రిస్క్ లేకుండా... క్రమబద్ధంగా నెలవారీ పెట్టుబడులు పెట్టేవారికి బ్యాంకు రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) అనువైనదేనని చెప్పాలి. ఇందులోనూ ఫ్లెక్సిబుల్ రికరింగ్ డిపాజిట్లంటూ ప్రత్యేకంగా ఉన్నాయి. సాధారణ ఆర్డీలయితే ప్రతి నెలా నిర్ణీత మొత్తం, నిర్ణీత కాల వ్యవధి వరకు ఇన్వెస్ట్ చేసేందుకు వీలు కల్పించేవి. నెలవారీ పెట్టుబడుల మొత్తం స్థిరంగా ఉంటుంది. అదే ఫ్లెక్సిబుల్ ఆర్డీలయితే, అదనంగా చేతికి ఆదాయం వచ్చినప్పుడల్లా ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలు కల్పిస్తాయి. దీనివల్ల అధిక రాబడులు అందుకునేందుకు వీలుంటుంది. ఉన్నంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు... ఇది డెట్ సాధనం. పైగా వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. రిస్క్ తీసుకోలేని వారికి, ముఖ్యంగా తక్కువ పన్ను పరిధిలో ఉన్న వారికి అనువుగా ఉంటుంది. దాదాపు అన్ని ప్రభుత్వ బ్యాంకులు, కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకులు ఫ్లెక్సిబుల్ ఆర్డీలను అందిస్తున్నాయి. వీటిలో ఎస్బీఐ, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, కరూర్ వైశ్యా బ్యాంకు ఉన్నాయి. ఫ్లెక్సిబుల్ ఆర్డీ ఖాతా తెరిచే సమయంలో బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఎంతో పేర్కొనాలి. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయాల్సిన కనీస మొత్తం ఇది. బేసిక్ మొత్తం ఎంతన్నది బ్యాంకులను బట్టి మారిపోవచ్చు. ఇండియన్ బ్యాంకులో అయితే రూ.25 నుంచి మొదలవుతుంది. అదే కరూర్ వైశ్యా బ్యాంకు అయితే రూ.1,000గా ఉంది. ఎస్బీఐలో రూ.500 ఉంది. బేసిక్ ఎంతన్నది నిర్ణయించిన తర్వాత ఫెక్సీ స్టెప్ అప్ మొత్తాన్ని ఎంచుకోవాలి. సాధారణంగా ఇది బేసిక్ మొత్తానికి కొన్ని రెట్లుగా ఉంటుంది. ఉదాహరణకు బేసిక్ రూ.500గా ఉంటే అదనంగా రూ.500 చొప్పున కొన్ని రెట్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అధిక ఆదాయం వచ్చిప్పుడు స్టెప్ అప్ రూపంలో ఆర్డీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బేసిక్ మొత్తానికి కనీసం 5 నుంచి 10 రెట్ల వరకు స్టెప్అప్ వాయిదాగా ఇన్వెస్ట్ చేసుకునేందుకు బ్యాంకులు అనుమతిస్తున్నాయి. వార్షికంగా బోనస్ అందుకున్నప్పుడు, ఇతర ప్రోత్సాహకాలు, డివిడెండ్ ఆదాయం లభించినప్పుడు ఇలా ఆర్డీలోకి మళ్లించుకోవచ్చు. పదేళ్ల వరకు ఆర్డీని కొనసాగించుకునే అవకాశం ఉంటుంది. రుణ సదుపాయం, చార్జీలు ఫ్లెక్సిబుల్ ఆర్డీలో చేసే డిపాజిట్లపై రుణ సదుపాయం పొందే వెసులుబాటు ఉంది. డిపాజిట్ మొత్తంలో 75 నుంచి 90 శాతం వరకు రుణాన్ని తీసుకోవచ్చు. ముందస్తుగా ఖాతాను క్లోజ్ చేస్తే పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. వాస్తవ వడ్డీ రేటుకు అర శాతం పెనాల్టీగా కోసేసి మిగిలిన మొత్తాన్ని వెనక్కిస్తారు. అలాగే, వరుసగా మూడు, నాలుగు నెలల పాటు బేసిక్ వాయిదాలు డిపాజిట్ చేయకపోతే బ్యాంకులు ఫ్లెక్సీ ఆర్డీని క్లోజ్ చేసి సేవింగ్స్ బ్యాంకు ఖాతా వడ్డీ రేట్లనే చెల్లిస్తున్నాయి. కనుక వాయిదా మిస్ కాకుండా చూసుకోవడం అవసరం. కనుక ఎన్ని ఆటంకాలు వచ్చినా బేసిక్ మొత్తం చెల్లించే సామర్థ్యానికి అనుగుణంగానే ఉండాలి. శ్లాబును బట్టే పన్ను వర్తింపు... 5–20 శాతం పన్ను పరిధిలో ఉండే, రిస్క్ తీసుకోని ఇన్వెస్టర్లకు ఫ్లెక్సీ ఆర్డీ చక్కగా సరిపోతుంది. ఫ్లెక్సీ ఆర్డీపై లభించే వడ్డీపై ఆదాయపన్ను ఏ శ్లాబులో ఉంటే ఆ మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రూ.10,000ను మించితే 10 శాతం టీడీఎస్‌ను బ్యాంకులు మినహాయించుకుంటాయి. ఒకవేళ పన్ను పరిధిలో ఆదాయం లేనివారు ఫామ్ 15జీ/15హెచ్‌ను బ్యాంకుకు ఇవ్వడం ద్వారా టీడీఎస్‌ను తప్పించుకోవచ్చు. వడ్డీ రేట్లు పెరిగే ఛాన్సుంది... ఫ్లెక్సిబుల్ రికరింగ్ డిపాజిట్‌కు సైతం సాధారణ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లే అమలవుతాయి. ఉదాహరణకు ఆర్డీని ఐదేళ్ల కోసం ఎంచుకున్నారనుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఐదేళ్ల కాల వ్యవధికి ఎంత వడ్డీ రేటు అయితే ఉందో అదే ఫెక్సీబుల్ ఆర్డీకి కూడా వర్తిస్తుంది. అయితే, స్టెప్ అప్ డిపాజిట్లపై (వీలును బట్టి బేసిక్ మొత్తానికి అదనంగా చేసే డిపాజిట్) వడ్డీ రేటు భిన్నంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది ఎలా అంటే ఐదేళ్ల ఫ్లెక్సిబుల్ ఆర్డీ ప్రారంభించిన తర్వాత మొదటి నెలలో బేసిక్ రూ.2,000కు అదనంగా మరో రూ.2,000ను స్టెప్ అప్‌గా ఇన్వెస్ట్ చేశారనుకోండి. స్టెప్అప్ మొత్తం ఇన్వెస్ట్ చేసిన తేదీ నుంచి ఫ్లెక్సిబుల్ ఆర్డీ కాల వ్యవధి ఎంత కాలం మిగిలి ఉందనేది చూడాలి. ఈ ఉదాహరణలో మొదటి నెలలోనే ఇన్వెస్ట్ చేశారు కనుక 4 ఏళ్ల 11 నెలలకు ఎంత వడ్డీ రేటు ఉందో ఆ స్టెప్ అప్ మొత్తంపై అంతే లభిస్తుంది. అదే ఒక ఏడాది తర్వాత రూ.2,000ను స్టెప్ అప్‌గా ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇంకా నాలుగేళ్లపాటు ఆ వాయిదాను ఆర్డీలో ఉంచుతారు గనుక నాలుగేళ్లకు అమల్లో ఉన్న వడ్డీ రేటు వర్తిస్తుంది. బేసిక్ మొత్తానికి ఆర్డీ ప్రారంభించినప్పుడు అమల్లో ఉన్న వడ్డీ రేటే పూర్తి కాల వ్యవధి వరకు కొనసాగుతుంది. ఫ్లెక్సిబుల్ ఆర్డీలో మరో ప్రయోజనం ఉంది. సాధారణ ఆర్డీలో 7 శాతం వడ్డీ రేటు ఉందంటే కాల వ్యవధి ముగిసే వరకు అందులో మార్పు ఉండదు. దీనికి బదులు ఫ్లెక్సిబుల్ ఆర్డీ ప్రారంభించి, మధ్యలో వీలైనంత అదనంగా ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి. వడ్డీ రేట్లు పెరిగే ప్రయోజనాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో వడ్డీ రేట్లు కనిష్ట స్థాయికి దిగొచ్చినందున ఇక ముందు పెరిగినప్పుడు ఆ మేరకు ప్రయోజనం పొందొచ్చు. -
వడ్డీ పెరిగితే ఏం చేద్దాం?
కిషోర్‌కు కారుంది. ఇల్లుంది. కాకపోతే ఇంటిపై లోనుంది. ఇటీవలే రిజర్వు బ్యాంకు కీలకమైన రెపో రేటు 0.25% పెంచటంతో... వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఏర్పడింది. తాను ఇప్పటికే తీసుకున్న హౌసింగ్ లోనుపై వడ్డీ రేట్లు పెరుగుతాయేమోనన్న భయం కిషోర్‌కు పట్టుకుంది. ఎందుకంటే అప్పటికే తన బడ్జెట్ బొటాబొటిగా సరిపోతోంది. బ్యాంకులైతే ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు పెంచబోమని చెబుతున్నాయి. కానీ ఆర్బీఐ దగ్గర అవి తీసుకునే రుణాలపై వడ్డీ రేటు పెరిగింది కనక... ఇప్పుడు కాకపోతే కాస్త లేటుగానైనా అవి వడ్డీరేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోక తప్పదు. మరి కిషోర్ ఏం చేయాలి? కిషోర్ ఒక్కడే కాదు... అలా రుణాలు తీసుకున్న వారంతా ఇప్పుడేం చేయాలి? ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? అదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం.. ఈఎంఐ బదులు వ్యవధి పెరగొచ్చు!! అత్యవసరం అనిపించినపుడు అప్పు దొరికితే చాలనుకుంటాం. ఏదో ఒక బ్యాంకు... ఎంతో కొంత వడ్డీ.. అప్పు దొరికితే అదే పదివేలు... అనుకుంటాం. తీరా తీసుకున్నాక ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లు పెరుగుతుంటే... కట్టాల్సిన మొత్తం కూడా పెరుగుతుంటుంది. అప్పుడు... అసలు లోను ఎందుకు తీసుకున్నాంరా!! అని బాధపడటమూ సహజమే. ఇలాంటివి ఎదురుకాకుండా ఉండాలంటే.. సాధారణంగా ఆర్బీఐ పాలసీ రేట్లను పెంచిన ప్రతిసారీ బ్యాంకులూ వడ్డీ రేట్లు పెంచేస్తాయని, రుణాలపై నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐలు కూడా భారమవుతాయని మీడియా ఊదరగొడుతూ ఉంటుంది. నిజానికి బ్యాంకుల బేస్ రేటు మారినంత మాత్రాన ఈఎంఐలు మారాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా రుణం తిరిగి చెల్లించే వ్యవధి పెరగొచ్చు. వ్యవధి పెరిగితే.. కట్టే మొత్తమూ పెరుగుతుంది. ఉదాహరణకు రాము 15 ఏళ్ల వ్యవధికి, రాజా 17 ఏళ్ల వ్యవధికి రూ.20 లక్షల గృహ రుణాన్ని 10 శాతం వడ్డీకి తీసుకున్నారనుకుందాం. అదే రేటు కొనసాగిన పక్షంలో రాము మొత్తంగా రూ.38,68,560 కడితే, రాజా మాత్రం రూ.41,66,496 కట్టాల్సి ఉంటుంది. రాజా ఎక్కువ కాలాన్ని ఎంచుకున్నందున ఈఎంఐ కాస్త తగ్గినా.. అదనంగా సుమారు రూ. 2.97 లక్షలు కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి.. వడ్డీ రేటు పెరిగితే ఈఎంఐ మారకుండా .. వ్యవధి మాత్రమే మారినా కట్టాల్సిన మొత్తం పెరుగుతుంది. అందుకని ఇలాంటి పరిస్థితికి సిద్ధపడాలి. వీలైతే... ఈఎంఐని పెంచుకోవడమో లేదా అదనపు భారాన్ని ముందే చెల్లించే మార్గం చూసుకోవటమో చేయాలి. ఇలాంటప్పుడు కొందరు ఒకవైపు ఈఎంఐ కడుతూనే మరోవైపు నెలకింత చొప్పున రికరింగ్ డిపాజిట్లో ఉంచి... ఏడాది తర్వాత కొంత మొత్తాన్ని ప్రీపేమెంట్ చేస్తుంటారు. ఈఎంఐని పెంచుకోవడం కన్నా ఈ విధంగా చేయడం వల్ల ఆర్డీపై తమకు వడ్డీ కూడా వస్తుంది కనుక.. ఆ మేరకు ప్రయోజనం ఉంటుందనుకుంటారు. కానీ, ఆర్డీపై వచ్చే వడ్డీతో పోలిస్తే హోమ్‌లోన్‌పై చెల్లించే వడ్డీ చాలా ఎక్కువ. ఉదాహరణకు ఆర్డీపై గరిష్టంగా 9 శాతం మేర వడ్డీ వచ్చినా.. హోమ్ లోన్‌పై వడ్డీ రేటు 10 శాతంపైనే ఉంటోంది. పెపైచ్చు .. ఆర్డీ ఆదాయంపై పన్ను భారం కూడా ఉంటుంది. దీనికి బదులుగా వెసులుబాటును బట్టి ఈఎంఐని పెంచుకునే అవకాశాన్ని చూడాలి. ఒకవేళ ఆ తర్వాత వడ్డీ రేటు తగ్గినా.. దానికి అనుగుణంగా చెల్లించాల్సిన మొత్తం కూడా తగ్గి త్వరగా రుణ విముక్తులు కావొచ్చు. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. ఈఎంఐని పెంచుకునేటప్పుడు.. తర్వాత దశల్లో కూడా కొనసాగించగలమా లేదా అన్నది చూసుకోవాలి. లేకపోతే డిఫాల్టయ్యే ప్రమాదముంది. పెరిగిన ఈఎంఐలను తట్టుకోగలిగేదాకా ఇతర ఖర్చులను కొంతైనా తగ్గించుకోవడం మంచిది. వేరే బ్యాంకుకు మారడం... తక్కువ రాబడులిచ్చే సాధనాల్లో నుంచి వైదొలిగి తద్వారా మిగిలే మొత్తాన్ని.. రుణంలో కొంత భాగం ప్రీపేమెంట్ చేసే అవకాశాన్నీ పరిశీలించవచ్చు. అలాగే, రుణం తీసుకున్న బ్యాంకులో వడ్డీ భారం అధికంగా ఉంటే తక్కువ వడ్డీ వసూలు చేసే వేరే బ్యాంకుకు రుణాన్ని మార్చుకోవచ్చు. అయితే, ఇలా మార్చడానికి అయ్యే వ్యయాలు భారీ స్థాయిలో కాకుండా తక్కువగా ఉంటేనే అలాంటి నిర్ణయం తీసుకోవాలి.