సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై దేశీయ నిర్మాణ రంగం గంపెడాశలు పెట్టుకుంది. స్థిరాస్తి రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడంతో పాటూ సులభతర ఆర్థిక లభ్యత, జీఎస్‌టీ రేట్ల తగ్గింపు వంటివి ప్రకటించి దేశీయ రియల్ ఎస్టేట్ రంగానికి చేదోడుగా నిలవాలని పరిశ్రమ వర్గాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి. నివాస విభాగంలో డిమాండ్‌ను పెంచాలంటే పలు కీలక ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపాయి. అందులోని పలు కీలకాంశాలు..
- అఫర్డబుల్ హౌసింగ్ ధరలలో సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఆస్తి పరిమాణం, ధర, కొనుగోలుదారుల ఆదాయం ఆధారంగా అందుబాటు గృహాల నిర్వచనాన్ని కేంద్ర గృహ నిర్మాణం మరియు పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ నిర్వచించింది. నాన్-మెట్రోపాలిటన్ సిటీలు, నగరాలలో అఫర్డబుల్ హౌసింగ్ 90 చ.మీ. వరకు కార్పెట్ ఏరియాతో ఉండాలి. ప్రధాన నగరాల్లో అయితే 60 చ.మీ. కార్పెట్ ఏరియా. ఈ రెండింటికీ ధర రూ.45 లక్షల లోపు ఉండాలి. రానున్న బడ్జెట్‌లో ఈ విభాగాన్ని మరింత విస్తరించి ఎక్కువ మంది కస్టమర్లు ఈ పరిధిలోకి తీసుకురావాలి.
- అలాగే నగరాల వారీగా ధరల పరిమితులను సవరించాల్సిన అవసరం ఉంది. 90, 60 చ.మీ. కార్పెట్ ఏరియా యూనిట్ల పరిమాణం బాగానే ఉన్నప్పటికీ.. ధర రూ.45 లక్షలు అనేది చాలా నగరాలలో ఆచరణయోగ్యంగా లేవు. ఉదాహరణకు ముంబైలో రూ.45 లక్షల బడ్జెట్ అనేది చాలా తక్కువ అందుకే దీన్ని రూ.85 లక్షలకు పెంచాలి. ఇతర నగరాల్లో రూ.60-65 లక్షలకు పెంచాల్సిన అవసరం ఉంది. ధరల సవరణతో ఎక్కువ గృహాలు అఫర్డబులిటీ కిందకి వస్తాయి. దీంతో కొనుగోలుదారులు 1 శాతం జీఎస్‌టీ, ప్రభుత్వ రాయితీలు, వడ్డీ చెల్లింపులతో కలిపి మొత్తం రూ.3.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు వంటి బహుళ ప్రయోజనాలను పొందుతారు.
- పెద్ద మొత్తంలో అఫర్డబుల్ హౌసింగ్‌లను నిర్మించేందుకు ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములను కేటాయించాలి. భారీ పరిశ్రమల శాఖ, రైల్వేలు, పోర్ట్ ట్రస్ట్‌లు మొదలైన వాటి పరిధిలోకి వచ్చే నగరాల్లోని కొన్ని భూములను సంబంధిత ప్రభుత్వ సంస్థలు విడుదల చేయాలి. తక్కువ ధరతో భూమి లభ్యత పెరిగితే ప్రాపర్టీ ధరలను నియంత్రించవచ్చు.
- గత బడ్జెట్‌లో అందించిన అఫర్డబుల్, అద్దె గృహాల రుణాలపై రూ.1.5 లక్షల అదనపు మినహాయింపు గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగియనుంది. దీన్ని మరో ఏడాది పాటు పొడిగించాలి. దీంతో ఈ విభాగంలో సరఫరా పెరుగుతుంది. అనరాక్ నివేదిక ప్రకారం గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలోని మొత్తం గృహాల సరఫరాలో 26 శాతం అఫర్డబుల్ హౌసింగ్‌లే ఉన్నాయి.
- ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24 కింద గృహ రుణ వడ్డీ రేట్లపై రూ.2 లక్షల పన్ను రాయితీని రూ.5 లక్షలకు పెంచాలి. పన్ను రేట్లలో కోత లేదా సవరించిన పన్ను శ్లాబ్‌ల ద్వారా వ్యక్తిగత పన్ను ఉపశమనం ప్రకటించాలి. ప్రత్యేకించి సెక్షన్ 80సీ(ఏడాదికి రూ.1.5 లక్షలకు) కింద తగ్గింపు పరిమితిని చివరిసారిగా 2014లో పెంచారు. రానున్న బడ్జెట్‌లో ఈ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉంది.
(చదవండి: హైదరాబాద్‌లో అమెజాన్ సొంత క్యాంపస్.. అదిరిపోయే సౌకర్యాలు!)
Comments
Please login to add a commentAdd a comment