సంపాదించిన డబ్బు, బంగారం, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను భద్రపరిచేందుకు బ్యాంకులు లాకర్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి బ్యాంకు కాలిపోతే మన డబ్బు, బంగారంకు ఎవరు బాధ్యత వహిస్తారనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా. ఎలాగో ఆ డబ్బంతా బ్యాంకు లాకర్‌లో ఉంచాం కాబట్టి బ్యాంకే దానికి పూర్తి బాధ్యత వహిస్తుందని అనుకుంటాం. కానీ నిబంధనలు అందుకు భిన్నంగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
ఉదాహరణకు సునిల్ ఏడాదికి రూ.3000తో బ్యాంకు లాకర్ రెంట్ తీసుకున్నాడు. ఆ లాకర్‌లో 300 గ్రాముల బంగారం(ప్రస్తుత ధర ప్రకారం దాని విలువ సుమారు రూ.18 లక్షలు) ఉంచాడు. తానుంటున్న ప్రాంతంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. దాంతో తాను కష్టపడి సంపాదించిన డబ్బు రూ.10 లక్షలు కూడా ఆ లాకర్‌లో పెట్టాడు. కొన్ని రోజులు గడిచాక తనకు డబ్బు అవసరం ఉండి బ్యాంకుకు వెళ్లి లాకర్ తాళం తీసిన సునిల్ షాక్‌కు గురయ్యాడు. తాను లాకర్లో ఉంచిన రూ.10 లక్షలు చెదలు పట్టింది. ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా పాడయ్యాయి. వెంటనే బ్యాంకు సిబ్బందికి విషయం చెప్పాడు. కానీ నిబంధనల ప్రకారం తనకు డబ్బు తిరిగి చెల్లించడం కుదరదని చెప్పారు. ఒకవేళ బంగారం పోతే మాత్రం నిబంధనల ప్రకారం..ఏటా తాను చెల్లిస్తున్న రూ.3000కు 100 రెట్లు అంటే రూ.3,00,000 వరకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు. అంతకు మించి విలువైన బంగారం అందులో ఉన్నా రూ.మూడు లక్షలే చెల్లించేలా నిబంధనలున్నాయని వివరించారు.
బ్యాంకులు లాకర్ రూమ్‌కు అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తాయి. 24*7 కెమెరా సదుపాయం ఉంటుంది. భద్రత కోసం అలారం సౌకర్యం ఏర్పాటు చేస్తారు. లాకర్ల భద్రతకు సంబంధించి బ్యాంకులు పటిష్ట చర్యలే పాటిస్తాయి. కానీ ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటన జరిగితే మాత్రం తదుపరి పర్యవసనాలకు కస్టమర్లు సిద్ధంగా ఉండాల్సిందే.
ఇదీ చదవండి: రూ.20 వేలతో రూ.17 లక్షలు సంపాదన!
డబ్బును లాకర్లు, బీరువాలో ఉంచడం వల్ల కాలంతోపాటు దాని విలువ తగ్గిపోతుంది. నిత్యం ద్రవ్యోల్బణం పెరుగుతున్న కారణంగా ఏటా సుమారు 5-6 శాతం మేర డబ్బు విలువ పడిపోతుంది. కాబట్టి దీర్ఘకాల పెట్టుబడులు ఎంచుకుని అందులో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఎఫ్‌డీ, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లు..వంటివి ఎంచుకోవచ్చని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment