bank lockers
-
బ్యాంకు లాకర్లో డబ్బు కాలిపోతే తిరిగిస్తారా..?
సంపాదించిన డబ్బు, బంగారం, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను భద్రపరిచేందుకు బ్యాంకులు లాకర్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి బ్యాంకు కాలిపోతే మన డబ్బు, బంగారంకు ఎవరు బాధ్యత వహిస్తారనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా. ఎలాగో ఆ డబ్బంతా బ్యాంకు లాకర్లో ఉంచాం కాబట్టి బ్యాంకే దానికి పూర్తి బాధ్యత వహిస్తుందని అనుకుంటాం. కానీ నిబంధనలు అందుకు భిన్నంగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.ఉదాహరణకు సునిల్ ఏడాదికి రూ.3000తో బ్యాంకు లాకర్ రెంట్ తీసుకున్నాడు. ఆ లాకర్లో 300 గ్రాముల బంగారం(ప్రస్తుత ధర ప్రకారం దాని విలువ సుమారు రూ.18 లక్షలు) ఉంచాడు. తానుంటున్న ప్రాంతంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. దాంతో తాను కష్టపడి సంపాదించిన డబ్బు రూ.10 లక్షలు కూడా ఆ లాకర్లో పెట్టాడు. కొన్ని రోజులు గడిచాక తనకు డబ్బు అవసరం ఉండి బ్యాంకుకు వెళ్లి లాకర్ తాళం తీసిన సునిల్ షాక్‌కు గురయ్యాడు. తాను లాకర్లో ఉంచిన రూ.10 లక్షలు చెదలు పట్టింది. ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా పాడయ్యాయి. వెంటనే బ్యాంకు సిబ్బందికి విషయం చెప్పాడు. కానీ నిబంధనల ప్రకారం తనకు డబ్బు తిరిగి చెల్లించడం కుదరదని చెప్పారు. ఒకవేళ బంగారం పోతే మాత్రం నిబంధనల ప్రకారం..ఏటా తాను చెల్లిస్తున్న రూ.3000కు 100 రెట్లు అంటే రూ.3,00,000 వరకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు. అంతకు మించి విలువైన బంగారం అందులో ఉన్నా రూ.మూడు లక్షలే చెల్లించేలా నిబంధనలున్నాయని వివరించారు.బ్యాంకులు లాకర్ రూమ్‌కు అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తాయి. 24*7 కెమెరా సదుపాయం ఉంటుంది. భద్రత కోసం అలారం సౌకర్యం ఏర్పాటు చేస్తారు. లాకర్ల భద్రతకు సంబంధించి బ్యాంకులు పటిష్ట చర్యలే పాటిస్తాయి. కానీ ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటన జరిగితే మాత్రం తదుపరి పర్యవసనాలకు కస్టమర్లు సిద్ధంగా ఉండాల్సిందే.ఇదీ చదవండి: రూ.20 వేలతో రూ.17 లక్షలు సంపాదన!డబ్బును లాకర్లు, బీరువాలో ఉంచడం వల్ల కాలంతోపాటు దాని విలువ తగ్గిపోతుంది. నిత్యం ద్రవ్యోల్బణం పెరుగుతున్న కారణంగా ఏటా సుమారు 5-6 శాతం మేర డబ్బు విలువ పడిపోతుంది. కాబట్టి దీర్ఘకాల పెట్టుబడులు ఎంచుకుని అందులో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఎఫ్డీ, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లు..వంటివి ఎంచుకోవచ్చని సూచిస్తున్నారు. -
బ్యాంక్ లాకర్లపై అనాసక్తి
ముంబై: బ్యాంక్ లాకర్లు.. ఒకప్పుడు వీటిని పొందడం కష్టంగా ఉండేది. డిమాండ్ ఎక్కువ, సరఫరా తక్కువగా అన్నట్టు గతంలో పరిస్థితి. కానీ, ఇప్పుడు బ్యాంక్ లాకర్లు అంటే చాలా మందిలో అనాసక్తి నెలకొంది. లాకర్ చార్జీలు గణనీయంగా పెరిగిపోవడం, క్లిష్టమైన కేవైసీ ప్రక్రియ తదితర ఎన్నో అంశాలు లాకర్లు అంటే మొహం మొత్తిపోయేలా చేస్తున్నాయి. 50 శాతం మంది కస్టమర్లు లాకర్లను ఇటీవలి కాలంలో మూసివేయడం, లేదంటే మూసివేయాలనే యోచనతో ఉన్నారు. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి. 11,000 మంది అభిప్రాయాలను తెలుసుకుని లోకల్ సర్కిల్స్ ఈ వివరాలను విడుదల చేసింది. లాకర్లను మూసివేసినట్టు 36 శాతం మంది చెప్పగా.. అధిక చార్జీల కారణంగా లాకర్లను మూసివేయాలని అనుకుంటున్నట్టు 4 శాతం మంది పేర్కొన్నారు. 16 శాతం మంది లాకర్ సైజును తగ్గించుకున్నట్టు చెప్పారు. నూతన చార్జీలు తమకు సమ్మతమేనని, లాకర్లను కొనసాగిస్తామని 36 శాతం మంది వెల్లడించారు. ‘‘బ్యాంక్ సేఫ్ డిపాజిట్ లాకర్లకు సంబంధించి కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో శాఖకు వచ్చి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలంటూ కస్టమర్లను బ్యాంక్‌లు కోరుతున్నాయి. డిసెంబర్ 31 నాటికి కస్టమర్లు బ్యాంక్‌కు వెళ్లి లీజ్ డాక్యుమెంట్‌పై సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇటీవలి సంవత్సరాల్లో లాకర్ చార్జీలు కూడా పెరిగాయి’’అని లోకల్ సర్కిల్స్ తెలిపింది. చార్జీలు గణనీయంగా పెరగడం వల్లే తాము లాకర్లను రద్దు చేసుకున్నామని, లేదంటే మూసివేయాలని అనుకుంటున్నామని, లేదంటే సైజును తగ్గించుకుంటామని 56 శాతం మంది చెప్పినట్టు ఈ సంస్థ వెల్లడించింది. -
బ్యాంక్ లాకర్.. కాదా బేఫికర్?
బ్యాంకు లాకర్లో విలువైన వాటిని ఉంచేస్తే.. ఎటువంటి భయం లేకుండా ఇంట్లో ప్రశాంతంగా నిద్రించొచ్చని భావించడం పొరపాటే. లాకర్ల విషయంలో బ్యాంకుల బాధ్యత కూడా పరిమితమే. సుప్రీంకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా ఇచి్చన ఆదేశాల నేపథ్యంలో ఆర్బీఐ ఇటీవలే లాకర్లకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. లాకర్లో ఉంచిన వాటిని దోపిడీ లేదా దొంగతనం చేస్తే? లాకర్ కీ కనిపించకుండా పోతే? లాకర్ అద్దె చెల్లించకపోతే? ఇలా ఎన్నో ప్రశ్నలకు జవాబులను లాకర్ హోల్డర్లు తెలుసుకోవడం ఎంతో అవసరం. ఈ వివరాలతో కూడిన ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది.. లాకర్ అంటే? ఇది ఒక ఖాతా వంటిది. విలువైన వస్తువులు.. ఆభరణాలు, డాక్యుమెంట్లను ఇందులో ఉంచు కోవచ్చు. రెండు కీలు(తాళం చెవులు) ఉంటాయి. అందులో ఒక టి బ్యాంకు దగ్గర, రెండోది లాకర్ దారుని వద్ద ఉంటాయి. ఏదో ఒక కీ సాయంతో లాకర్‌ను తెరవడం సాధ్యం కాదు. రెండు కీలు ఉంటేనే అది సాధ్యపడుతుంది. బ్యాంకు ఉద్యోగి తొలుత తన దగ్గరున్న కీతో లాకర్ రూమ్‌ను తెరుస్తారు. ఆ తర్వాత లాకర్హోల్డర్ తన దగ్గరున్న కీ సాయంతో లాకర్‌ను వినియోగించుకోవడం సాధ్యపడుతుంది. బ్యాంకులు భద్రతాపరంగా అధిక నాణ్యతతో కూడిన లాకర్లను వినియోగిస్తుంటాయి. అందుకే వీటిని సేఫ్ డిపాజిట్ లాకర్లుగా పిలుస్తుంటారు. ఎవరైనా అర్హులే.. మీకు సమీపంలోని బ్యాంకు శాఖలో లాకర్ సదుపాయాన్ని పొందొచ్చు. ఆ బ్యాంకు శాఖలో ఖాతా లేకపోయినా ఫర్వాలేదు. గతంలో తమ ఖాతాదారులకే బ్యాంకులు ఈ సదుపాయం అందించేవి. కానీ, ఎవరికైనా ఈ సేవలు అందించాలని ఆర్బీఐ 2021 ఆగస్ట్ 18 నాటి ఆదేశాల్లో పేర్కొంది. ఒకవేళ లాకర్ ఖాళీగా లేకుంటే.. దరఖాస్తుదారులతో ఒక వేచి ఉండే జాబితాను నిర్వహిస్తూ.. ఖాళీ అయిన వాటిని వరుస క్రమంలో జాబితాలోని వారికి తప్పనిసరిగా కేటాయించాలి. చట్టవిరుద్ధమైనవి, ప్రమాదకరమైన వాటిని లాకర్లో ఉంచనంటూ ధ్రువీకరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు లాకర్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాలి. బాధ్యతలు, హక్కుల వివరాలు ఇందులో ఉంటాయి. ఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉంటాయి. నూతన లాకర్ ఒప్పందంపై ప్రస్తుత లాకర్ హోల్డర్లు సైతం 2023 జనవరి 1 నాటికి సంతకం చేయాల్సి ఉంటుంది. అద్దె బ్యాంకులు లాకర్ అద్దెను వార్షికంగా ఒక సారి వసూలు చేస్తుంటాయి. అంతేకాదు, లాకర్ కోసం డిపాజిట్ కూడా చేయాలని కోరుతుంటాయి. ఎందుకంటే లాకర్ అద్దె చెల్లించకపోతే.. డిపాజిట్ నుంచి మినహాయించుకునేందుకు అలా చేస్తాయి. మూడేళ్ల కాలానికి లాకర్ అద్దెతోపాటు, లాకర్‌ను తెరవాల్సి వస్తే అయ్యే చార్జీలను కలిపి ఆ మేరకు డిపాజిట్‌గా తీసుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అధికారం కలి్పంచింది. ఇంతకుమించి డిపాజిట్ చేయాలని బ్యాంకులు కోరడానికి వీల్లేదు. అలాగే, లాకర్ కోసం డిపాజిట్ అన్నది తప్పనిసరి కాదు. బ్యాంకులో అప్పటికే కొన్నేళ్లుగా ఖాతా నిర్వహిస్తున్నట్టయితే మీ చరిత్ర ఆధారంగా బ్యాంకులు డిపాజిట్ నుంచి మినహాయింపును ఇవ్వొచ్చు. లాకర్‌ను స్వా«దీనం చేసేస్తే తిరిగి ఈ డిపాజిట్‌ను వెనక్కి పొందొచ్చు. ఇంటికి లేదా కార్యాలయానికి సమీపంలోని బ్యాంకు శాఖలో సౌకర్యం కోసం లాకర్‌ను తెరిచిన తర్వాత.. అనూహ్య కారణాలతో ఆయా బ్యాంకు శాఖను వేరే ప్రాంతానికి మార్చాల్సి వచి్చనా.. లేదా వేరే బ్యాంకుతో విలీనం అయిన సందర్భాల్లో లాకర్ హోల్డర్లకు రెండు నెలల వ్యవధిని బ్యాంకులు ఇస్తాయి. లాకర్‌ను బ్యాంకుతోపాటే మార్చుకోవచ్చు. లేదా మూసేయవచ్చు. అద్దె చెల్లించకపోతే? వరుసగా మూడు సంవత్సరాల పాటు లాకర్ అద్దె చెల్లించకపోతే.. ఆయా లాకర్లను బలవంతంగా తెరిచేందుకు బ్యాంకులకు అధికారం ఉంటుంది. కాకపోతే దీనికంటే ముందు బ్యాంకు తన ఖాతాదారుకు ఇదే విషయమై సమాచారం (నోటీస్) కూడా ఇస్తాయి. ఈ మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సందేశం ఇస్తాయి. నోటీసును స్వీకరించకుండా, మెయిల్, ఎస్ఎంఎస్కు స్పందన రాకపోతే.. అప్పుడు దినపత్రికల్లో పబ్లిక్ నోటీస్ జారీ చేస్తాయి. తగినంత సమయం ఇచ్చిన తర్వాత అప్పటికీ ఎవరి నుంచి స్పందన రాకపోతే.. బ్యాంకు అధికారి, ఇద్దరు సాక్షుల సమక్షంలో లాకర్‌ను తెరుస్తారు. ఈ ప్రక్రియను వీడియో కూడా తీస్తాయి. భవిష్యత్తులో కోర్టుల్లో కేసులు నమోదైతే వీటిని సాక్ష్యాలుగా బ్యాంకు సమరి్పస్తుంది. నగదు సహా లాకర్లో ఉన్న వాటిని సీల్ చేసి భద్రంగా ఉంచుతాయి. నిర్వహణ ఖాతాదారులు లాకర్లను తెరిచి, చూసుకునే సమయంలో వారికంటూ గోప్యత ఉండేలా బ్యాంకులు చూడాలి. అంతేకాదు లాకర్‌ను వినియోగించుకున్న రోజు అందుకు సంబంధించి ఈ మెయిల్, ఎస్ఎంఎస్ అలర్ట్‌లను కూడా బ్యాంకులు ఇక మీదట తప్పకుండా పంపించాలి. తేదీ, సమయం వివరాలు అందులో ఉంటాయి. దీంతో ఒకవేళ తను కాకుండా, మరొకరు లాకర్‌ను యాక్సెస్ చేస్తే ఖాతాదారు అప్రమత్తం అయ్యేందుకే ఈ ఏర్పాటు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తెరిచే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఖాతాదారు ప్రమేయం లేకుండా లాకర్ యాక్సెస్ జరిగి ఉంటే.. అందుకు ఫిర్యాదుల పరిష్కార యంత్రంగా కూడా ఉంటుంది. లాకర్ దారులు వాటిని తెరిచి, మూసేసి వెళ్లిన తర్వాత బ్యాంకు కస్టోడియన్ ఆయా లాకర్లను విధిగా పరీక్షించాలి. ఏదైనా సందర్భంలో లాకర్‌ను తెరిచి, తిరిగి సరిగ్గా క్లోజ్ చేయకుండా వెళ్లి ఉంటే.. బ్యాంకు కస్టోడియన్ వాటిని క్లోజ్ చేయాలి. అదే విషయాన్ని రిజిస్టర్లో నమోదు చేయడంతోపాటు.. ఖాతాదారుకు తెలియజేయాలి. లాకర్దారు మరణిస్తే..? లాకర్లకు సంబంధించి నామినేషన్, లాకర్ హోల్డర్ మరణానికి గురైతే.. లాకర్లలో ఉన్న వాటిని నామినీలకు అందించే విషయమైన ప్రతీ బ్యాంకు తగిన విధానాన్ని కలిగి ఉంటుంది. అవసరమైన ధ్రువీకరణ పత్రాలను నామినీ సమరి్పంచినట్టయితే లాకర్లలో ఉన్నవాటిని పొందేందుకు బ్యాంకులు అనుమతిస్తాయి. నామినీ నమోదై లేకపోతే.. చట్టబద్ధమైన వారసులకు నిబంధనల మేరకు అందిస్తాయి. క్లెయిమ్‌తోపాటు అవసరమైన అన్ని పత్రాలు అందిన నాటి నుంచి 15 పనిదినాల్లో బ్యాంకులు వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది. బ్రేక్ చేయొచ్చు.. ఖాతాదారు లాకర్ కీ పోయిందని అభ్యర్థన పెట్టుకున్నప్పుడు, లాకర్ జప్తునకు సంబంధించి కోర్టుల ఆదేశాలతో దర్యాప్తు అధికారులు బ్యాంకును సంప్రదించిన సందర్భాల్లోనూ లాకర్‌ను తెరుస్తారు. లాకర్దారు నిబంధనలను పాటించని సందర్భాల్లోనూ ఇదే చోటు చేసుకుం టుంది. లాకర్ల విషయంలో బ్యాంకుల బాధ్యత ప్రకృతి విపత్తుల వల్ల (భూకంపాలు, వరదలు తదితర) లాకర్లలోని వాటికి నష్టం కలిగితే బ్యాంకులు ఎటువంటి పరిహారాన్ని చెల్లించవు. ఖాతాదారుల నిర్లక్ష్యం వల్ల వాటిల్లే నష్టానికి సైతం చెల్లింపులు చేయవు. అగ్ని ప్రమాదం, దొంగతనం, దోపిడీ, భవనం కుప్పకూలిపోవడం, బ్యాంకు ఉద్యోగి మోసం వల్ల లాకర్లలోని వాటికి నష్టం వాటిల్లితే చెల్లింపుల బాధ్యత బ్యాంకులపై ఉంటుంది. ఎందుకంటే చోరీలు, అగ్ని ప్రమాదాల నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకుపై ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మాత్రం తమకు సంబంధం లేదని బ్యాంకులు చెప్పడానికి లేదు. లాకర్‌కు వార్షికంగా వసూలు చేసే అద్దెకు గరిష్టంగా 100 రెట్ల పరిహారాన్ని బ్యాంకులు చెల్లించగలవు. ఉదాహరణకు లాకర్ అద్దె రూ.2,000 ఉందనుకుంటే రూ.2లక్షలు పరిహారంగా లభిస్తుంది. ఎందుకంటే లాకర్లలో ఏవి ఉంచుతున్నారు, తిరిగి ఏవి తీసుకెళుతున్నారు? ఇటువంటి వివరాలను బ్యాంకులు నమోదు చేయవు. ఖాతాదారుల గోప్యతకు భంగం కలగకుండా చూడడంలో భాగంగా ఈ పనికి దూరంగా ఉంటాయి. అటువంటప్పుడు ఫలానావి పోయాయని నిర్ధారించడానికి అవకాశం ఉండదు. కనుక లాకర్ అద్దెకు 100 రెట్లకే పరిహారాన్ని పరిమితం చేసింది ఆర్బీఐ. లాకర్లకు సంబంధించి బ్యాంకులు బీమా కవరేజీని కూడా అందించడం లేదు. లాకర్లలో భద్రత? బ్యాంకు లాకర్లను ఏర్పాటు చేసిన చోట తగినంత భద్రతా చర్యలు తీసుకోవడం బాధ్యతల్లో భాగమే. లాకర్ గది/వాల్ట్‌కు ఒక్కటే ప్రవేశం, వెలుపలి ద్వారం ఉండాలి. వర్షాలు, వరదలు వచి్చనాకానీ లాకర్లు దెబ్బతినకుండా చూడాలి. అగ్ని ప్రమాదాలకు అవకాశం లేని విధంగా.. ఆ రిస్క్‌ను తగ్గించే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది. ఈ ప్రమాదాల రిస్‌్కను తగ్గించేందుకు బ్యాంకు ఉద్యోగులు నిపుణులతో కలసి ఇంజనీరింగ్/భద్రతా పరిస్థితులను సమీక్షించి, అవసరమైన చర్యలు తీసుకుంటూ ఉండాలి. అంతేకాదు లాకర్లకు ఎప్పుడూ కూడా తగినంత రక్షణ కూడా ఏర్పాటు చేయాలి. లాకర్ ఆవరణలోకి వెళ్లి, వచ్చే వారిని కవర్ చేసేందుకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. 180 రోజుల సీసీటీవీ కెమెరా రికార్డులను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. తన లాకర్‌ను తన ప్రమేయం లేకుండా ఓపెన్ చేశారని, లాకర్లో ఉంచినవి కనిపించడం లేదని ఖాతాదారు ఫిర్యాదు చేసిన సందర్భంలో దర్యాప్తునకు ఈ సీసీటీవీ కెమెరా రికార్డులు ఆధారంగా పనిచేస్తాయి. బ్యాంకులు ఏర్పాటు చేసే మెకానికల్ లాకర్లు భారత ప్రమా ణాల మండలి (బీఐఎస్) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఎలక్ట్రానిక్‌గా తెరిచే లాకర్లకు పూర్తి సైబర్ భద్రత ఉండాలి. కీ కోల్పోతే..? బ్యాంకు ఇచ్చిన లాకర్ కీని ఎక్కడైన పోగొట్టుకున్నట్టు అయితే వెంటనే ఆ విషయాన్ని బ్యాంకుకు తెలియజేయాలి. కనిపించకుండా పోయిన కీ తిరిగి భవిష్యత్తులో ఎప్పుడైనా లభిస్తే బ్యాంకుకు స్వాధీనం చేస్తానంటూ లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు లాకర్‌ను బద్దలు కొట్టడం, తిరిగి కొత్త కీ ఏర్పాటు చేసేందుకు అయ్యే చార్జీలన్నింటినీ ఖాతాదారే భరించాల్సి వస్తుంది. ఈ ప్రక్రియను అంతా ఖాతాదారు సమక్షంలోనే బ్యాంకులు టెక్నీషియన్లతో నిర్వహిస్తాయి. ఎందుకంటే లాకర్లో ఉన్న వాటికి నష్టం వాటిల్లలేదన్న భరోసా ఖాతాదారుకు ఉండాలి కనుక. -
ఆర్బీఐ ‘లాకర్’ షాక్!
ముంబై: బ్యాంకు లాకర్ సేవలను వినియోగించుకుంటున్నారా? అయితే ఆర్బీఐ సవరిత నిబంధనల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. చోరీ, అగ్నిప్రమాదం, భవనం కుప్పకూలిపోవడం, బ్యాంకు ఉద్యోగుల మోసం.. ఇలాంటి కారణాలతో లాకర్లలో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే, వార్షిక లాకర్ అద్దెకు గరిష్టంగా 100 రెట్ల వరకే పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు ఏటా రూ.500 చొప్పున లాకర్ చార్జీలు చెల్లిస్తారనుకోండి.. లాకర్లో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే గరిష్ట పరిహారం రూ.50,000కు మించి రాదు. ఈ విషయంలో బ్యాంకుల బాధ్యతను ఆర్బీఐ పరిమితం చేసింది. అంతేకాదు.. లాకర్లలో చట్టవిరుద్ధమైనవి, ప్రమాదకరమైన వాటిని ఉంచకూడదు. అలాగే, ‘‘ప్రకృతి విపత్తులైన భూకంపాలు, వరదలు, పిడుగులు పడడం కారణంగా లాకర్లలోని వాటికి నష్టం వాటిల్లితే ఆ బాధ్యత బ్యాంకులపై ఉండదు’’ అని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు సవరించిన నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంకులు ఈ మేరకు లాకర్ ఒప్పందంలో సవరణలు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులు అందిస్తున్న డిపాజిట్ లాకర్/సేఫ్ కస్టడీ ఆర్టికల్ సేవలను సమీక్షించిన అనంతరం.. వివిధ వర్గాల సూచనలను పరిగణనలోకి తీసుకుని నిబంధనల్లో సవరణలు చేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. ప్రస్తుత, నూతన కస్టమర్లకు ఇవి వర్తిస్తాయని స్పష్టం చేసింది. శాఖలవారీగా ఎన్ని లాకర్లు ఖాళీగా ఉన్నాయనే జాబితాను నిర్వహించడమే కాకుండా.. లాకర్లు ఖాళీగా లేకపోతే ప్రతీ దరఖాస్తును విధిగా స్వీకరించి వేచి ఉండే జాబితాను నిర్వహించాల్సి ఉంటుందని నిర్దేశించింది. తగిన జాగ్రత్తలు: లాకర్లు/సేఫ్ డిపాజిట్ వాల్ట్‌ల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విపత్తుల నుంచి భవనాలకు రక్షణ కల్పించుకోవాలని ఆర్బీఐ సూచించింది. ‘‘లాకర్లో ఉంచిన వాటి విషయంలో తమకు ఎటువంటి బాధ్యత లేదని బ్యాంకులు చెప్పడానికి వీల్లేదు. అగ్నిప్రమాదం, చోరీ, దోపిడీ, మోసం ఘటనల వల్ల కస్టమర్‌కు నష్టం వాటిల్లితే క్రితం సంవత్సరం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్ల వరకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది’’ అని ఆర్బీఐ పేర్కొంది. ఇకమీదట లాకర్ ప్రారంభంలోనే మూడేళ్ల అద్దెకు సరిపడా డిపాజిట్‌ను బ్యాంకులు తీసుకోవచ్చు. అయితే సరైన చెల్లింపు చరిత్ర ఉన్న ప్రస్తుత ఖాతాదారుల నుంచి డిపాజిట్ కోసం ఒత్తిడి చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. వరుసగా మూడేళ్ల పాటు లాకర్ అద్దె చెల్లించకపోతే.. లాకర్లను తెరిచే అధికారం బ్యాంకులకు కల్పించింది. ఎస్బీఐ ఒక లాకర్‌కు రూ.2,000–8,000 వరకు వార్షిక అద్దెను వసూలు చేస్తుండడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పు ఫలితం ఆరు నెలల్లో లాకర్లకు సంబంధించి నిబంధనలను తీసుకురావాలంటూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక కేసు విచారణ సందర్భంగా ఆర్బీఐని కోరింది. టెక్నాలజీల సాయంతో చొరబాటుదారులు కస్టమర్ల ప్రమేయం లేకుండా లాకర్లను యాక్సెస్ చేసుకోగలరని.. ఇటువంటి సందర్భాల్లో కస్టమర్లు బ్యాంకుల దయపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి సందర్భాల్లో బ్యాంకులు బాధ్యత నుంచి తప్పించుకోవడం కుదరదని స్పష్టం చేసింది. -
బ్యాంకు లాకర్లు భారమేనా..?
♦ వార్షికంగా అద్దె; ఇవ్వటానికీ లక్ష షరతులు ♦ ఎఫ్డీలు చేసినవారికే ఇస్తున్న బ్యాంకులు ♦ ఇంతా చేసి లాకర్లలో వస్తువులు పోతే బాధ్యత లేదట! ♦ వాటిలో ఏ వస్తువులున్నాయో తెలియకపోవటమే కారణం ♦ మరి అలాంటపుడు ఈ లాకర్లకు ప్రత్యామ్నాయాలే బెటర్ కదా! ♦ ఇంట్లోనే తక్కువ ఖర్చుతో, అధిక భద్రత గల సేఫ్ వోల్ట్లు ♦ వీటికి బీమా చేయించుకుంటే భద్రత, రక్షణ కూడా... బ్యాంకు లాకర్లలో ఉంచిన వస్తువులు చోరీకి లేదా దోపిడీకి గురైతే ప్రభుత్వరంగ బ్యాంకులకు ఏ మాత్రం బాధ్యత లేదన్న వాస్తవం తాజాగా వెలుగు చూసింది. కుష్‌కల్రా అనే న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద లాకర్ల భద్రత, బ్యాంకుల బాధ్యతపై సమాచారం కోసం దరఖాస్తు చేయగా... 19 ప్రభుత్వ రంగ బ్యాంకులు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాయి. ‘‘ఏదైనా యుద్ధం లేదా అల్లర్లు, దొంగతనం లేదా దోపిడీ చర్యల కారణంగా సేఫ్ డిపాజిట్ వోల్ట్‌లలో (లాకర్లలో) ఉంచిన వస్తువుల్ని కోల్పోయినా, నష్టపోయినా బ్యాంకు అందుకు బాధ్యత వహించదు’’ అని అవన్నీ స్పష్టం చేశాయి. బ్యాంకు– ఖాతాదారుడి మధ్యనుండే బంధం, ఇంటి యజమాని, కిరాయిదారుని మధ్య బంధం లాంటిదేనని... వారి వస్తువులకు వారే బాధ్యత వహించుకోవాలని తేల్చేశాయి. ఈ రకంగా చూస్తే బ్యాంకు లాకర్లలో భద్రత ఏ మాత్రం లేదన్న విషయం స్పష్టంగానే అర్థమవుతోంది కదా!! మరేం చెయ్యాలి? భద్రతకు సంబంధించి కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి. బయోమెట్రిక్ ద్వారానే లాకర్లు తెరుచుకునే సౌకర్యాలు చాలా బ్యాంకులు అమలు చేస్తున్నాయి కూడా. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా కొన్ని చోట్ల లాకర్ల దోపిడీలు, దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక అగ్నిప్రమాదాలు, భూకంపాలు, వరదల వంటి ప్రకృతి విపత్తుల వల్ల నష్ట భయం ఎలానూ ఉంటుంది. వీటికి బ్యాంకు నిర్లక్ష్యం తోడయిందంటే ఖాతాదారుడు భారీగా నష్టపోవాలి. లాకర్లలోని కంటెంట్ విషయంలో బ్యాంకులకు బాధ్యత లేదని రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. అంటే లాకర్లలో ఉన్నవి పోతే బ్యాంకులు పరిహారం చెల్లించవు. ఎందుకంటే లాకర్లలో ఖాతాదారులు ఏం దాచిపెట్టారనే విషయం వాటికి తెలియదు కనక. నగదు, ఆస్తుల పత్రాలు, ఆభరణాలు ఏవైనా కావచ్చు. కేవలం లాకర్ల భద్రతా చర్యలకు మాత్రమే బ్యాంకులు పరిమితమవుతాయి. లాకర్ నిజంగా ఉపయోగమేనా? సరే! లాకర్ భద్రమా? కాదా? అనే చర్చకన్నా ముందు చూడాల్సింది అసలు లాకర్ దొరుకుతుందా? అని. ఎందుకంటే బ్యాంకుల్లో లాకర్ల సంఖ్య తక్కువ ఉండటం... వాటిని కావాలనుకునే ఖాతాదారులు అధికంగా ఉండటంతో వాటికున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కొన్ని బ్యాంకులైతే భారీగా డిపాజిట్లు చేసినవారికే లాకర్లు ఇస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు అధిక నెట్‌వర్త్ కలిగిన వారికే కేటాయిస్తున్నాయి. ఇలా చూసినపుడు బ్యాంకులో లాకర్ పొందటమనేది సులువేమీ కాదు. లాకర్ కావాలంటే మరొకరు లాకర్ స్వాధీనం చేసే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని బ్యాంకులు అధిక మొత్తాన్ని దీర్ఘకాలానికి ఎఫ్డీ చేస్తేనే లాకర్ అద్దెకిస్తామని లింకు పెడుతున్నాయి. దీనికితోడు వార్షికంగా వేలాది రూపాయలు లాకర్ల ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో ఫీజు వార్షికంగా రూ.3,000 నుంచి 40,000 వరకూ ఉంది. ఇంతా చేసి అందులో ఉన్న వాటికి నష్టం జరిగితే తమకు బాధ్యత లేదనేది బ్యాంకుల మాట. లాకర్ కాకుండా ఇంకేమున్నాయి..? ఒకప్పుడు బ్యాంకు లాకర్లంటే భద్రతకు మారుపేరన్నట్టుగా ఉండేవి. వీటికి ప్రత్యామ్నాయాలు కూడా లేవు. నేడు భద్రత పరంగా, నిబంధనల పరంగా బ్యాంకు లాకర్లు కూడా సేఫ్ కాదని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాల్ని పరిశీలించొచ్చు. ఎక్కడో బ్యాంకులో దాచుకునే బదులు ఇంట్లోనే భద్రంగా దాచుకునేందుకూ ఇపుడు పలు మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని కంపెనీలు సేఫ్ వోల్ట్‌లను సప్లయ్ చేస్తున్నాయి. వీటిని ఏ తరహా గోడల్లో (సింగిల్, డబుల్) అయినా ఏర్పాటు చేసుకునేందుకు అనువుగా ఉంటాయి. మూడువైపులా రక్షణ కూడా ఉంటుంది. ఇంటి ఫ్లోరింగ్లోనూ ఇమిడిపోతాయి. దొంగలు పడ్డా గుర్తించలేని విధంగా ఉంటాయి. అంతర్జాతీయ గుర్తింపు పత్రాలతో వీటిని కంపెనీలు అందిస్తున్నాయి. మీ అవసరాలకు సరిపోయే వోల్ట్ను ఎంచుకోవచ్చు. ఎలక్ట్రానిక్ సేఫ్ వోల్ట్లు అయితే చిన్నగా ఉంటాయి. కొంత మేర నగదు, ఆభరణాలు, పలు పత్రాలను ఉంచుకోవడానికి ఇవి సరిపోతాయి. అగ్ని ప్రమాద నిరోధక వోల్ట్లు ఎలక్ట్రానిక్ వోల్ట్‌లతో పోలిస్తే భారీగా, పెద్దగా ఉంటాయి. కొంచెం పెట్టుబడి అవసరం దోపిడీ దొంగలు ప్రయత్నించినా తెరచుకోని వోల్ట్లు కూడా ఉన్నాయి. కాకపోతే వీటికి రూ.8,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, ఒక్కసారి ఖర్చు చేస్తే జీవిత కాలం పాటు మళ్లీ వీటిపై ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. బ్యాంకుల మాదిరిగా ఫీజుల భారం ఉండదు. పైగా ఆభరణాలు, పత్రాల కోసం బ్యాంకుల వరకూ వెళ్లి రావాల్సిన శ్రమ కూడా తప్పుతుంది. సులభంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే వాటిని తీసుకోవడం, అవసరం పూర్తయిన తర్వాత తిరిగి భద్రంగా వోల్ట్లో పెట్టేసుకోవచ్చు. బీమాతో అదనపు భద్రత ఎక్కడ ఉంచినా విలువైన వాటికి బీమా తీసుకోవడం నేటి కాలంలో ఎంతో అవసరం. ఎన్నో కంపెనీలు ఈ తరహా బీమా రక్షణను తక్కువ ప్రీమియానికే అందిస్తున్నాయి. హౌస్‌హోల్డ్ పాలసీ తీసుకుంటే ఆభరణాలు, పత్రాలతోపాటు, విలువైన ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వస్తువులకు, ఇంటికీ రక్షణ లభిస్తుంది. దొంగతనం జరిగినా, అగ్ని ప్రమాదం కారణంగా నష్టం ఏర్పడినా పరిహారం పొందొచ్చు. – సాక్షి, బిజినెస్ విభాగం -
లాకర్లలో ఏం జరిగినా మాది బాధ్యత కాదు!
⇔ ప్రభుత్వ బ్యాంకుల ఒప్పందంలో నిబంధన ⇔ దర్యాప్తు కోరుతూ సీసీఐకి ఫిర్యాదు న్యూఢిల్లీ: బ్యాంకు లాకర్లలో ఏది దాచినా భద్రంగా ఉంటుందన్న భరోసాతో ఉన్నవారు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. లాకర్లలో ఉంచినవి చోరీకి లేదా దోపిడీకి గురైతే ప్రభుత్వరంగ బ్యాంకులకు ఏ మాత్రం బాధ్యత లేదట. కుష్‌కల్రా అనే న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద లాకర్లపై సమాచారం కోసం దరఖాస్తు చేయగా, ఈ నిజాన్ని ఆర్బీఐ, 19 ప్రభుత్వరంగ బ్యాంకులు స్వయంగా వెల్లడించాయి. ఈ సమాధానంతో నివ్వెరపోయిన న్యాయవాది కుష్‌కల్రా... కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తలుపుతట్టారు. ఎస్బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు సహా అన్ని బ్యాంకులు కూటమిగా ఏర్పడి ఈ తరహా పోటీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని సీసీఐకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఇలా కూటమిగట్టి సేవల మెరుగుదలను అడ్డుకోవడం మార్కెట్లో పోటీ, వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నారు. ఈ నేపథ్యంలో కాంపిటిషన్ చట్టం కింద బ్యాంకులపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. లాకర్లలో ఉంచిన వాటిపై బ్యాంకులు బాధ్యత తీసుకోనప్పుడు విలువైన వస్తువుల (ఆభరణాలు, పత్రాలు)కు బీమా చేయించి వాటిని ఇంట్లోనే ఉంచుకోవచ్చుగా అని ఆయన ప్రశ్నించారు. ‘‘ఏదైనా యుద్ధం /అల్లర్లు, దొంగతనం లేదా దోపిడీ చర్యల కారణంగా సేఫ్ డిపాజిట్ వోల్ట్(లాకర్లు)లో ఉంచిన వాటిని కోల్పోయినా, నష్టపోయినా బ్యాంకు అందుకు బాధ్యత వహించదు’’ అని లాకర్ల అద్దె ఒప్పందంలో బ్యాంకులు పేర్కొంటున్నట్టు కుష్‌కల్రా తెలిపారు. -
బన్సల్ కుటుంబానికి నల్లధనం, 30 లాకర్లు!
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలో డైరెక్టర్ జనరల్‌గా పనిచేసి.. ఆ తర్వాత తీవ్రమైన ఆరోపణలతో సీబీఐ విచారణ ఎదుర్కొంటూ మొత్తం కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్న బీకే బన్సల్‌కు ఏకంగా 30కి పైగా బ్యాంకు లాకర్లు ఉన్నట్లు తాజాగా తేలింది. అంతేకాదు.. బీకే బన్సల్, ఆయన కుమారుడు యోగేష్ బన్సల్ ఆత్మహత్య చేసుకోడానికి రెండు రోజుల ముందు.. తమ వద్ద దాదాపు రూ. 2.4 కోట్ల నల్లధనం ఉందని ఆదాయపన్ను శాఖ అధికారులకు తెలిపాడు! సెప్టెంబర్ 27వ తేదీన బీకే బన్సల్, ఆయన కొడుకు ఆత్మహత్ చేసుకున్నారు. అంతకుముందు జూలై నెలలో బన్సల్ భార్య, కుమార్తె ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఫార్మాసూటికల్ కంపెనీ నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఈ కుటుంబం ఆత్మహత్యతో ఒక్కసారిగా అంతా ఆశ్చర్యపోయారు. అయితే.. ఆత్మహత్య చేసుకోడానికి రెండు రోజుల ముందే యోగేష్ బన్సల్ ఆదాయపన్ను అధికారుల వద్దకు వెళ్లి, తాము దాదాపు కోటి రూపాయల వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. తర్వాత సీబీఐ వర్గాలు సెక్యూరిటీ కెమెరాలలో ఉన్న సీసీటీవీ ఫుటేజిని పరిశీలించగా మరో కొత్త విషయం తెలిసింది. బీకే బన్సల్‌ను అరెస్టుచేసిన మర్నాడు యోగేష్, ఆయన తల్లి బ్యాంకులకు వెళ్లి, మొత్తం 19 లాకర్లను తెరిచారు. దాంతో ఇప్పటికే భారీగా బంగారు, వెండి కడ్డీలను స్వాధీనం చేసుకున్న ఇంట్లో మరోసారి సీబీఐ వర్గాలు సోదాలు చేశాయి. అప్పుడే అక్కడ భారీ మొత్తంలో నల్లధనం దొరికింది. బహుశా కేసు నుంచి బయట పడేందుకు ఈ డబ్బు వాడుకోవాలని వాళ్లు అనుకుని ఉంటారని.. కానీ అది కుదరదని తేలడంతో ఇప్పుడు బయట పెడుతున్నారని సీబీఐ వర్గాలు భావించాయి. కానీ రెండు రోజుల్లోనే కథ మరో మలుపు తిరిగింది. బీకే బన్సల్, యోగేష్ బన్సల్ ఆత్మహత్య చేసుకున్నారు!! -
బ్యాంకు లాకర్లు భద్రమేనా?
ఫైనాన్షియల్ బేసిక్స్ మీరు ఇంటికి సంబంధించిన విలువైన పత్రాలు, బంగారు ఆభరణాలు, ఇతర బాండ్లను బ్యాంకు లాకర్లలో దాచాలని నిర్ణయించుకున్నారా? అయితే కింది ఉదాహరణ ఒకసారి చూడండి. రవి చేసేది ప్రైవేట్ ఉద్యోగం. తను గతంలో దాదాపు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను, ఇతర బాండ్లను, వస్తువులను ఒక బ్యాంకు లాకర్లో ఉంచాడు. ఒక రోజు ఉదయం అతనికి బ్యాంకు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. విషయం ఏంటంటే.. అతని లాకర్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోయాయి. రవి ఆదరాబాదరాగా బ్యాంకుకు వెళ్లాడు. ఎలా జరిగిందని బ్యాంకును అడిగితే తెలియలేదని సమాధానం. పైగా రవి లాకర్ ను సరిగా లాక్ చేయలేదని, అందువల్లే దొంగతనం జరిగి ఉండొచ్చని బ్యాంకు చెప్పింది. దీంతో రవి బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ దగ్గరకు వెళ్లాడు. కస్టమర్ లాకర్‌ను సరిగా లాక్ చేసి వెళ్లాడా? లేదా? అనే విషయాన్నే సరిగా తెలుసుకోలేకపోయిందని, అది బ్యాంక్ తప్పేనని తేల్చింది. అలాగే రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. అక్కడ తీర్పు రవికి అనుకూలంగానే వచ్చినా.. దొంగతనం జరిగిన డబ్బులో కొంత మొత్తం మాత్రమే అతనికి తిరిగొచ్చింది. బ్యాంకు కర్తవ్య నిర్వహణ లోపం వల్ల రవి రూ.10 లక్షలు కోల్పోయాడు. ఈ ఘటన నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మీరు భవిష్యత్తులో లాకర్లను ఉపయోగించేటప్పుడు వాటిని సరిగా లాక్ చేశారో లేదో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. బ్యాంకు నుంచి తిరిగి వచ్చేటప్పుడు లాకర్ సరిగా లాక్ చేసి ఉందా? లేదా? అని సంబంధిత అధికారులను ఒకసారి చూడమని అడగండి. దీనికి బ్యాంకు అధికారులు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. కానీ అడగడం వల్ల మనకు పోయేదేమీ లేదు కదా. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.. దొంగతనం కాకుండా బ్యాంకు లాకర్లలో అగ్నిప్రమాదం సంభవిస్తే.. లాకర్లోని వస్తువులకు డ్యామేజ్ జరిగితే.. అప్పుడు పరిస్థితేంటి? బ్యాంకు మీ సొమ్ముకు ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఎందుకంటే మీరు లాకర్లో ఏ వస్తువులు ఉంచారో బ్యాంకు తెలుసుకోదు. అంటే మీ వస్తువులకు బ్యాంకు హామీ ఇవ్వదు. -
లాకర్లు కావవి.. వజ్రాల గనులు
-
లాకర్లు కావవి.. వజ్రాల గనులు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఇంజనీర్ యాదవ్ సింగ్ అవినీతి కేసులో కళ్లు బైర్లుకమ్మే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఐటీ అధికారులు సోమవారం యాదవ్‌కు చెందిన 12 బ్యాంక్ లాకర్లు తెరిచారు. లాకర్లలో 100 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, రెండు కిలోల బంగారం, 10 కోట్ల రూపాయల నగదు బయటపడ్డాయి. వీటిని చూసి ఐటీ అధికారులు విస్తుపోయారు. ఓ సాధారణ ఇంజనీర్ ఇన్ని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడటం గమనార్హం. యాదవ్ గతంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి సన్నిహితంగా ఉండేవాడు. మాయావతి ప్రభుత్వంలో యాదవ్ అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చదవండి (కారులో 12 కోట్లు..)