ముంబై: బ్యాంకు లాకర్ సేవలను వినియోగించుకుంటున్నారా? అయితే ఆర్‌బీఐ సవరిత నిబంధనల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. చోరీ, అగ్నిప్రమాదం, భవనం కుప్పకూలిపోవడం, బ్యాంకు ఉద్యోగుల మోసం.. ఇలాంటి కారణాలతో లాకర్లలో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే, వార్షిక లాకర్ అద్దెకు గరిష్టంగా 100 రెట్ల వరకే పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు ఏటా రూ.500 చొప్పున లాకర్ చార్జీలు చెల్లిస్తారనుకోండి.. లాకర్‌లో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే గరిష్ట పరిహారం రూ.50,000కు మించి రాదు. ఈ విషయంలో బ్యాంకుల బాధ్యతను ఆర్‌బీఐ పరిమితం చేసింది. అంతేకాదు.. లాకర్‌లలో చట్టవిరుద్ధమైనవి, ప్రమాదకరమైన వాటిని ఉంచకూడదు.
అలాగే, ‘‘ప్రకృతి విపత్తులైన భూకంపాలు, వరదలు, పిడుగులు పడడం కారణంగా లాకర్లలోని వాటికి నష్టం వాటిల్లితే ఆ బాధ్యత బ్యాంకులపై ఉండదు’’ అని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు సవరించిన నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. బ్యాంకులు ఈ మేరకు లాకర్ ఒప్పందంలో సవరణలు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులు అందిస్తున్న డిపాజిట్ లాకర్/సేఫ్ కస్టడీ ఆర్టికల్ సేవలను సమీక్షించిన అనంతరం.. వివిధ వర్గాల సూచనలను పరిగణనలోకి తీసుకుని నిబంధనల్లో సవరణలు చేసినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ప్రస్తుత, నూతన కస్టమర్లకు ఇవి వర్తిస్తాయని స్పష్టం చేసింది. శాఖలవారీగా ఎన్ని లాకర్లు ఖాళీగా ఉన్నాయనే జాబితాను నిర్వహించడమే కాకుండా.. లాకర్లు ఖాళీగా లేకపోతే ప్రతీ దరఖాస్తును విధిగా స్వీకరించి వేచి ఉండే జాబితాను నిర్వహించాల్సి ఉంటుందని నిర్దేశించింది.
తగిన జాగ్రత్తలు: లాకర్లు/సేఫ్ డిపాజిట్ వాల్ట్‌ల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విపత్తుల నుంచి భవనాలకు రక్షణ కల్పించుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. ‘‘లాకర్‌లో ఉంచిన వాటి విషయంలో తమకు ఎటువంటి బాధ్యత లేదని బ్యాంకులు చెప్పడానికి వీల్లేదు. అగ్నిప్రమాదం, చోరీ, దోపిడీ, మోసం ఘటనల వల్ల కస్టమర్‌కు నష్టం వాటిల్లితే క్రితం సంవత్సరం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్ల వరకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది’’ అని ఆర్‌బీఐ పేర్కొంది. ఇకమీదట లాకర్ ప్రారంభంలోనే మూడేళ్ల అద్దెకు సరిపడా డిపాజిట్‌ను బ్యాంకులు తీసుకోవచ్చు. అయితే సరైన చెల్లింపు చరిత్ర ఉన్న ప్రస్తుత ఖాతాదారుల నుంచి డిపాజిట్ కోసం ఒత్తిడి చేయకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. వరుసగా మూడేళ్ల పాటు లాకర్ అద్దె చెల్లించకపోతే.. లాకర్లను తెరిచే అధికారం బ్యాంకులకు కల్పించింది. ఎస్‌బీఐ ఒక లాకర్‌కు రూ.2,000–8,000 వరకు వార్షిక అద్దెను వసూలు చేస్తుండడం గమనార్హం.
సుప్రీంకోర్టు తీర్పు ఫలితం
ఆరు నెలల్లో లాకర్లకు సంబంధించి నిబంధనలను తీసుకురావాలంటూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక కేసు విచారణ సందర్భంగా ఆర్‌బీఐని కోరింది. టెక్నాలజీల సాయంతో చొరబాటుదారులు కస్టమర్ల ప్రమేయం లేకుండా లాకర్లను యాక్సెస్ చేసుకోగలరని.. ఇటువంటి సందర్భాల్లో కస్టమర్లు బ్యాంకుల దయపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి సందర్భాల్లో బ్యాంకులు బాధ్యత నుంచి తప్పించుకోవడం కుదరదని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment