ముంబై: బ్యాంక్ లాకర్లు.. ఒకప్పుడు వీటిని పొందడం కష్టంగా ఉండేది. డిమాండ్ ఎక్కువ, సరఫరా తక్కువగా అన్నట్టు గతంలో పరిస్థితి. కానీ, ఇప్పుడు బ్యాంక్ లాకర్లు అంటే చాలా మందిలో అనాసక్తి నెలకొంది. లాకర్ చార్జీలు గణనీయంగా పెరిగిపోవడం, క్లిష్టమైన కేవైసీ ప్రక్రియ తదితర ఎన్నో అంశాలు లాకర్లు అంటే మొహం మొత్తిపోయేలా చేస్తున్నాయి. 50 శాతం మంది కస్టమర్లు లాకర్లను ఇటీవలి కాలంలో మూసివేయడం, లేదంటే మూసివేయాలనే యోచనతో ఉన్నారు.
లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి. 11,000 మంది అభిప్రాయాలను తెలుసుకుని లోకల్ సర్కిల్స్ ఈ వివరాలను విడుదల చేసింది. లాకర్లను మూసివేసినట్టు 36 శాతం మంది చెప్పగా.. అధిక చార్జీల కారణంగా లాకర్లను మూసివేయాలని అనుకుంటున్నట్టు 4 శాతం మంది పేర్కొన్నారు. 16 శాతం మంది లాకర్ సైజును తగ్గించుకున్నట్టు చెప్పారు.
నూతన చార్జీలు తమకు సమ్మతమేనని, లాకర్లను కొనసాగిస్తామని 36 శాతం మంది వెల్లడించారు. ‘‘బ్యాంక్ సేఫ్ డిపాజిట్ లాకర్లకు సంబంధించి కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో శాఖకు వచ్చి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలంటూ కస్టమర్లను బ్యాంక్‌లు కోరుతున్నాయి.
డిసెంబర్ 31 నాటికి కస్టమర్లు బ్యాంక్‌కు వెళ్లి లీజ్ డాక్యుమెంట్‌పై సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇటీవలి సంవత్సరాల్లో లాకర్ చార్జీలు కూడా పెరిగాయి’’అని లోకల్ సర్కిల్స్ తెలిపింది. చార్జీలు గణనీయంగా పెరగడం వల్లే తాము లాకర్లను రద్దు చేసుకున్నామని, లేదంటే మూసివేయాలని అనుకుంటున్నామని, లేదంటే సైజును తగ్గించుకుంటామని 56 శాతం మంది చెప్పినట్టు ఈ సంస్థ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment