ఈవీ రూ.10 లక్షల లోపయితే ఓకే | Sakshi
Sakshi News home page

ఈవీ రూ.10 లక్షల లోపయితే ఓకే

Published Fri, Apr 12 2024 4:34 AM

55 percent opinion on electric cars - Sakshi

ఎలక్ట్రిక్‌ కార్లపై 55 శాతం మంది అభిప్రాయం ఇదే

లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు  

సాక్షి, హైదరాబాద్‌: ఎలక్ట్రిక్‌ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న వాయు కాలుష్యం..మండుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలతో వాహనదారులు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం భారత ఎలక్ట్రిక్‌ వాహన మార్కెట్‌ 2023లో రూ.16,675 కోట్లు ఉండగా..2025 నాటికి రూ. 62,532 కోట్లకు చేరే అవకాశముంది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లు ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

అయితే పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ కార్ల కొనుగోళ్ల విషయంలో వాహనదారులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నట్టు లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయాల్లో మెజారిటీ వ్యక్తులు రూ.8 నుంచి రూ.10 లక్షలలోపు ధర ఉంటే ఎలక్ట్రిక్‌ కారు కొనుగోలు సులువు అవుతుందనే అభిప్రాయపడ్డారు. 

► పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తాము ఎలక్ట్రిక్‌ కారు కొనాలని భావిస్తున్నట్టు 44 శాతం మంది చెప్పారు. 
►పెట్రోల్, డీజిల్‌ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు 31% మంది ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారేందుకు ప్రయతి్నస్తున్నట్టు తెలిపారు.  
►2023లో మనదేశంలో 72,321 ఎలక్ట్రిక్‌ కార్లు రిజిస్టర్‌ అయ్యాయి. లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో పాల్గొన్న వారిలో 5 శాతం మంది ఎలక్ట్రిక్‌ కారు కొనేందుకు ఆసక్తి చూపారు. ఈ లెక్క ప్రకారం 2024లో ఎలక్ట్రిక్‌ కార్ల డిమాండ్‌ 2,00,000కు చేరే అవకాశముంది.  
►ఎలక్ట్రిక్‌ కార్ల కొనుగోలుకు సంబంధించి దేశవ్యాప్తంగా 319 జిల్లాల్లో లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో 40 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది.
►తెలంగాణలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలపైనే ప్రస్తుతం రిజి్రస్టేషన్‌ జీవితకాలపు ఫీజు రాయితీ ఉండగా, ఏపీలో కార్లు, జీపులపై కూడా రిజి్రస్టేషన్‌ ఫీజు పూర్తిగా రాయితీ ఇస్తున్నట్టు అధికారవర్గాల సమాచారం. 

ఎలక్ట్రిక్‌ కారు కొనాలనుకోవడానికి కారణం?
► పర్యావరణ హితంగా ఉండాలని.. 44%
►పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదలను తట్టుకునేందుకు 31%
►తక్కువ ధరలు 15%
►ఇతర కారణాలు 5%
►చెప్పలేం 5%

ఎలక్ట్రిక్‌ కారు కొనకపోవడానికి కారణాలు ? 
►సాధారణ కార్లతో పోలిస్తే అధిక ధర    21 శాతం 
►మా ప్రాంతంలో సరిపడా చార్జింగ్‌ స్టేషన్లు లేకపోవడం    21 శాతం 
►ఎలక్ట్రిక్‌ కార్ల గురించి అవగాహన లేదు    12 శాతం 
►ఈ సమయంలో కారు కొనాలనుకోవడం లేదు    26 శాతం 
►నా బడ్జెట్‌కు తగిన మోడల్స్‌ ఈవీలో లేవు    7 శాతం 
►ఇతర కారణాలు, కొనేంత డబ్బు లేదు    8 శాతం 
►ఇది నాకు వర్తించదు    5 శాతం 

Advertisement
 
Advertisement