న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన కారణంగా ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతం నుంచి మరో నగరానికి తరలివెళ్లేందుకు 40%మందికి పైగా సిద్ధంగా ఉన్నారు. 16% మంది ప్రజలు మాత్రం ఈ కాలంలోనే ఢిల్లీని విడిచి వెళ్లాలనుకుంటున్నారు. ‘లోకల్ సర్కిల్స్’ అనే సంస్థ 17వేల మందితో నిర్వహించిన సర్వేలో ఈమేరకు వెల్లడైంది. 31%మంది మాత్రం ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలోనే ఉండి వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు.
ఇందులో భాగంగా వారు ఎయిర్ ప్యూరిఫైర్స్, మాస్క్‌లు వినియోగించడం, మొక్కలు నాటడం వంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. 13%మంది మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇక్కడ ఉండాల్సి వస్తోందని, అయితే పెరుగుతున్న వాయుకాలుష్యాన్ని ఎదుర్కోవడం తప్ప తమకు మరోమార్గం లేదని తెలిపారు. గతవారం వాయుకాలుష్యాన్ని మీరు, మీ కుటుంబ సభ్యులు ఎలా ఎదుర్కొన్నారు? అన్న ప్రశ్నకు..13%మంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు వైద్యుల్ని కలిసినట్లు తెలిపారు. అయితే అప్పటికే వైద్యుల్ని కలిసిన వారిలో 29%మంది ఉన్నారు.
వాయుకాలుష్యం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారెవరూ ఆస్పత్రికి గాని, వైద్యుల వద్దకు వెళ్లలేదని 44%మంది తెలిపారు. 14%మంది మాత్రమే వాయుకాలుష్యం వల్ల తమకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకాలేదని తెలిపారు. ఇదిలా ఉండగా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఉదయం వర్షం పడినప్పటికీ కాలుష్యం తారాస్థాయిలోనే ఉంది. పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ ప్రజారోగ్యంపై అత్యవసరస్థితిని ప్రకటించడంతో ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లను మూసివేసింది. అదేవిధంగా ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతంలో భవన నిర్మాణ కార్యకలాపాల్ని ఈపీసీఏ నిషేధించిన సంగతి తెలిసిందే.
మూడేళ్ల తర్వాత మళ్లీ...
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సమాచారం మేరకు ఢిల్లీలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 494గా నమోదైంది. నవంబర్ 6, 2016న ఇది 497గా ఉండగా, మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో సూచీ నమోదైంది. ఈ సూచీ అధికస్థాయిలో పూసా ప్రాంతంలో 495, ఐటోలో 494, మండ్కా, పంజాబీ భాగ్ ప్రాంతాల్లో 493గా ఉంది. నిర్ధారిత ఏక్యూఐ ప్రామాణికాలివీ.. సూచీ 0–50 మధ్య ఉంటే మంచిగా ఉన్నట్లు, 51–100 సంతృప్తికర స్థాయి, 101–200 మోస్తర్లు, 201–300 బాగోలేదని, 301–400 అస్సలు బాగోలేదని, 401–500 అథమస్థాయి, 500 కంటే పైన తీవ్రమైన అథమస్థాయిగా పరిగణిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment