Supreme Court Issues Guidelines To Banks On Operating Lockers - Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ లాకర్‌.. కాదా బేఫికర్‌?

Published Mon, Oct 11 2021 12:39 AM | Last Updated on Mon, Oct 11 2021 12:16 PM

Supreme Court issues guidelines to banks on operating lockers - Sakshi

బ్యాంకు లాకర్‌లో విలువైన వాటిని ఉంచేస్తే.. ఎటువంటి భయం లేకుండా ఇంట్లో ప్రశాంతంగా నిద్రించొచ్చని భావించడం పొరపాటే. లాకర్ల విషయంలో బ్యాంకుల బాధ్యత కూడా పరిమితమే. సుప్రీంకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా ఇచి్చన ఆదేశాల నేపథ్యంలో ఆర్‌బీఐ ఇటీవలే లాకర్‌లకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. లాకర్‌లో ఉంచిన వాటిని దోపిడీ లేదా దొంగతనం చేస్తే? లాకర్‌ కీ కనిపించకుండా పోతే? లాకర్‌ అద్దె చెల్లించకపోతే? ఇలా ఎన్నో ప్రశ్నలకు జవాబులను లాకర్‌ హోల్డర్లు తెలుసుకోవడం ఎంతో అవసరం. ఈ వివరాలతో కూడిన ప్రాఫిట్‌ ప్లస్‌ కథనమే ఇది..

లాకర్‌ అంటే?
ఇది ఒక ఖాతా వంటిది. విలువైన వస్తువులు.. ఆభరణాలు, డాక్యుమెంట్లను ఇందులో ఉంచు కోవచ్చు. రెండు కీలు(తాళం చెవులు) ఉంటాయి. అందులో ఒక టి బ్యాంకు దగ్గర, రెండోది లాకర్‌ దారుని వద్ద ఉంటాయి. ఏదో ఒక కీ సాయంతో లాకర్‌ను తెరవడం సాధ్యం కాదు. రెండు కీలు ఉంటేనే అది సాధ్యపడుతుంది. బ్యాంకు ఉద్యోగి తొలుత తన దగ్గరున్న కీతో లాకర్‌ రూమ్‌ను తెరుస్తారు. ఆ తర్వాత లాకర్‌హోల్డర్‌ తన దగ్గరున్న కీ సాయంతో లాకర్‌ను వినియోగించుకోవడం సాధ్యపడుతుంది. బ్యాంకులు భద్రతాపరంగా అధిక నాణ్యతతో కూడిన లాకర్లను వినియోగిస్తుంటాయి. అందుకే వీటిని సేఫ్‌ డిపాజిట్‌ లాకర్లుగా పిలుస్తుంటారు.

ఎవరైనా అర్హులే..
మీకు సమీపంలోని బ్యాంకు శాఖలో లాకర్‌ సదుపాయాన్ని పొందొచ్చు. ఆ బ్యాంకు శాఖలో ఖాతా లేకపోయినా ఫర్వాలేదు. గతంలో తమ ఖాతాదారులకే బ్యాంకులు ఈ సదుపాయం అందించేవి. కానీ, ఎవరికైనా ఈ సేవలు అందించాలని ఆర్‌బీఐ 2021 ఆగస్ట్‌ 18 నాటి ఆదేశాల్లో పేర్కొంది. ఒకవేళ లాకర్‌ ఖాళీగా లేకుంటే.. దరఖాస్తుదారులతో ఒక వేచి ఉండే జాబితాను నిర్వహిస్తూ.. ఖాళీ అయిన వాటిని వరుస క్రమంలో జాబితాలోని వారికి తప్పనిసరిగా కేటాయించాలి.

చట్టవిరుద్ధమైనవి, ప్రమాదకరమైన వాటిని లాకర్‌లో ఉంచనంటూ ధ్రువీకరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు లాకర్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేయాలి. బాధ్యతలు, హక్కుల వివరాలు ఇందులో ఉంటాయి. ఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉంటాయి. నూతన లాకర్‌ ఒప్పందంపై ప్రస్తుత లాకర్‌ హోల్డర్లు సైతం 2023 జనవరి 1 నాటికి సంతకం చేయాల్సి ఉంటుంది.

అద్దె
బ్యాంకులు లాకర్‌ అద్దెను వార్షికంగా ఒక సారి వసూలు చేస్తుంటాయి. అంతేకాదు, లాకర్‌ కోసం డిపాజిట్‌ కూడా చేయాలని కోరుతుంటాయి. ఎందుకంటే లాకర్‌ అద్దె చెల్లించకపోతే.. డిపాజిట్‌ నుంచి మినహాయించుకునేందుకు అలా చేస్తాయి. మూడేళ్ల కాలానికి లాకర్‌ అద్దెతోపాటు, లాకర్‌ను తెరవాల్సి వస్తే అయ్యే చార్జీలను కలిపి ఆ మేరకు డిపాజిట్‌గా తీసుకునేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అధికారం కలి్పంచింది. ఇంతకుమించి డిపాజిట్‌ చేయాలని బ్యాంకులు కోరడానికి వీల్లేదు. అలాగే, లాకర్‌ కోసం డిపాజిట్‌ అన్నది తప్పనిసరి కాదు.

బ్యాంకులో అప్పటికే కొన్నేళ్లుగా ఖాతా నిర్వహిస్తున్నట్టయితే మీ చరిత్ర ఆధారంగా బ్యాంకులు డిపాజిట్‌ నుంచి మినహాయింపును ఇవ్వొచ్చు. లాకర్‌ను స్వా«దీనం చేసేస్తే తిరిగి ఈ డిపాజిట్‌ను వెనక్కి పొందొచ్చు. ఇంటికి లేదా కార్యాలయానికి సమీపంలోని బ్యాంకు శాఖలో సౌకర్యం కోసం లాకర్‌ను తెరిచిన తర్వాత.. అనూహ్య కారణాలతో ఆయా బ్యాంకు శాఖను వేరే ప్రాంతానికి మార్చాల్సి వచి్చనా.. లేదా వేరే బ్యాంకుతో విలీనం అయిన సందర్భాల్లో లాకర్‌ హోల్డర్లకు రెండు నెలల వ్యవధిని బ్యాంకులు ఇస్తాయి. లాకర్‌ను బ్యాంకుతోపాటే మార్చుకోవచ్చు. లేదా మూసేయవచ్చు.

అద్దె చెల్లించకపోతే?
వరుసగా మూడు సంవత్సరాల పాటు లాకర్‌ అద్దె చెల్లించకపోతే.. ఆయా లాకర్లను బలవంతంగా తెరిచేందుకు బ్యాంకులకు అధికారం ఉంటుంది. కాకపోతే దీనికంటే ముందు బ్యాంకు తన ఖాతాదారుకు ఇదే విషయమై సమాచారం (నోటీస్‌) కూడా ఇస్తాయి. ఈ మెయిల్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా సందేశం ఇస్తాయి. నోటీసును స్వీకరించకుండా, మెయిల్, ఎస్‌ఎంఎస్‌కు స్పందన రాకపోతే.. అప్పుడు దినపత్రికల్లో పబ్లిక్‌ నోటీస్‌ జారీ చేస్తాయి. తగినంత సమయం ఇచ్చిన తర్వాత అప్పటికీ ఎవరి నుంచి స్పందన రాకపోతే.. బ్యాంకు అధికారి, ఇద్దరు సాక్షుల సమక్షంలో లాకర్‌ను తెరుస్తారు. ఈ ప్రక్రియను వీడియో కూడా తీస్తాయి. భవిష్యత్తులో కోర్టుల్లో కేసులు నమోదైతే వీటిని సాక్ష్యాలుగా బ్యాంకు సమరి్పస్తుంది. నగదు సహా లాకర్‌లో ఉన్న వాటిని సీల్‌ చేసి భద్రంగా ఉంచుతాయి.

నిర్వహణ
ఖాతాదారులు లాకర్లను తెరిచి, చూసుకునే సమయంలో వారికంటూ గోప్యత ఉండేలా బ్యాంకులు చూడాలి. అంతేకాదు లాకర్‌ను వినియోగించుకున్న రోజు అందుకు సంబంధించి ఈ మెయిల్, ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌లను కూడా బ్యాంకులు ఇక మీదట తప్పకుండా పంపించాలి. తేదీ, సమయం వివరాలు అందులో ఉంటాయి. దీంతో ఒకవేళ తను కాకుండా, మరొకరు లాకర్‌ను యాక్సెస్‌ చేస్తే ఖాతాదారు అప్రమత్తం అయ్యేందుకే ఈ ఏర్పాటు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తెరిచే అవకాశం లేకపోలేదు.

ఒకవేళ ఖాతాదారు ప్రమేయం లేకుండా లాకర్‌ యాక్సెస్‌ జరిగి ఉంటే.. అందుకు ఫిర్యాదుల పరిష్కార యంత్రంగా కూడా ఉంటుంది. లాకర్‌ దారులు వాటిని తెరిచి, మూసేసి వెళ్లిన తర్వాత బ్యాంకు కస్టోడియన్‌ ఆయా లాకర్లను విధిగా పరీక్షించాలి. ఏదైనా సందర్భంలో లాకర్‌ను తెరిచి, తిరిగి సరిగ్గా క్లోజ్‌ చేయకుండా వెళ్లి ఉంటే.. బ్యాంకు కస్టోడియన్‌ వాటిని క్లోజ్‌ చేయాలి. అదే విషయాన్ని రిజిస్టర్‌లో నమోదు చేయడంతోపాటు.. ఖాతాదారుకు తెలియజేయాలి.

లాకర్‌దారు మరణిస్తే..?
లాకర్లకు సంబంధించి నామినేషన్, లాకర్‌ హోల్డర్‌ మరణానికి గురైతే.. లాకర్లలో ఉన్న వాటిని నామినీలకు అందించే విషయమైన ప్రతీ బ్యాంకు తగిన విధానాన్ని కలిగి ఉంటుంది. అవసరమైన ధ్రువీకరణ పత్రాలను నామినీ సమరి్పంచినట్టయితే లాకర్లలో ఉన్నవాటిని పొందేందుకు బ్యాంకులు అనుమతిస్తాయి. నామినీ నమోదై లేకపోతే.. చట్టబద్ధమైన వారసులకు నిబంధనల మేరకు అందిస్తాయి. క్లెయిమ్‌తోపాటు అవసరమైన అన్ని పత్రాలు అందిన నాటి నుంచి 15 పనిదినాల్లో బ్యాంకులు వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది.  

బ్రేక్‌ చేయొచ్చు..
ఖాతాదారు లాకర్‌ కీ పోయిందని అభ్యర్థన పెట్టుకున్నప్పుడు, లాకర్‌ జప్తునకు సంబంధించి కోర్టుల ఆదేశాలతో దర్యాప్తు అధికారులు బ్యాంకును సంప్రదించిన సందర్భాల్లోనూ లాకర్‌ను తెరుస్తారు. లాకర్‌దారు నిబంధనలను పాటించని సందర్భాల్లోనూ ఇదే చోటు చేసుకుం  టుంది.

లాకర్ల విషయంలో బ్యాంకుల బాధ్యత
ప్రకృతి విపత్తుల వల్ల (భూకంపాలు, వరదలు తదితర) లాకర్లలోని వాటికి నష్టం కలిగితే బ్యాంకులు ఎటువంటి పరిహారాన్ని చెల్లించవు. ఖాతాదారుల నిర్లక్ష్యం వల్ల వాటిల్లే నష్టానికి సైతం చెల్లింపులు చేయవు. అగ్ని ప్రమాదం, దొంగతనం, దోపిడీ, భవనం కుప్పకూలిపోవడం, బ్యాంకు ఉద్యోగి మోసం వల్ల లాకర్లలోని వాటికి నష్టం వాటిల్లితే చెల్లింపుల బాధ్యత బ్యాంకులపై ఉంటుంది. ఎందుకంటే చోరీలు, అగ్ని ప్రమాదాల నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకుపై ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మాత్రం తమకు సంబంధం లేదని బ్యాంకులు చెప్పడానికి లేదు.

లాకర్‌కు వార్షికంగా వసూలు చేసే అద్దెకు గరిష్టంగా 100 రెట్ల పరిహారాన్ని బ్యాంకులు చెల్లించగలవు. ఉదాహరణకు లాకర్‌ అద్దె రూ.2,000 ఉందనుకుంటే రూ.2లక్షలు పరిహారంగా లభిస్తుంది. ఎందుకంటే లాకర్లలో ఏవి ఉంచుతున్నారు, తిరిగి ఏవి తీసుకెళుతున్నారు? ఇటువంటి వివరాలను బ్యాంకులు నమోదు చేయవు. ఖాతాదారుల గోప్యతకు భంగం కలగకుండా చూడడంలో భాగంగా ఈ పనికి దూరంగా ఉంటాయి. అటువంటప్పుడు ఫలానావి పోయాయని నిర్ధారించడానికి అవకాశం ఉండదు. కనుక లాకర్‌ అద్దెకు 100 రెట్లకే పరిహారాన్ని పరిమితం చేసింది ఆర్‌బీఐ. లాకర్లకు సంబంధించి బ్యాంకులు బీమా కవరేజీని కూడా అందించడం లేదు.

లాకర్లలో భద్రత?
బ్యాంకు లాకర్లను ఏర్పాటు చేసిన చోట తగినంత భద్రతా చర్యలు తీసుకోవడం బాధ్యతల్లో భాగమే.  లాకర్‌ గది/వాల్ట్‌కు ఒక్కటే ప్రవేశం, వెలుపలి ద్వారం ఉండాలి. వర్షాలు, వరదలు వచి్చనాకానీ లాకర్లు దెబ్బతినకుండా చూడాలి. అగ్ని ప్రమాదాలకు అవకాశం లేని విధంగా.. ఆ రిస్క్‌ను తగ్గించే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది. ఈ ప్రమాదాల రిస్‌్కను తగ్గించేందుకు బ్యాంకు ఉద్యోగులు నిపుణులతో కలసి ఇంజనీరింగ్‌/భద్రతా పరిస్థితులను సమీక్షించి, అవసరమైన చర్యలు తీసుకుంటూ ఉండాలి. అంతేకాదు లాకర్లకు ఎప్పుడూ కూడా తగినంత రక్షణ కూడా ఏర్పాటు చేయాలి.

లాకర్‌ ఆవరణలోకి వెళ్లి, వచ్చే వారిని కవర్‌ చేసేందుకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. 180 రోజుల సీసీటీవీ కెమెరా రికార్డులను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. తన లాకర్‌ను తన ప్రమేయం లేకుండా ఓపెన్‌ చేశారని, లాకర్‌లో ఉంచినవి కనిపించడం లేదని ఖాతాదారు ఫిర్యాదు చేసిన సందర్భంలో దర్యాప్తునకు ఈ సీసీటీవీ కెమెరా రికార్డులు ఆధారంగా పనిచేస్తాయి. బ్యాంకులు ఏర్పాటు చేసే మెకానికల్‌ లాకర్లు భారత ప్రమా ణాల మండలి (బీఐఎస్‌) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఎలక్ట్రానిక్‌గా తెరిచే లాకర్లకు పూర్తి సైబర్‌ భద్రత ఉండాలి.

కీ కోల్పోతే..?
బ్యాంకు ఇచ్చిన లాకర్‌ కీని ఎక్కడైన పోగొట్టుకున్నట్టు అయితే వెంటనే ఆ విషయాన్ని బ్యాంకుకు తెలియజేయాలి. కనిపించకుండా పోయిన కీ తిరిగి భవిష్యత్తులో ఎప్పుడైనా లభిస్తే బ్యాంకుకు స్వాధీనం చేస్తానంటూ లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు లాకర్‌ను బద్దలు కొట్టడం, తిరిగి కొత్త కీ ఏర్పాటు చేసేందుకు అయ్యే చార్జీలన్నింటినీ ఖాతాదారే భరించాల్సి వస్తుంది. ఈ ప్రక్రియను అంతా ఖాతాదారు సమక్షంలోనే బ్యాంకులు టెక్నీషియన్లతో నిర్వహిస్తాయి. ఎందుకంటే లాకర్‌లో ఉన్న వాటికి నష్టం వాటిల్లలేదన్న భరోసా ఖాతాదారుకు ఉండాలి కనుక.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement