
లాకర్లలో ఏం జరిగినా మాది బాధ్యత కాదు!
⇔ ప్రభుత్వ బ్యాంకుల ఒప్పందంలో నిబంధన
⇔ దర్యాప్తు కోరుతూ సీసీఐకి ఫిర్యాదు
న్యూఢిల్లీ: బ్యాంకు లాకర్లలో ఏది దాచినా భద్రంగా ఉంటుందన్న భరోసాతో ఉన్నవారు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. లాకర్లలో ఉంచినవి చోరీకి లేదా దోపిడీకి గురైతే ప్రభుత్వరంగ బ్యాంకులకు ఏ మాత్రం బాధ్యత లేదట. కుష్‌కల్రా అనే న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద లాకర్లపై సమాచారం కోసం దరఖాస్తు చేయగా, ఈ నిజాన్ని ఆర్‌బీఐ, 19 ప్రభుత్వరంగ బ్యాంకులు స్వయంగా వెల్లడించాయి. ఈ సమాధానంతో నివ్వెరపోయిన న్యాయవాది కుష్‌కల్రా... కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తలుపుతట్టారు. ఎస్‌బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు సహా అన్ని బ్యాంకులు కూటమిగా ఏర్పడి ఈ తరహా పోటీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని సీసీఐకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.
ఇలా కూటమిగట్టి సేవల మెరుగుదలను అడ్డుకోవడం మార్కెట్లో పోటీ, వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నారు. ఈ నేపథ్యంలో కాంపిటిషన్ చట్టం కింద బ్యాంకులపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. లాకర్లలో ఉంచిన వాటిపై బ్యాంకులు బాధ్యత తీసుకోనప్పుడు విలువైన వస్తువుల (ఆభరణాలు, పత్రాలు)కు బీమా చేయించి వాటిని ఇంట్లోనే ఉంచుకోవచ్చుగా అని ఆయన ప్రశ్నించారు. ‘‘ఏదైనా యుద్ధం /అల్లర్లు, దొంగతనం లేదా దోపిడీ చర్యల కారణంగా సేఫ్ డిపాజిట్ వోల్ట్(లాకర్లు)లో ఉంచిన వాటిని కోల్పోయినా, నష్టపోయినా బ్యాంకు అందుకు బాధ్యత వహించదు’’ అని లాకర్ల అద్దె ఒప్పందంలో బ్యాంకులు పేర్కొంటున్నట్టు కుష్‌కల్రా తెలిపారు.