మార్కెట్లలో దిద్దుబాటు కొనసాగితే మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో వేల్యూ ఇన్వెస్టింగ్ అనుసరించేవి ఆకర్షణీయంగా మారతాయి. విలువల పరంగా ఆకర్షణీయ స్థాయిలో ఉన్న స్టాక్స్‌ను కొనుగోలు చేయడం వేల్యూ ఇన్వెస్టింగ్‌లో భాగం. ఈ తరహా పథకాలకు ఇటీవల కాస్తంత ఆదరణ తగ్గింది. బుల్ ర్యాలీ జోరే అందుకు కారణం. కరెక్షన్ నేపథ్యంలో వీటికి మళ్లీ ఆకర్షణ వస్తోంది. ఇటువంటి పథకాల్లో క్వాంటమ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ కూడా ఒకటి. మార్కెట్లు డౌన్‌సైడ్‌లో ఉన్నపుడు ఆ ప్రభావాన్ని గట్టిగా ఎదుర్కోగలిగే సామర్థ్యం ఈ ఫండ్‌కు ఉంది. లార్జ్‌క్యాప్ ఫండ్ కేటగిరీలోకి వస్తుంది. దీర్ఘకాలంలో ఇతర పథకాల కంటే క్వాంటమ్ లాంగ్‌టర్మ్ రాబడులు అధికంగా ఉండడం గమనించొచ్చు.
రాబడులు బాగున్నాయి...
గతేడాది బుల్స్ ర్యాలీ జోరుగా ఉన్నప్పుడు, ఈ పథకం రాబడులు 12.5 శాతమే. గతేడాది ప్రామాణిక సూచీల రాబడులు 22.5 శాతం అయితే, లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోనే ఇతర పథకాల సగటు రాబడులు 20 శాతం. కాకపోతే, దీర్ఘకాలంలో చూస్తే మూడు, ఐదు, పదేళ్ల కాలంలో క్వాంటమ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ రాబడులు సూచీలకు దీటుగా కాస్తంత పైనే ఉన్నాయి. అందుకే దీర్ఘకాలిక లక్ష్యాలు, అవసరాల కోసం నిధి సమకూర్చుకునేందుకు పరిశీలించతగిన పథకం ఇది. దీర్ఘకాలిక పోర్ట్‌ఫోలియోలో, లార్జ్‌క్యాప్‌కు ప్రాధాన్యం ఇచ్చే వారి పోర్ట్‌ఫోలియోలో చోటివ్వదగిన పథకం.
ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో ఈ ఫండ్ రాబడులు తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం అధిక నగదు నిల్వలు ఉండటమే. మొత్తం నిధుల్లో 16 శాతం నగదు రూపంలోనే ఉన్నాయి. పెట్టుబడుల్లో 80 శాతం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కే కేటాయించింది. దీంతో బుల్ ర్యాలీలో రాబడులు పరిమితంగా, స్థిరంగా ఉన్నాయి. మార్కెట్లు, స్టాక్స్ విలువలు ఖరీదుగా మారాయని భావిస్తే విక్రయించేసి నగదు నిల్వలను పెంచుకోవడంలో ఈ పథకం ఏమాత్రం సంకోచించదు. అధిక నగదు నిల్వలుండటం వల్ల మార్కెట్ల దిద్దుబాటులో ఆకర్షణీయమైన విలువల వద్ద లభించే స్టాక్స్‌లో తిరిగి ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు లభిస్తుంది.
పెట్టుబడులు, పోర్ట్‌ఫోలియో
ఈ పథకం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కే పరిమితం. దీంతో మార్కెట్లు డౌన్‌టర్న్‌లో స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ మాదిరిగా విలువ భారీగా హరించుకుపోయే ప్రమాదం తక్కువ. ఇతర పథకాలతో పోలిస్తే ప్రతికూల సమయాల్లోనూ ఈ ఫండ్ మెరుగ్గా రాణించడానికి ఈ విధానమే కారణం. ఈ ఫండ్ ఎక్స్‌పెన్స్ రేషియో (వ్యయాల నిష్పత్తి) చాలా తక్కువ.
డైరెక్ట్ ప్లాన్‌లో ఇది 1.29 శాతం అయితే, రెగ్యులర్ ప్లాన్‌లో 1.46. ఇక పోర్ట్‌ఫోలియో సైతం అధిక నాణ్యత కలిగిన 25లోపు కంపెనీలతోనే ఉండడం ఆకర్షణీయమే. గడిచిన ఏడాది కాలంలో ఈ ఫండ్ తన పోర్ట్‌ఫోలియోలోకి చేర్చుకున్న స్టాక్ లుపిన్ మాత్రమే. ఈ షేరు ధర భారీగా పతనం కావడంతో చౌకగా లభిస్తుండడమే కారణం. మరోవైపు, కోటక్ మహింద్రా బ్యాంకు, ఇండియన్ ఆయిల్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, భారతీ ఎయిర్‌టెల్ స్టాక్స్‌ను విక్రయించింది.
టాప్ టెన్ హోల్డింగ్స్
కంపెనీ పెట్టుబడుల శాతం
బజాజ్ ఆటో 7.55
హెచ్‌డీఎఫ్‌సీ 7.36
ఇన్ఫోసిస్ 6.46
హీరో మోటోకార్ప్ 6.13
టీసీఎస్ 5.80
ఐసీఐసీఐ బ్యాంక్ 4.66
ఎస్‌బీఐ 4.05
ఇండియన్ హోటల్స్ 3.89
విప్రో 3.71
ఎన్‌టీపీసీ 3.66
Comments
Please login to add a commentAdd a comment