ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్‌నే పరిగణనలోకి తీసుకోవాలా ? లేక ఆ మ్యూచువల్ ఫండ్‌ను నిర్వహిస్తున్న ఫండ్‌హౌస్ పేరు ప్రతిష్టలకు ప్రాధాన్యత ఇవ్వాలా? బ్రాండ్ నేమ్ సంగతేంటి?
- కరుణాకర్, చెన్నై
ఏదైనా ఈక్విటీ ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫండ్ హౌస్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాసెస్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఆ ఫండ్ హౌస్ నిర్వహిస్తున్న ఇతర మ్యూచువల్ ఫండ్స్ ట్రాక్ రికార్డ్‌ను పరిశీలించి ఈ విషయాన్ని అంచనా వేయవచ్చు. ఆ విధంగా ఫండ్‌హౌస్ పాత్ర ముఖ్యమైనదే. అయితే మంచి ఫండ్‌హౌస్ నిర్వహించే మ్యూచువల్ ఫండ్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయని చెప్పలేం. అందుకే ఫండ్‌హౌస్ పేరు ప్రఖ్యాతులుగలదనో, బ్రాండ్ నేమ్ బాగుందనో కాకుండా, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి విధి విధానాలు, ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకొని ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.
నేనొక ఎఫ్‌ఎంపీ(ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్)లో ఇన్వెస్ట్ చేశాను. కానీ నాకు ఇప్పుడు డబ్బులు అత్యంత అవసరంగా ఉన్నాయి. ఈ ఎఫ్‌ఎంపీ ద్వారా బ్యాంకు నుంచి రుణం పొందవచ్చా? అది సరైనదేనా?
- మల్లిక, విజయవాడ
మీరు ఎఫ్‌ఎంపీ ఆధారంగా బ్యాంకులో రుణం పొందవచ్చు. ఇలా చేయడానికి మీ ఎఫ్‌ఎంపీ యూనిట్లు డీమెటీరియలైజ్ రూపంలో ఉండాలి. మీరు తాకట్టు పెట్టడానికి, అవసరమైతే బ్యాంకు వీటిని విక్రయించుకోవడానికి ఎఫ్‌ఎంపీ యూనిట్లు డీమ్యాట్ రూపంలో ఉండాలి. మీకు డబ్బులు అత్యవసరమైతే వీటిని తాకట్టు పెట్టి బ్యాంక్ నుంచి రుణం తీసుకోవచ్చు. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆధారంగా రుణం పొందినంత సులభంగా, వేగంగా ఎఫ్‌ఎంపీని తాకట్టు పెట్టి రుణం పొందలేము.
నేను 2007లో రిలయన్స్ ట్యాక్స్ సేవర్ డివిడెండ్ రీఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో రూ.20,000 ఇన్వెస్ట్ చేశాను. ఇప్పటివరకూ రూ.11,600 డివిడెండ్‌గా పొందాను. ఈ ఫండ్‌లో కొనసాగమంటారా? వైదొలగ మంటారా? - శ్రీనివాస్, అమలాపురం
రిలయన్స్ ట్యాక్స్ సేవర్ అనేది త్రీ స్టార్ రేటింగ్ ఉన్న ట్యాక్స్ సేవింగ్ ఫండ్. అన్ని ట్యాక్స్ సేవింగ్ ఫండ్‌లకు మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ లాకిన్ పీరియడ్ మూడేళ్లలో మీకు డబ్బులు అవసరమైతే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ అక్కరకు రావు. ఇక డివిడెండ్ రీఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో సంస్థ అందించే డివిడెండ్‌లను రీ ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా రీ ఇన్వెస్ట్ చేసిన వాటికి కూడా మూడేళ్ల లాక్‌ఇన్ పీరియడ్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన తేదీన కాకుండా డివిడెండ్‌ను రీ ఇన్వెస్ట్ చేసిన తేదీని పరిగణనలోకి తీసుకొని మూడేళ్ల లాకిన్ పీరియడ్‌ను లెక్కిస్తారు. డివిడెండ్ రీ ఇన్వెస్ట్‌మెంట్ నుంచి డివిడెండ్ పే అవుట్ ప్లాన్‌కు మారితే డివిడెండ్‌లను మీరు నేరుగా వచ్చేస్తాయి.
గత 3-4 ఏళ్లుగా నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే నా ఇన్వెస్ట్‌మెంట్స్‌లో చెప్పుకోదగ్గ వృద్ధి లేదు. నా రిటైర్మెంట్ అవసరాల కోసం ఎన్‌పీఎస్‌లో కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? - మూర్తి, వరంగల్
ఈక్విటీల్లో ఎక్కువ భాగం పెట్టుబడులు పెట్టడానికి లేకుండా నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)ను డిజైన్ చేశారు. ఎన్‌పీఎస్‌లో గరిష్టం 50 శాతం వరకూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ విషయానికొస్తే, రెండు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి ఇన్వెస్టర్ భరించగలిగే రిస్క్, రెండోది పన్ను అంశాలు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి పన్నులు ఉండవు. అదే రెగ్యులర్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్రయోజనం మీకు దక్కదు. అయితే ఈక్విటీల్లో దీర్ఘకాలిక రాబడులపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పని లేదు. కానీ ఎన్‌పీఎస్ రాబడులపై మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుం ది. ఇక రిస్క్ విషయానికొస్తే, ఈక్విటీ ఫండ్స్‌తో, బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌తో పోల్చితే ఎన్‌పీఎస్‌లో రిస్క్ కొంచం తక్కువ. ఎగ్రెసివ్ ఈక్విటీ ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పటికీ, 3-4 ఏళ్లలో చెప్పుకోదగ్గ రాబడులు రావు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మీ నిర్ణయాన్ని తీసుకోండి.
-ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
ఫండ్‌హౌస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలా?
Published Mon, Feb 3 2014 12:34 AM | Last Updated on Fri, Oct 19 2018 7:00 PM
Advertisement
Advertisement