ఇది దీర్ఘకాలికంగా మంచి పనితీరు కలిగిన లార్జ్‌క్యాప్ ఫండ్. గత ఐదేళ్ల పనితీరు కూడా ఆశాజనకంగానే ఉంది. 2008, 2011, 2013, 2016లో మార్కెట్ల డౌన్‌ట్రెండ్‌లో ఉన్నప్పుడు కూడా రాబడులు పడిపోకుండా చూసిన పథకమిది. అయితే మార్కెట్లు ర్యాలీ చేసినపుడు కూడా ఇది మరీ భారీ రాబడులేమీ ఇవ్వలేదు. పర్వాలేదనిపించే రాబడులనిచ్చింది. మోస్తరు రిస్క్ భరించేవారు, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు పరిశీలించదగిన పథకాల్లో ఇదీ ఒకటి.
పనితీరు ఎలా ఉందంటే...
దీర్ఘకాలంలో ఈ పథకం పనితీరు బావుంది. కాకపోతే ఏడాది, రెండేళ్ల కాలంలో మాత్రం ఆశించిన మేర లేదు. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 80 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. మిగిలిన నిధుల్ని మిడ్‌క్యాప్స్‌కు కేటాయిస్తుంది. రాబడుల కోసం అధిక వృద్ధికి అవకాశం ఉన్న బలమైన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. 5–10 ఏళ్ల కాలంలో రాబడులు బెంచ్ మార్క్‌తో ఇండెక్స్‌లతో పోలిస్తే 3–4 శాతం అధికంగానే ఉన్నాయి.
అదే స్వల్పకాలంలో చూస్తే మాత్రం ఒకటి, రెండు శాతం తక్కువగా ఉన్నాయి. ఏడాది కాలంలో ఈ పథకం రాబడులు వార్షికంగా 9.5 శాతంగా ఉంటే, బెంచ్‌మార్క్ రాబడులు వార్షికంగా 14 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు 9.2 శాతం కాగా, బెంచ్ మార్క్ రాబడులు 10.2 శాతంగా ఉన్నాయి. ఇక ఐదేళ్ల కాలంలో పథకం రాబడులు 16.4 శాతం అయితే, బెంచ్ మార్క్ రాబడులు 15.2 శాతమే. అంటే దీర్ఘకాలంలో ఈ పథకం బెంచ్‌మార్క్‌కు తగ్గకుండా రాబడులను ఇస్తుందని ఆశించవచ్చు.
ఫైనాన్స్ షేర్లకు పెద్దపీట...
ఈ పథకం ఎక్కువగా బ్యాంకులకు, ఫైనాన్స్ స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. బ్యాంకుల్లో 22.9 శాతం, ఫైనాన్స్ స్టాక్స్‌లో 11.8 శాతం, సాఫ్ట్‌వేర్‌లో 10.4 శాతం, కన్జూమర్ నాన్ డ్యూరబుల్ రంగం స్టాక్స్‌లో 10.3 శాతం, ఆటోమొబైల్స్‌లో 7.2 శాతం, ఫార్మాలో 4.8 శాతం చొప్పున ఎక్స్‌పోజర్ కలిగి ఉంది.
ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో భిన్న రంగాలకు చెందిన మొత్తం 77 స్టాక్స్ ఉన్నాయి. దీనివల్ల ఈ పథకం రిస్క్ తక్కువే అని చెప్పుకోవచ్చు. గత ఏడాది కాలంలో డాబర్ ఇండియా, ఇమామి, పీఎన్‌బీ, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ తదితర కంపెనీలను పోర్ట్‌ఫోలియోకు యాడ్ చేసింది. గత ఏడాది కాలంలో బజాజ్ ఫైనాన్స్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్, హెచ్‌యూఎల్, బ్రిటానియా, టైటాన్‌లో పెట్టుబడుల కారణంగా మంచి రాబడులను అందుకుంది.
సెబీ మార్గదర్శకాలు
సెబీ మార్గదర్శకాల ప్రకారం ఈ పథకం 80 శాతం నిధుల్ని లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన నిధుల్ని మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. గతంలో బీఎస్‌ఈ 200 ఈ పథకానికి ప్రామాణిక సూచీగా ఉంటే, మార్పుల అనంతరం జూన్ 4 నుంచి నిఫ్టీ 50 బెంచ్‌మార్క్‌గా మారింది. సెబీ మార్గదర్శకాలతో రిస్క్ ఇంకాస్త తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment