భారత ఆర్థిక వ్యవస్థ 6 శాతంపైనే వృద్ధి సాధిస్తుందని ఆర్‌బీఐ, రేటింగ్ ఏజెన్సీలతోపాటు ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ అంచనా వేస్తున్నాయి. ఈ దశాబ్దం భారత్‌దే అని ఘంటాపథంగా చెబుతున్నాయి. ఆర్థిక వృద్ధి వేగవంతం అయితే ఎక్కువగా లాభపడేది చిన్న, మధ్య స్థాయి కంపెనీలే. ఎందుకంటే ఇవి పెద్ద మొత్తంలో వ్యాపార అవకాశాలను సొంతం చేసుకుంటాయి. కనుక దీర్ఘకాలానికి అధిక రాబడులు ఆశించే వారు, రిస్క్ భరించే సామర్థ్యం ఉన్నట్టు అయితే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. మిడ్‌క్యాప్ విభాగంలో కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ పథకం మెరుగైన పనితీరు చూపిస్తోంది.
రాబడులు
ఈ పథకం మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటుంది. దీర్ఘకాలంలో పనితీరును గమనించినట్టయితే రాబడులు మెరుగ్గా కనిపిస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 18 శాతానికి పైగా రాబడులు వచ్చాయి. గడిచిన మూడేళ్లలో 29 శాతం, ఏడేళ్లలో 16 శాతం, పదేళ్లలో 22 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చి.. మిడ్‌క్యాప్ విభాగంలోని మెరుగైన పథకాల్లో ఒకటిగా నిలిచింది. మిడ్‌క్యాప్ విభాగం సగటు రాబడులతో పోల్చి చూసినప్పుడు మూడేళ్లు, ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో ఈ పథకమే అధిక రాబడులను అందించింది. కోటక్ మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తున్న ఏకైక మిడ్‌క్యాప్ పథకం ఇదే. బీఎస్‌ఈ 150 మిడ్‌క్యాప్ టీఆర్‌ఐతో పోల్చి చూసినప్పుడు ఏడాది, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో ఈ పథకమే మెరుగైన పనితీరు చూపించింది.
పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో
కనీసం 65 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడులను మిడ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. ఎంతో వృద్ధికి అవకాశం ఉన్న ఆణిముత్యాల్లాంటి కంపెనీలను ఈ పథకం గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. వ్యాల్యూ స్టాక్స్‌ను సైతం పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవడాన్ని గమనించొచ్చు. మంచి స్టాక్స్‌ను గుర్తించడమే కాదు.. తగిన రాబడులు ఇచ్చే వరకు పోర్ట్‌ఫోలియోలో కొనసాగిస్తుంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం నిర్వహణలో రూ.33,918 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోను గమనించినట్టయితే.. 94.27 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది.
ఈక్విటీ పెట్టుబడుల్లో 71 శాతం మిడ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 27 శాతం ఇన్వెస్ట్ చేయగా, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 2 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 80 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. ఈ రంగాలకు చెందిన కంపెనీలకు 19 శాతం కేటాయింపులు చేసింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 13 శాతం పెట్టుబడులు ఉన్నాయి. మెటీరియల్స్ కంపెనీల్లో 11 శాతం, కెమికల్స్ కంపెనీల్లో 10 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషనరీ కంపెనీల్లో 10 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. హెల్త్‌కేర్ కంపెనీల్లో 6 శాతం వరకు పెట్టుబడులు ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్ విభాగంలో ఆటుపోట్లు ఎక్కువ. కనుక రిస్క్ భరించే వారే ఈ తరహా పథకాలను పరిగణనలోకి తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment