చాలా కంపెనీలు వచ్చే రెండు, మూడేళ్ల కాలంలో తమ ఫలితాల్లో రెండంకెల స్థాయిలో వృద్ధి ఉంటుందని ఇటీవల ఫలితాల అనంతరం నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్స్‌లో స్పష్టం చేశాయి. అంటే భవిష్యత్తులో తమ పెట్టుడులపై మెరుగైన రాబడులు కోరుకునే వారు ఈ తరహా కంపెనీలను సరైన సమయంలో గుర్తించి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్న మాట. ఆ విధంగా చూసినప్పుడు రిస్క్ కొంచెం భరించగలిగే వారికి మిరే అస్సెట్ ఇండియా ఈక్విటీ ఫండ్ కూడా ఒక ఎంపిక అవుతుంది.
పెట్టుబడుల విధానం ఇదీ...
దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధికి గాను దేశ ఆర్థిక రంగంతో ముడిపడిన రంగాల్లో కంపెనీలను గుర్తించి ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ నెల 28 నాటికి బ్యాంకింగ్, ఫైనాన్షియల్, హౌసింగ్ ఫైనాన్స్ రంగాల్లో ఎక్కువ ఎక్స్‌పోజర్ తీసుకుంది. ఈ రంగాల్లో 25.71 శాతం పెట్టుబడులు పెట్టింది.
8.19 శాతం నిధుల్ని ఐటీ, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది. రిఫైనరీ కంపెనీల్లో 6.38 శాతం, ఫార్మా కంపెనీల్లో 4.24 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. ఈక్విటీల్లో 97.2 శాతం నిధుల్ని ఇన్వెస్ట్ చేయగా, 2.44 శాతం మేర నగదు నిల్వలను కలిగి ఉంది.
పనితీరు...
ఈ పథకం ఎక్కువగా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఏడాది కాలంలో 11.22 శాతం, గత మూడేళ్ల కాలంలో సగటున 13 శాతం, ఐదేళ్ల కాలంలో సగటున 20 శాతం చొప్పున వార్షిక రాబడులందించింది. కానీ, ఈ కాలంలో బెంచ్ మార్క్ బీఎస్‌ఈ 200 రాబడులు 9 నుంచి 13 శాతంగానే ఉన్నాయి. ఆస్తులపై అధిక రాబడులున్న కంపెనీలను కొనుగోలు చేస్తుంది. ఈ పథకం పనితీరును మెరుగ్గా ఉంచుతున్నవి ఇవే.
మిగిలిన పోటీ పథకాలతో పోలిస్తే 5–10 శాతం అదనంగా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టింది. లార్జ్‌క్యాప్స్‌లోనూ విలువలకే ప్రాధాన్యం ఇస్తోంది. గడిచిన ఆరు నెలల కాలంలో కొత్తగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, భారత్ ఎలక్ట్రానిక్స్, సిప్లా, మారికో, యునైటెడ్ ఫాస్ఫరస్, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌లో ఇన్వెస్ట్ చేసింది. సీఈఎస్‌సీ నుంచి పూర్తిగా తప్పుకోగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏషియన్ పెయింట్స్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, టీసీఎస్‌లో వాటాల్ని పెంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment