సెగ..
సిద్ధుకు ఇంటా బయట అసమ్మతి
అర్కావతిపై జేడీఎస్, బీజేపీ పట్టు
రాజీనామాలతో బెంబేలెత్తించిన మంత్రి!
అదే బాటలో మరికొందరు మంత్రులు?
బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు శాసనసభ సమావేశాలకు ముందు అసమ్మతి సెగ తీవ్రతరమైంది. ఇప్పటి వరకు విపక్షాల నుంచి మాత్రమే ఉన్న సెగ ప్రస్తుతం స్వపక్షంలోనే మంత్రి సతీష్‌జారకిహోళి రాజీనామా రూపంలో బయట పడింది. ఇది ప్రస్తుతానికి చల్లారదని మరింతగా రాజుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అర్కావతి డీ నోటిఫికేషన్ విషయంలో అటు బీజేపీతో పాటు జేడీఎస్ పార్టీ నేతలు కూడా సిద్ధరామయ్యకు విరుద్ధంగా ఒంటికాలిపై లేస్తున్నారు. ఎలాగైనా ఈ విషయంలో ఆయన్ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ ఏకంగా సిద్ధరామయ్య విరుద్ధంగా ప్రాసిక్యూషన్ (విచారణ)కు ఆదేశించాలని గవర్నర్ వజుభాయ్‌రుడాభాయ్ వాలా పై ఒత్తిడి తీసుకువస్తోంది. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో ఇదే విషయాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి నిర్ణయించుకుంది. ఇదిలా ఉండగా సిద్ధరామయ్యకు స్వపక్షంలోనే కొత్త తలనొప్పి మొదలయ్యింది. నూతన శాఖలు కేటాయించాలని ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై ఒత్తిడి తీసుకు వస్తున్న మంత్రులు తాజాగా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. దీనివల్ల త్వరలో జరగనున్న మంత్రి మండలి పునఃవిస్తరణలో తమకు నచ్చిన శాఖలు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుందనేది వారి ఆలోచన. అందులో భాగంగానే సతీష్‌జారికిహోళి రాజీనామా చేసినట్లు సమాచారం.
అదే దారిలో మరికొంతమంది అమాత్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జైన వర్గానికి చెందన అభయ్‌కుమార్ జైన్‌కు యువజన, క్రీడలతోపాటు మత్స్యపరిశ్రమాభివృద్ధి శాఖను కేటాయించడం పట్ల మొదటి నుంచి ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పౌరసరఫరాలశాఖ మంత్రి దినేష్‌గుండూరావ్, సహకారశాఖ మంత్రి మహదేవప్రసాద్, వైద్య విద్యాశాఖను నిర్వహిస్తున్న శరణ్‌ప్రకాశ్‌పాటిల్‌తో పాటు ఐటీ,బీటీ శాఖ మంత్రి ఎస్.ఆర్‌పాటిల్‌లు కూడా రాజీనామ అస్త్రాన్ని ప్రయోగిస్తారని తెలుస్తోంది. గతంలో వీరంతా బహిరంగంగానే తమకు కేటాయించిన శాఖల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ఇక్కడ గుర్తుచేస్తున్నారు. అటు విపక్షాల నుంచి ఎదురవుతున్న ‘అర్కావతి’ ఆరోపణలు నుంచి బయటపడటానికి సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కొత్తగా స్వపక్షం నుంచే రాజీనామాల ఘట్టం తెరపైకి రావడం సిద్ధుకు కంటి పై కునుకులేకుండా చేస్తోంది.