పార్టీ నాయకులకు సీఎం సిద్ధు దిశానిర్దేశం
మంత్రులు కృష్ణభైరేగౌడ, ఆంజనేయపై సహచర నాయకుల ఆక్రోశం
సీఎల్పీకు గైర్హాజరైన రెబెల్ స్టార్ అంబరీష్
బెంగళూరు : అవిశ్వాస తీర్మానాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందామని ఇందుకు శాసనసభ సమావేశాలకు తప్పక హాజరు కావాలని కాంగ్రెస్‌పార్టీ శాసనసభ పక్ష సమావేశం (సీఎల్పీ)లో పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిశానిర్దేశం చేశారు. అంతేకాక అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్న విపక్ష జేడీఎస్ పార్టీ పై తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న నేపథ్యంలో విధానసౌధాలో బుధవారం సీఎల్పీ సమావేశం జరిగింది. సభ ప్రారంభమైన వెంటనే సిద్ధరామయ్య మాట్లాడారు. ‘ప్రభుత్వం పడిపోదని తెలిసినా రాజకీయ ప్రయోజనం ఆశించి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడానికి జేడీఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అక్రమాలు జరిగినట్లు ఆ పార్టీ నాయకులు భావిస్తే శాఖవారి చర్చల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. అలాకాక అవిశ్వాస తీర్మానానికి ముందుకు పడటం సరికాదు. ఆ పార్టీకు తగిన బుద్ధి చెప్పాలంటే అందరూ కలిసికట్టుగా ఉండాలి. శాఖ పరంగా గణాంకసహిత జవాబులు చెప్పడానికి మంత్రులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక ఎమ్మెల్యేలు తప్పక హాజరు కావాలి.’ అని పేర్కొన్నారు
ఈ సమయంలో కలుగజేసుకున్న సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు కే.బి కోళివాడ మేము మీవెంట ఉంటాం. అవిశ్వాస తీర్మానం తప్పక వీగిపోతుంది. అని భరోసాయిచ్చారు. ఇందుకు సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న చాలా మంది నాయకులు మద్దతు పలికారు. అయితే సభలో పాల్గొన్న నాయకుల్లో చాలా మంది వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణభైరేగౌడపై విమర్శల వర్షం కురిపించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందించడమే వ్యవసాయశాఖ పనికాదన్నారు. రైతులకు సరైన సమయంలో అవసరమైనంత మేర రుణాలు కూడా ఇప్పించాల్సిన బాధ్యత ఆ శాఖపై ఉందని గుర్తుచేశారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్క రైతు కుటుంబానైనా మంత్రి కృష్ణైభైరేగౌడ పరమార్శించారా? బలవన్మరణాలు తగ్గించడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అవాక్కయిన అయన మీ సలహాలు, సూచనలు పాటిస్తానంటూ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించారు. దీంతో శాంతించిన నాయకులు వ్యవసాయ, ఉద్యానశాఖ, పశుసంవర్ధకశాఖ మంత్రులతో సలహాసమితి రూపొందించి పరిహారం అందించే విషయమై రెవెన్యూ డివిజన్‌ల వారిగా పార్టీ ఎమ్మెల్యేలతో సంప్రదించాలని సూచించారు. ఇందుకు మంత్రి కృష్ణభైరేగౌడ సమ్మతించడంతో శాంతియుత వాతావరణం ఏర్పడింది.
ఇదిలా ఉండగా రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖలో పరుపులు, తలగడ (దిండ్లు) కొనుగోలులో జరిగిన అక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రమేయం ఉందన్నట్లు బహిరంగ వాఖ్యలు చేసిన ఆ శాఖ మంత్రి ఆంజనేయ పై కూడా సహచరులు గరం అయ్యారు. ఈ సమయంలో సిద్ధరామయ్యతో సహా కొంతమంది సీనియర్ నాయకులు కలుగజేసుకుని పరిస్థితిని యథాస్థితికి తీసుకువచ్చారు. రైతుల ఆత్మహత్యల విషయంతోపాటు లోకాయుక్త పై అవినీతి ఆరోపణలు తదితర విషయాల పై చర్చించేందుకు వచ్చే బుధవారం మరోసారి సీఎల్పీ నిర్వహిస్తానని సిద్ధరామయ్య సమావేశంలో ప్రకటించారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్న ‘రెబెల్‌స్టార్’ గృహనిర్మాణశాఖ మంత్రి అంబరీష్ సీఎల్పీకు గైర్హాజరయ్యారు.