ఆయనేమన్న హిట్లరా !
నేను కాలికి వేసుకునే చెప్పును కాదు
సీఎం సిద్ధరామయ్యపై అంబి ఫైర్
రాజీనామా ఉపసంహరించుకునే ప్రసక్తే లేదన్న అంబరీష్
బెంగళూరు: ‘ఆయనకు (సీఎం సిద్ధరామయ్య) ఇష్టమొచ్చినట్లు మార్చేయడానికి నేను కాలికి వేసుకునే చెప్పును కాదు’ అంటూ రెబల్‌స్టార్, మాజీ మంత్రి అంబరీష్ సిద్ధరామయ్యపై మండిపడ్డారు. మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్లు తనతో ఒక్క మాట చెప్పి ఉంటే తానే పదవి నుంచి తప్పుకొని ఉండే వాడినని అన్నారు. మంత్రి పదవికి అసమర్థుడినైతే, ఎమ్మెల్యేగా కూడా అసమర్థుడినేనని, అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని తెలిపారు. మంగళవారమిక్కడి ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా స్నేహితులు ఉన్నారు. ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఏ స్థానంలో కూడా ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. అందుకే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామాను వెనక్కు తీసుకోబోను’ అని అంబరీష్ స్పష్టం చేశారు. పరిషత్ సమావేశంలో అందరు మంత్రులను ఉద్దేశించి మాట్లాడారని, అంటే తామేమైనా హోల్‌సేల్‌లో కొనుగోలు చేసేందుకు ఉన్నవాళ్లమా? అని సిద్ధరామయ్యపై మండిపడ్డారు.
‘తనకు ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన (సిద్ధరామయ్య) హిట్లరో, డిక్టేటరో కాదు. సినీపరిశ్రమలో 40 ఏళ్లకు పైగా పనిచేశాను. మూడు సార్లు ఎంపీగా పనిచేశాను. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాను. నేను ఎప్పుడూ పదవుల కోసం లాబీయింగ్ జరపలేదు. అలాంటి పరిస్థితి నాకెప్పుడూ ఎదురుకాలేదు’ అని అంబరీష్ పేర్కొన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్‌తో కూడా తాను చర్చలు జరపబోనని అన్నారు. ఇక అంబరీష్ పదవిని కోల్పోవడం వెనక మాజీ ఎంపీ రమ్య హస్తం ఉందన్న వార్తలపై అంబరీష్ స్పందిస్తూ ‘పాపం ఆ అమ్మాయికి ఏం సంబంధం ఉంటుందయ్యా, తను కూడా నాలాగే సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చింది. ఈ విషయంలోకి ఆ అమ్మాయిని ఎందుకు లాగుతారు’ అంటూ సమాధానమిచ్చారు. ఇక అంబరీష్‌ను మంత్రి మండలి నుంచి తప్పించడంపై మండ్యలో నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ఆయన అభిమానులు మంగళవారమిక్కడి ఆయన నివాసంలో అంబరీష్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన మహిళా అభిమానులు కన్నీరు పెట్టడంతో అంబరీష్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు.