ఊపుతగ్గని అసమ్మతి!  | Telangana Elections TRS Leaders In Nalgonda | Sakshi
Sakshi News home page

ఊపుతగ్గని అసమ్మతి! 

Published Tue, Oct 2 2018 10:27 AM | Last Updated on Tue, Oct 2 2018 10:27 AM

Telangana Elections  TRS Leaders In Nalgonda - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న అసమ్మతి నేత కోటిరెడ్డి

టీఆర్‌ఎస్‌ పార్టీలో అసమ్మతి లొల్లికి ఫులిస్టాప్‌ పడడం లేదు. నాగార్జునసాగర్‌లో స్థానికత అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన ఎంసీ కోటిరెడ్డి.. ఇప్పటికే ప్రకటించిన నోముల నర్సింహయ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం నియోజకవర్గంలో మోటార్‌సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఒకవైపు అసమ్మతి నేతలపై ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు అధిష్టానానికి ఎప్పటికప్పుడు తెలియ
జేస్తూనే ఉన్నారు. అధిష్టానం కూడా వారిపై ఒకింత ఆగ్రహంగానే ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. బుజ్జగించండి..వినకపోతే వదిలేయండి.. మీకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెబుతున్నట్లు తెలుస్తోంది. 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : టీఆర్‌ఎస్‌లో అసమ్మతి రాజకీయానికి చెక్‌ ఎలా పెట్టాలా అని అధినాయకత్వం ఆలోచిస్తోంది. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నేతల ఊపు తగ్గడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి మరో ఐదు రోజులైతే నెల అవుతుంది. ఇప్పటికే పలుచోట్ల అసమ్మతి నేతల సభలు, ర్యాలీలు జరిగాయి. ఆ నేతలను పిలిపించుకుని రాష్ట్ర నాయకత్వం మాట్లాడింది. బుజ్జగించే కాడికి బుజ్జగించింది. అయినా, కొన్నిచోట్ల ఇంకా అసంతృప్తి రగులుతూనే ఉంది.

తొలి విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 4వ తేదీన పార్టీ అధినేత కేసీఆర్‌ నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. దీనికోసం జిల్లా నాయకత్వమంతా నియోజకవర్గాల వారీగా మండలాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి సమీకరణపై కసరత్తు చేస్తోంది. కాగా, అసమ్మతి నాయకులు ఇదే అదునుగా తమ ప్రభావాన్ని నాయకత్వానికి స్పష్టం చేసేందుకు రంగంలోకి దిగుతున్నారు.

సాగర్‌లో సద్దుమణగని అసమ్మతి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్క నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో మాత్రమే ఇంకా అసమ్మతి సద్దుమణగలేదు. సోమవారం నియోజకవర్గంలో ని అన్ని మండలాల్లో బైక్‌ ర్యాలీలు జరిగాయి. అన్ని మండలాల ర్యాలీలు నియోజకవర్గ కేంద్రం హాలియాలో కలుసుకుని హాలియా, నిడమనూరు మండలాల మీదుగా త్రిపురారం చేరుకున్నాయి. ఇక్కడ అసమ్మతి నాయకుడు ఎంసీ కోటిరెడ్డి బహిరంగ సభ నిర్వహించారు. స్థానిక నినాదంతో నియోజకవర్గ స్థానికులకే టికెట్‌ కేటాయించాలని, స్థానికేతరుడైన అభ్యర్థి నర్సింహయ్యను మార్చాలని ఈ బహిరంగ సభ డిమాండ్‌ చేసింది.

దాదా అన్ని నియోజకవర్గాల్లో  అసమ్మతి నేతల కార్యకలపాలు తగ్గాయి. అయితే, మిర్యాలగూడలో అసమ్మతి నేత అలుగుబెల్లి అమరేందర్‌ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయించుకుని నియోజకవర్గంలో సొంతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. నల్లగొండలో మరో అసమ్మతి నేత చకిలం అనిల్‌ కుమార్‌ సైతం తాను ఈ సారి పోటీలో నిలబడతానని ప్రచారం చేస్తున్నారు. ఒకటీ రెండు నియోజకవర్గాలు అని కాకుండా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులపై అసమ్మతితో ఉన్నారనుకుంటున్న నేతలందరినీ పలిపించి మరో మాట్లాడాలని జిల్లా నాయకత్వానికి అధి ష్టానం సూచించినట్లు పార్టీ వర్గాల సమాచారం.

నల్లగొండ అసమ్మతిపై అధిష్టానం సీరియస్‌
నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో అసమ్మతి నేతల కార్యకలాపాలపై అధినాయకత్వం ఒకింత సీరియస్‌గానే ఉందంటున్నారు. ఇక్కడ మాజీ ఇన్‌చార్జులు దుబ్బాక నర్సింహారెడ్డి, చకిలం అనిల్‌కుమార్, తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు తండు సైదులు గౌడ్‌ అభ్యర్థిని మార్చాలని సమావేశాలు పెట్టారు. చకిలం అనిల్‌కుమార్‌ను పిలిపించుకుని మాట్లాడినా, తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటా నని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. మిగతా ఇద్దరి నేతలు ఇప్పటికైతే కామ్‌ అయిపోయారంటున్నారు.

అయితే, అభ్యర్థిని మార్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పిన అధినాయకత్వం, నల్లగొండలో అసమ్మతి నేతలుగా ఉన్నవారు పార్టీలో లేరని, వారు పనిచేయరని అనుకుని ప్రచారం చేసుకోవాల్సిం దిగా అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డికి సూచిం చారని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా నల్లగొండలో పాగా వేసేందుకే టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ 4వ తేదీన నల్లగొండలో తొలి బహిరంగ సభలో పాల్గొంటున్నారని చెబుతున్నారు. అసమ్మతి నాయకులపై ఇప్పటికిప్పుడు సస్పెన్షన్‌ వేటు వేయడం వంటి నిర్ణయాల జోలికి పోకుండా, మరోసారి పిలిపించి మాట్లాడాలని, మాట వినకుంటే వారి ఖర్మ అని కూడా అధినాయకత్వం అభిప్రాయ పడిందని చెబుతున్నారు.

కేసీఆర్‌ సభపైనే నేతల దృష్టి
తొలి విడత ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ పాల్గొం టున్న బహిరంగ సభను విజయవంతం చేయడంపైనే జిల్లా నాయకత్వం దృష్టి పెట్టింది. జిల్లా మం త్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మండలిలో ప్రభు త్వ విప్‌ పల్లారాజేశ్వర్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి చాడ కిషన్‌ రెడ్డి తదితరులు సభను సక్సెస్‌ చేయడంపై దృష్టి పెట్టారు. బహిరంగ సభ నిర్వహణ ఇన్‌చార్జిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి సన్నాహక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఒకవైపు అక్కడక్కడా అసమ్మతి తలనొప్పులు ఉన్నా, ఆ ప్రభావం బహిరంగ సభా నిర్వహణపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ శ్రేణులను కేసీఆర్‌ సభ విజయవంతం చేసేందుకు బిజీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement