వేదికపైనుంచి అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ, బీజేపీ అభ్యర్థులు
జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాన మంత్రి మోదీ స్థానిక అంశాలను ప్రస్తావించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాలావత్‌పూర్ణ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారని, కామన్‌వెల్త్ క్రీడల్లో పథకాలు సాధించిన మహ్మద్ హుసాముద్దీన్‌లు దేశ స్వాభిమానాన్ని ప్రపంచానికి చాటారని అభినందించారు. గత ఎన్నికల్లో నిజామాబాద్‌ను లండన్ మాదిరిగా తీర్చి దిద్దుతామని కేసీఆర్ హామీ ఇచ్చారని, లండన్‌లా అభివృద్ధి చెందిందేమోనని హెలికాప్టర్‌లో నగరంపై చక్కర్లు కొట్టి పరిశీలించానని ఎద్దేవా చేశారు.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: యువశక్తితో కూడిన నవభారతానికి ఇందూరు యువతే నిదర్శనమని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ఇందూరు గడ్డపై పుట్టిన 13 ఏళ్ల గిరిజన బాలిక మాలావత్‌పూర్ణ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారని, కామన్‌వెల్త్ క్రీడల్లో పథకాలు సాధించిన మహ్మద్ హుసాముద్దీన్‌లు దేశ స్వాభిమానాన్ని ప్రపంచానికి చాటారని అభినందించారు. ‘మా ర్పు కోసం బీజేపీ’ పేరుతో మంగళవారం నిజా మాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌కళాశాల మైదానంలో భారీ బహిరంగసభను నిర్వహిం చారు. ముఖ్య అథితిగా పాల్గొన్న ప్రధాని వేలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మొదట తెలుగులో ప్రసంగానికి శ్రీకారం చుట్టి అందరినీ ఆకర్శించారు. ‘‘మేరే ప్యారీ భాయ్ అవుర్ బహెనో.. అంటూ మాట్లాడారు.
ప్రధాన మంత్రి హోదాలో నరేంద్రమోదీ నిజామాబాద్ గడ్డపై తొలిసారిగా అడుగుపెట్టారు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నిజామాబాద్‌కు వచ్చారు. కేంద్రంలో మోదీ సర్కారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లాలో పర్యటించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు చేరుకున్నారు. షెడ్యుల్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లాకు వచ్చిన ఆయన బహిరంగ సభ స్థలం పక్కనే ఏర్పాటు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగిన అనంతరం సభావేదికపైకి వచ్చారు. ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి, పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు, జిల్లా నాయకులు స్వాగతం పలికారు. సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని.. సుమారు గంట పాటు తనదైన శైలిలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
నిజామాబాద్ స్మార్ట్ సిటీ ఏమైంది.?
రాష్ట్రంలో కేసీఆర్ పాలనా వైఫల్యాలను ఎండగట్టిన మోదీ.. నిజామాబాద్ జిల్లాలోని పలు స్థానిక అంశాలను తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించడం ఆకర్షణగా నిలిచింది. గత ఎన్నికల్లో నిజామాబాద్‌ను స్మార్ట్‌సిటీగా మారుస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని మోదీ ఎద్దేవా చేశారు. నగరాన్ని లండన్ మాదిరిగా తీర్చి దిద్దుతామని పేర్కొన్నారని మోదీ గుర్తు చేశారు. నిజామాబాద్ నగరం లండన్‌లా అభివృద్ధి చెందిందేమోనని హె లికాప్టర్‌లో నగరంపై చక్కర్లు కొట్టి పరిశీలిస్తే.. వెనుకబడిన ప్రాంతంగా కనిపించిందని అన్నారు. నగరంలో కొనసాగుతున్న పనులు రైల్వేలైను నిర్మాణం మాదిరిగా ఏళ్ల తరబడి సాగుతున్నాయని అన్నారు. నగరంలో కనీసం తాగునీరు, విద్యుత్ వసతులు కూడా పూర్తిస్థాయిలో లేవని గుర్తు చేశారు.
హోరెత్తిన మోదీ నినాదాలు
తమ అభిమాన నేత నరేంద్రమోదీని చూసిన వెంటనే సభకు హాజరైన యువత ఉద్వేగానికి గురయ్యారు. మోదీ.. మోదీ.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోదీ ప్రసంగం కొనసాగుతున్నంత సేపు మోదీ నినాదాలతో సభ ప్రాంగణం దద్దరిల్లింది. మోదీ వేదికపైకి చేరుకోగానే ఒక్కసారి తమ కుర్చీల్లోంచి లేని నిలబడిన యువకులు ప్రధాని ప్రసంగం కొనసాగిన గంట సేపు మోదీ నినాదాలతో హోరెత్తించారు. యువత అభిమానాన్ని గమనించిన ప్రధాని.. ‘‘ మీ అందరి ప్రేమ., ఉత్సాహం చూస్తే ఎంతో సంతోషంగా ఉందని.. అందరికి నమస్కారం..’’ అని పేర్కొన్నారు. తన ప్రసంగాన్ని ప్రశాంతంగా వినాలని సూచించారు.
తరలి వచ్చిన అభిమానులు..
మోదీ సభకు జిల్లా వాసులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వేలాది మంది జనాలతో మైదానమం తా కిక్కిరిసి పోయింది. బైపాస్‌రోడ్డులో చాలా మంది ఉండిపోయారు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి బీజేపీ శ్రేణలు తరలివచ్చారు. నాయకులు, కార్యకర్తలతో సభా ప్రాంగణమంతా సందడిగా మారిం ది. బహిరంగసభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహేర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేమేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. హెలిప్యాడ్ వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అర్వింద్, బస్వలక్ష్మి నర్సయ్య తదితరులు మోదీకి స్వాగతం పలికారు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల్ జిల్లాల పరిధిలోని అన్ని ని యోజకవర్గాల బీజేపీ అభ్యర్థులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment