టార్గెట్ మేయర్
టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి
సెంట్రల్ ఎమ్మెల్యే వద్ద కార్పొరేటర్ల పంచాయితీ
సీఎంను కలిసేందుకు సన్నాహాలు
చిచ్చుపెట్టిన లే అవుట్
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. మేయర్ కోనేరు శ్రీధర్ వైఖరిపై ఆ పార్టీ కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వద్ద పంచాయితీ పెట్టారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. కౌన్సిల్‌లో మేయర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కోటరీలోని కార్పొరేటర్లకు మాత్రమే ఆర్థిక లబ్ధిచేకూరుస్తున్నారన్నది అసమ్మతి కార్పొరేటర్ల ప్రధాన ఆరోపణలు. సెంట్రల్ నియోజక వర్గం కేంద్రంగా రాజుకున్న ఈ అసంతృప్తి అగ్గిని ఆసరాగా తీసుకొని మేయర్ చైర్‌కు ఎసరు పెట్టేందుకు అసమ్మతి వర్గం చురుగ్గా పావులు కదుపుతోందని సమాచారం.
ఏమైందంటే..
కనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్‌కు చెందిన 12.96 ఎకరాల భూమిని నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకొని లే అవుట్ రిలీజ్ చేయాల్సిందిగా సొసైటీ సభ్యులు కోరారు. 1994 నుంచి ఈ ఫైల్ ఉడాలో పెండింగ్ ఉంది. నాటి నిబంధనల ప్రకారం 12.5344 (10శాతం) లే అవుట్ వదలాల్సి ఉండగా 1,088 సంట్లు (8.68శాతం) మాత్రమే వదిలారు. లే అవుట్ స్థలం తక్కువ వదలడంతో ఉడా ఫైల్ పెండింగ్ పెట్టింది. ఉడా రద్దయ్యి సీఆర్‌డీఏ ఏర్పడటంతో ఆ ఫైల్ కార్పొరేషన్‌కు చేరింది. సీఆర్‌డీఏ తాజా నిబంధనల ప్రకారం 14 శాతం లే అవుట్ ఓపెన్‌స్పేస్ వదలాలని తెలుస్తోంది. 8.68 శాతం మాత్రమే స్థలం ఉన్నప్పటికీ లే అవుట్ రిలీజ్‌కు కౌన్సిల్ ఆమోదముద్ర వేయడం వివాదాస్పదమైంది.
హైడ్రామా
ఈ నెల 9న కౌన్సిల్ జరిగింది. దీనిపై ముందురోజు కేశినేని భవన్‌లో కార్పొరేటర్లతో మేయర్ సమావేశం నిర్వహించారు. అందులో ఈ విషయంపై ఎలాంటి చర్చరాలేదు. సాయంత్రం 6 గంటల వరకు ఈ అంశం కౌన్సిల్ వద్దకు రాలేదు. 93 అంశాలపై చర్చించిన మేయర్ పది నిమిషాలు బ్రేక్ ఇస్తున్నా అంటూ బయటకు వెళ్లారు. ఆ తరువాత అదనపు అంశం 108/109గా దీన్ని చేర్చారు. ఇందులో ఏదో తేడా జరుగుతోందని పసిగట్టిన కొందరు టీడీపీ కార్పొరేటర్లు వాయిదా వేయాల్సింగా కోరారు. ఇందులో ఏం తేడా లేదని సర్దిచెప్పి హడావుడిగా ఆమోదించేశారు. 21 సంవత్సరాలు ఉడాలో పెండింగ్‌ఉన్న ఫైల్‌పై ఇరవై నిమిషాలు కూడా చర్చ జరక్కుండా ఆమోదించడం ఏమిటన్నది కొందరు టీడీపీ కార్పొరేటర్ల ప్రశ్న. కోట్ల రూపాయలు చేతులు మారడం వల్లే తీర్మానం చేశారని టీడీపీ కార్పొరేటర్ ఒకరు ‘సాక్షి’ వద్ద ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తిలాపాపం.. తలా పిడికెడు
తిలాపాపం తలా పిడికెడు చందంగా ఇందులో టౌన్‌ప్లానింగ్ అధికారుల పాత్ర ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 14 శాతం లే అవుట్ ఓపెన్ స్పేస్‌కు గాను 8.68 శాతం మాత్రమే సొసైటీ వదలింది. మిగిలిన స్థలం మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.15 కోట్లు ఉంటుందని అంచనా. ఇంత భారీ మొత్తం మినహాయింపు ఇవ్వడం వెనుక అమ్యామ్యాల కథ నడిచినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎన్‌జీవో మాజీ నేత ఒకరు చక్రం తిప్పినట్లు భోగట్టా. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిగితే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద లేఅవుట్ రిలీజ్ వ్యవహారంలో టీడీపీలో చిచ్చుపెట్టింది.
హడావుడిగా తీర్మానం ఎందుకు?
విజయవాడ సెంట్రల్ : ‘కౌన్సిల్‌లో హడావుడిగా తీర్మానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇందులో ఏదో తేడా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కౌన్సిల్‌ను అప్రదిష్టపాలు చేశారు’ అంటూ సెంట్రల్ నియోజక వర్గ టీడీపీ కార్పొరేటర్లు మేయర్ కోనేరు శ్రీధర్‌తో వాదనకు దిగారు.
దీంతో ఆయన అవాక్కయ్యారు. బుధవారం రాత్రి చాంబర్లో మేయర్‌ను కలిసిన పలువురు మహిళా కార్పొరేటర్లు కనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్‌బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ లేఅవుట్ రిలీజ్‌కు సంబంధించి చేసిన తీర్మానంపైప్రశ్నించారు. కౌన్సిల్‌లో ఏం జరుగుతోందో తెలియకుండా తీర్మానం చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని నిలదీశారు. ఈ వ్యవహారంపై తమకు అవగాహన లేదని, ఆఖరి నిమిషంలో పెట్టి తీర్మానం చేశారని పేర్కొన్నారు. దీనివల్ల పార్టీ ప్రతిష్టదెబ్బతిందని, వెంటనే తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము అధిష్టానం వద్దే తేల్చుకుంటామని అల్టిమేటం ఇచ్చారు. మేయర్ వర్గానికి చెందిన కొందరు కార్పొరేటర్లు సర్దిచెప్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చాంబర్లో పెద్దగా అరుపులు వినిపించడంతో అక్కడున్న సిబ్బంది విస్మయం వ్యక్తంచేశారు.