ముథోల్‌కు చెందిన అసంతృప్త నేతలతో చర్చిస్తున్న ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎన్నికల్లో టికెట్టు ఆశించి భంగపడ్డ టీఆర్‌ఎస్ నేతలను బుజ్జగించే కార్యక్రమం ఊపందుకొంది. టీఆర్‌ఎస్‌లో కీలకనేత, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు నియోజకవర్గాల వారీగా అసంతృప్తి నాయకులను పిలిపించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా గులాబీ శ్రేణులు పనిచేయాలని చెబుతూ అసంతృప్తి వాదులను బుజ్జగిస్తున్నారు. కలిసి పనిచేయలేకపోయినా... వ్యతిరేక శిబిరంలోకి వెళ్లకుండా ముందు చూపుతో కేటీఆర్ చేస్తున్న సయోధ్య పర్వం ఎంత మేర సఫలమవుతుందో చూడాల్సిందే.
మంత్రి ఐకే రెడ్డితో శ్రీహరిరావు రాజీ
గత ఎన్నికల్లో నిర్మల్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన శ్రీహరిరావుకు ఈసారి ఎన్నికల్లో చుక్కెదురైంది. బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి శ్రీహరిరావుపై గెలిచిన అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి తరువాత టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు. ఈ నాలుగేళ్లలో శ్రీహరిరావు దాదాపుగా కనుమరుగయ్యారు. పార్టీ కార్యకలాపాల్లో గానీ, అధికార కార్యకలాపాల్లో గానీ నిర్మల్‌లో ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యత లభించలేదు. ఈ పరిస్థితుల్లో ఐకే రెడ్డికి అధికారికంగా టీఆర్‌ఎస్ టికెట్టు రావడంతో శ్రీహరిరావు జీర్ణించుకోలేకపోయారు. తన వర్గీయులతో సమావేశమై అసంతృప్తిని వ్యక్తపరిచారు. నిర్మల్‌లో కాంగ్రెస్‌తో తీవ్ర పోటీ నెలకొని ఉన్న నేపథ్యంలో శ్రీహరిరావు వల్ల జరిగే నష్టాన్ని ఊహించిన మంత్రి ఐకే రెడ్డి చొరవ తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ ద్వారా శ్రీహరిరావును సోమవారం ప్రగతిభవన్‌కు పిలిపించి మాట్లాడారు. ఐకేరెడ్డితో సయోధ్య కుదిర్చి కలిసి పనిచేయాలని, టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని సూచించారు. దీంతో ఇప్పటివరకున్న అసంతృప్తి టెన్షన్ పోయిందని నిర్మల్‌లో అధికార పార్టీ నేతలు ఉన్నారు.
బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవితో కేటీఆర్
బెల్లంపల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య తీరు పట్ల, టీఆర్‌ఎస్ పార్టీ వైఖరి పట్ల మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఇటీవల మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళుతుందన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీదేవిని ప్రగతిభవన్‌కు పిలిపించిన మంత్రి కేటీఆర్ పలు విషయాలు మాట్లాడినట్లు తెలిసింది. చిన్నయ్యను గెలిపించాలని, వచ్చే ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఆయన సూచించారని సమాచారం. బెల్లంపల్లిలో నెలకొన్న పరిస్థితులను శ్రీదేవి మంత్రి కేటీఆర్‌కు వివరించినట్లు సమాచారం. అయితే చిన్నయ్యతో కలిసి పనిచేసేది మాత్రం అనుమానమేనని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
చెన్నూర్‌లో ఓదెలుతో సయోధ్య... ‘రాజీ’ కాని రాజిరెడ్డి
105 మంది టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించిన రోజు తన పేరు గల్లంతవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చెన్నూర్ సిట్టింగ్ నేత నల్లాల ఓదెలును వినాయక చవితి రోజు ఇంటికి పిలిపించి కేసీఆర్ మాట్లాడి సర్ది చెప్పారు. ఇటీవల ఒకట్రెండు సమావేశాల్లో సుమన్‌తో కలిసి ఓదెలు పాల్గొన్నారు. ఇదే చెన్నూర్‌లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి అలిగారు. ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లడం దాదాపుగా ఖరారైంది. ఈ నేపథ్యంలో రాజిరెడ్డిని ఇటీవల సుమన్ హైదరాబాద్‌కు తీసుకెళ్లి, టీఆర్‌ఎస్ భవన్‌లో కేటీఆర్‌తో కలిపించారు. టీఆర్‌ఎస్‌లో చేరిక కార్యక్రమంలో ఆయనను వేదికపైనే కూర్చోబెట్టారు. ఆ ఫొటోలను చెన్నూర్‌లో వైరల్ చేయించారు. అయితే తాను ‘రాజీ’పడలేదని, త్వరలోనే తన సత్తా చూపిస్తానని రాజిరెడ్డి ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడుతూ చెప్పారు.
ముధోల్‌లో మాజీ జెడ్పీ చైర్మన్‌కు బుజ్జగింత
ముథోల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి విఠల్‌రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పిన జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ జుట్టు అశోక్‌తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. విఠల్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని సూచించారు. విఠల్‌రెడ్డి గెలిస్తే పార్టీలో, ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఆయన వివరించినట్లు సమాచారం. కాగా ఈ నియోజకవర్గంలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి వర్గం కొంత అసంతృప్తితో ఉంది. త్వరలో చారితో కూడా మంత్రి మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ఇతర నియోజకవర్గాల్లో సైతం అసంతృప్తిని చల్లార్చేందుకు మంత్రి నాయకులతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment