టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు రెబెల్స్ బెడద తప్పేలా లేదు. జిల్లాలోని ఆయా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన తర్వాత అసమ్మతి జ్వాలలు భగ్గున మండాయి. తమకే టికెట్ వస్తుందని ఆశించిన వారికి భంగపాటు ఎదురవడంతో అభ్యర్థిని వ్యతిరేకిస్తూ బహిరంగ ప్రకటనలు కూడా చేశారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. అధిష్టానం కొందరిని బుజ్జగించినా మరికొందరు ససేమిరా
అంటున్నారు. అలాంటి వారు ఇప్పుడు ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. మిర్యాలగూడ, నల్లగొండలో ఈ పరిస్థితి
ఎదురవుతోంది.
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో టీఆర్‌ఎస్ రాజకీయం నెల రోజులుగా రోజుకో రకంగా మారుతూ వస్తోంది. పార్టీలో ముందునుంచీ పనిచేసిన వారు టికెట్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నెల రోజుల కిందట ఆ పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల్లో తమ పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన సదరు నేతలు అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా అసమ్మతి కుంపటి రాజేశారు. అభ్యర్థులను మార్చాలని, ఏళ్లకు ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అసమ్మతి కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు అధినాయకత్వం భగీరథ ప్రయత్నమే చేసింది.
వీరిలో కొందరు దారికి వచ్చినా, మరికొందరు మాత్రం ససేమిరా అంటున్నారు. జిల్లా కేంద్రంలో 4వ తేదీన జరిగిన ఉమ్మడి జిల్లా ప్రజా ఆశీర్వాద సభ వరకు ఓపిక పట్టిన అసమ్మతి నాయకులు ఒక్కొక్కరు ఇప్పుడు తమ అభిమతాన్ని బయట పెడుతున్నారు. ఇక, అధిష్టానం దిగివచ్చి అభ్యర్థులను మార్చే అవకాశాలు దాదాపుగా లేకపోవడంతో, చేసేది లేక తామే బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అసంతృప్త నేతలు కొందరు ఇప్పటికే తాము ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని ప్రకటించారు. రెబల్స్ బెడద ఇప్పటికిప్పుడు టీఆర్‌ఎస్‌లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అభ్యర్థుల ప్రకటన
తర్వాత కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి తలెత్తే అవకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు
రెబల్ గులాబీలు..
ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఇప్పటికే పది చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. నాగార్జునసాగర్, మునుగోడు, మిర్యాలగూడ, నల్లగొండ, తుంగతుర్తి నియోజకవర్గాల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు, అసమ్మతి సమావేశాలు జరిపారు. వీరిలో కొందరు అగ్రనాయకత్వం పిలిపించి మాట్లాడడంతో తమ రాజకీయ భవిష్యత్ కోసం రాజీపడిపోయారు. మరికొందరు మాత్రం ససేమిరా అంటూ ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
మిర్యాలగూడలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇక్కడి సిట్టింగ్ భాస్కర్‌రావు కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. అధినాయకత్వం చివరకు ఆయనకే టికెట్ ఖాయం చేసింది. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అలుగుబెల్లి తానే స్వయంగా పోటీలో ఉంటానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నాయకత్వం పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేసినా అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ప్రస్తుతం ఆయన టీఆర్‌ఎస్ అభ్యర్థి భాస్కర్‌రావుకు దీటుగా నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు.
నల్లగొండ నియోజకవర్గంలోనూ ఇదే పరి స్థితి ఉంది. మాజీ ఇన్‌చార్జి చకిలం అనిల్‌కుమార్ రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి వచ్చారు. అయినా, తన నిర్ణయంలో మార్పు లేదంటున్న ఆయన ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన ఆ మాటకే కట్టుబడి నియోజకవర్గాన్ని చుట్టి వస్తున్నారు. మరో అసమ్మతి నేత, తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు తండు సైదులు గౌడ్ ఇన్ని రోజులు ఎదురు చూసి ఆదివారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. తన అనుయాయులతో సమావేశమై ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇప్పుడు నల్లగొండ టీఆర్‌ఎస్‌లో ఇద్దరు రెబల్స్ ఉన్నట్టు లెక్క.
హుజూర్‌నగర్ నియోజకవర్గ నాయకుడు సామల శివారెడ్డి సైతం తాను ఇండిపెండెంటుగా బరిలో ఉంటానని ప్రకటించారు. కాకుంటే ఆయన ఎలాంటి ప్రచారం, ఇతర కార్యక్రమాలేవీ చేపట్టడం లేదు. మరో వైపు పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో జెడ్పీ చైర్మన్ బాలూనాయక్ కాంగ్రెస్‌లో చేరారు. నల్లగొండలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కాంగ్రెస్‌కూ రెబల్స్ ముప్పు
అభ్యర్థులు ప్రకటించిన టీఆర్‌ఎస్‌లో మాత్రమే రెబల్స్ ఉన్నట్లు కనిపిస్తున్నా.. త్వరలో అభ్యర్థులు ఖరారు కానున్న కాంగ్రెస్‌కూ రెబల్స్ బెడద తప్పేలా లేదని అంచనా వేస్తున్నారు. మునుగోడు టికెట్ ఆశిస్తున్న శాసన మండలి సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ఎన్నికల కమిటీల నియామకాలపై నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీగా మరో మూడేళ్లకుపైగానే పదవీ కాలం ఉన్నందున ఆయనకు టికెట్ నిరాకరిస్తే ఇండిపెండెంటుగానైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అనుచరగణం పేర్కొంటోంది. మునుగోడును పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించినా, తనకు కాకుండా మరో అభ్యర్థికి ప్రకటించినా రాజగోపాల్‌రెడ్డి రెబల్‌గా బరిలోకి దాదాపు ఖాయమని పేర్కొంటున్నారు. టికెట్లు ప్రకటించాక గానీ కాంగ్రెస్‌కు ఏయే నియోజకవర్గాల్లో ఈ బెడద ఉంటుందో చెప్పలేమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment