
సమ్మె విరమణపై జువెలర్స్ లో భిన్నస్వరాలు
♦ స్థానిక అసోసియేషన్స్ నుంచి వ్యతిరేకత
♦ చాలా ప్రాంతాల్లో కొనసాగుతోన్న సమ్మె
న్యూఢిల్లీ/ముంబై: సమ్మె విరమణ ప్రక్రియపై జువెలర్స్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వపు హామీతో ఒక శాతం ఎక్సైజ్ సుంకం విధింపును వ్యతిరేకిస్తూ జువెలర్స్ చేపట్టిన నిరవధిక సమ్మెను విరమించాలని శనివారం ఆల్ ఇండియా అండ్ జువెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజే ఎఫ్), ఆల్ ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ), జెమ్స్ జువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ చర్యను ఢిల్లీ-ఎన్‌సీఆర్, రాజ స్తాన్, ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోని కొన్ని స్థానిక అసోసియేషన్స్ వ్యతిరేకిస్తున్నాయి. ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురీంధర్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తన చర్యను వెనక్కు తీసుకునేంతవరకు దేశ రాజధానిలో సమ్మె కొనసాగిస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 40 శాతం షాపుల్లో మాత్రమే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, మిగిలినవి సమ్మెలోనే ఉన్నాయని జీజేఎఫ్ మాజీ ప్రెసిడెంట్ బచ్‌రాజ్ బమల్వా తెలిపారు.
జువెలర్స్ డిమాండ్స్ పరిశీలనకు కమిటీ
న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం విధింపును నిరసిస్తూ సమ్మె చేస్తోన్న జువెలర్స్ డిమాండ్స్ పరిశీలన కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అశోక్ లహ్రి అధ్యక్షత వహిస్తారు. ఇది 60 రోజుల్లో తన నివేదికను కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. ఎక్సైజ్ సుంకం వర్తింపు సహా రికార్డుల నిర్వహణ వంటి తదితర సంబంధిత అంశాలను ఈ కమిటీ పరిశీలించనున్నది. అన్ని జువెలరీ అసోసియేషన్స్ వాటి సమస్యలను కమిటీకి విన్నవించుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.