రాష్ట్ర శాసనసభ రద్దుతో పాటు ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. జహీరాబాద్ మినహా జిల్లాలోని మిగతా నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. పేర్లను ఖరారు చేసి పది రోజులు కావస్తున్నా పార్టీ నేతల్లో నెలకొన్న అసమ్మతి పర్వానికి తెరపడడం లేదు. టికెట్లు ఆశించి భంగపడిన నేతలు, అభ్యర్థులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకులు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. అసమ్మతిని చల్లార్చేందుకు ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పటాన్‌చెరు, నారాయణఖేడ్‌లో అసమ్మతి స్వరం తీవ్ర స్థాయిలో ఉండడంతో ప్రత్యేక దృష్టి సారించారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా నుంచి రాష్ట్ర శాసనభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈ నెల 7న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. జహీరాబాద్ స్థానంలో అభ్యర్థి పేరును ఖరారు చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. అందోలు నియోజకవర్గంలో తాజా, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ను తప్పించి, ఆయన స్థానంలో పాత్రికేయుడు క్రాంతి కిరణ్‌కు అవకాశం ఇచ్చారు. జిల్లాలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించి పది రోజులు కావస్తున్నా, అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అసమ్మతి నేతలు స్వరం విప్పారు.
పటాన్‌చెరు, నారాయణఖేడ్, సంగారెడ్డి, నర్సాపూర్‌లో పార్టీ ప్రకటించిన అభ్యర్థులను మార్చాలంటూ సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు వినిపించాయి. ఉద్యమ సమయంలో పదవీ త్యాగం చేసిన తనకు టికెట్ ఎందుకు ఇవ్వరంటూ సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ప్రెస్‌మీట్ నిర్వహించి తన ఆవేదన వెల్లగక్కారు. పటాన్‌చెరులో సపాన్‌దేవ్, గాలి అనిల్ కుమార్, కొలను బాల్‌రెడ్డి, జె.రాములు తదితర నేతలు ఉమ్మడి ప్రెస్‌మీట్‌లో అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. నారాయణఖేడ్‌లో పార్టీ అభ్యర్థి భూపాల్‌రెడ్డిని మార్చాలంటూ అసమ్మతి నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నర్సాపూర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యేకు సహకరించేది లేదని హత్నూర జెడ్పీటీసీ సభ్యులు జయశ్రీ తదితరులు తెగేసి చెప్పారు.
అసమ్మతి వర్గంతో మంతనాలు..
పార్టీలో నెలకొన్న అసమ్మతిని అభ్యర్థులే పరిష్కరించుకోవాలని టీఆర్‌ఎస్ అధిష్టానం నుంచిసంకేతాలు అందాయి. అసమ్మతికి దారితీస్తున్న కారణాలను విశ్లేషించుకుని పనితీరు మార్చుకోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 8న హైదరాబాద్‌లో జరిగిన పార్టీ అభ్యర్థుల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పార్టీ వైఖరిని స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్టీ సంకేతాలను సీరియస్‌గా తీసుకున్న సంగారెడ్డి, పటాన్‌చెరు, అందోలు అభ్యర్థులు అసంతృప్తి నేతలతో వరుసగా మంతనాలు జరుపుతున్నారు. నేరుగా వారికి ఇళ్లకు వెళ్లి ఎన్నికల్లో మద్దతు పలకాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. నారాయణఖేడ్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులుగా మరోమారు అవకాశం దక్కించుకున్న తాజా మాజీ ఎమ్మెల్యేలు మాత్రం అసమ్మతి నేతలతో దూరం పాటిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో రోజురోజుకూ విభేదాలు మరింత తీవ్రం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
అసమ్మతి నేతలతో హరీశ్ భేటీ..
పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో అసమ్మతి స్వరం బలంగా వినిపిస్తున్న నేతలతో మంత్రి హరీశ్‌రావు మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని తన నివాసంలో భేటీ అయ్యారు. సపాన్‌దేవ్, అనిల్‌కుమార్, బాల్‌రెడ్డి, జయరాములుతో పాటు కొందరు తాజామాజీ సర్పంచ్‌లు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. పార్టీకి నష్టం కలిగించే రీతిలో తొందరపాటు చర్యలకు పూనుకోవద్దని హరీశ్ అసమ్మతి నేతలకు సర్ది చెప్పినట్లు సమాచారం. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు సమయం తీసుకుంటానని హామీ ఇవ్వడంతో బుధవారం వరకు వేచి చూడాలని అసమ్మతి స్వరం వినిపిస్తున్న నేతలు నిర్ణయించుకున్నారు.
సంగారెడ్డిలో అసమ్మతి నేతలతో సఖ్యత కోసం పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ సొంత ప్రయత్నాలు చేస్తుండగా, ఒకరిద్దరు నేతలతో త్వరలో హరీశ్ భేటీ కానున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో అసమ్మతి నేతలతో సంప్రదింపుల బాధ్యతను పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్‌కు అప్పగించారు. ఇప్పటికే ఒక దఫా అసమ్మతి నేతలతో హరీశ్ సమావేశం కాగా, మరోసారి పూర్తి స్థాయిలో భేటీ జరపాలని నిర్ణయించారు. జిల్లాలోని అసమ్మతి నేతల జాబితాపై ఇప్పటికే స్పష్టత వచ్చిందని, వారం రోజుల్లో పార్టీలో అసమ్మతి, అసంతృప్తి సమసిపోతుందని భేటీల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న నేత ఒకరు వ్యాఖ్యానించారు. పటాన్‌చెరు, నర్సాపూర్‌కు చెందిన ఇద్దరు అసమ్మతి నేతలు మాత్రం టికెట్ దక్కకుంటే వేరే పార్టీలోకి వెళ్తామంటూ సంకేతాలు ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment