సంగారెడ్డి శివారులో కేసీఆర్ బహిరంగ సభ స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ చంద్రశేఖర్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్న టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభల షెడ్యూలును గురువారం విడుదల చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఈ నెల 28న ఒకేరోజు ఆరు బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేశారు. నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు, నర్సాపూర్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే టీఆర్‌ఎస్ బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూలు విడుదల కావడంతో పార్టీ అభ్యర్థులు సభాస్థలి ఎంపిక, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించారు.
సంగారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ముంబై హైవేపై ఉన్న ఓ ఖాళీ ప్రదేశాన్ని టీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ బోడకుంట వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. నారాయణఖేడ్ పట్టణ శివారులోని బాణాపూర్ ప్రాంతంలో ఉన్న స్థలాన్ని పార్టీ అభ్యర్థి ఎం.భూపాల్ రెడ్డి పరిశీలించారు. జోగిపేట పట్టణ శివారులోని డాకూరు రోడ్డులో సభ నిర్వహించాలని టీఆర్‌ఎస్ నేతలు ప్రాథమికంగా నిర్ణయించారు.
జహీరాబాద్‌లో ఇటీవల మంత్రి హరీశ్‌రావు పాల్గొన్న సభా ప్రాంగణంలోనే కేసీఆర్ పాల్గొనే సభను నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 28న సంగారెడ్డి జిల్లా పరి«ధిలో నాలుగు, మెదక్ జిల్లా పరిధిలో నర్సాపూర్‌తో పాటు తాను పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోనూ జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. ఇప్పటికే కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో హుస్నాబాద్, సిద్దిపేట, మెదక్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment