సాక్షి, బెంగళూరు: కేబినెట్ విస్తరణ అనంతరం బీజేపీ ఎమ్మెల్యేల్లో అసమ్మతి రేగిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో వరుసగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదట మంత్రి జగదీశ్ శెట్టర్ నివాసంలో సమావేశమయ్యారు. అదేవిధంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో మరో 25 మంది రెండు రోజుల క్రితం అర్ధరాత్రి వరకు భేటీ అయి చర్చించారు. గత మంగళవారం అర్ధరాత్రి సుమారు 25 మంది బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ అయ్యారు.
పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శితో కలిసి భేటీ కావడం కర్ణాటక రాజకీయాల్లో కుతూహలం రేపుతోంది. ఒక్కో ఎమ్మెల్యే ప్రత్యేకంగా భేటీ అయి రాజకీయ పరిణామాల గురించి చర్చించినట్లు తెలిసింది. ప్రతి ఎమ్మెల్యేతో నాలుగైదు ని మిషాల పాటు బీఎల్ సంతోష్ మాట్లాడారు. ఈక్రమంలో అర్ధరాత్రి 1.30 గంటల వరకు చర్చ కొనసాగింది. అయితే పాలనపై వ్యతిరేకమా? లేక మంత్రివర్గంలో చోటు దక్కలేదనే అసమ్మతి వ్యక్తం చేశారా? అనే విషయాలు స్పష్టంగా తెలియరాలేదు. కానీ రాజకీయ పరిణామాల గురించి చర్చించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
పార్టీలో జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషిస్తున్న బీఎల్ సంతోష్ రెండు రోజుల క్రితం ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చారు. ఈక్రమంలో మంత్రివర్గంలో చోటు దక్కని ఎమ్మెల్యేలు అసమ్మతి వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో సీఎంగా యడియూరప్ప ఉన్నప్పుడు కూడా జగదీశ్ శెట్టర్ సమక్షంలో అసమ్మతి లేచిన సంగతి తెలిసిందే. యడియూరప్ప పదవీచ్యుతుడు కాగా జగదీశ్ శెట్టర్ అప్పట్లో సీఎం అయ్యారు. అయితే ప్రస్తుతం యడియూరప్ప మంత్రివర్గంలో జగదీశ్ శెట్టర్ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆధ్వర్యంలో అసమ్మతి నేతలు భేటీ కావడం చర్చనీయంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment