టీఆర్‌ఎస్ అభ్యర్థులపై ఆశావహుల నిరసన కొనసాగుతూనే ఉంది. తమకు టికెట్ దక్కుతుందని ఆశించిన నేతలకు భంగపాటు కలగడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిని అధిష్టానం సముదాయించే యత్నం చేసినా ఫలితం కనిపించడం లేదు. ఈనేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో అసమ్మతి నేతలు కూటమిగా ఏర్పాటు కావడంతో ఆందోళన చెందుతున్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అసమ్మతి నేతలు దారికి రావడం లేదు. అభ్యర్థుల ఖరారుతో అలకబూనిన ఆశావహులు.. అధిష్టానంపై నిరసన స్వరం వినిపిస్తూనే ఉన్నారు. ఒకట్రెండు చోట్ల ఒకరిద్దరు మెత్తబడినా.. చాలామంది ఇంకా శాంతించకపోవడంతో గులాబీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. టికెట్ ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించే బాధ్యతను ఎంపీ/మంత్రులకు అప్పగించినా చిటపటలు ఆగడం లేదు. ఆఖరికి ప్రగతి భవన్‌లో మంత్రాంగం నెరిపినా ఫలితం లేకపోవడంతో హైకమాండ్‌కు ఏమీ పాలుపోవడం లేదు. దీంతో అసంతృప్తనేతలతో చర్చలకు ఫుల్‌స్టాప్ పెట్టి ప్రచారపర్వంలో నిమగ్నం కావాలని టీఆర్‌ఎస్ నాయకత్వం అభ్యర్థులకు సూచించింది. అయితే, ఆశావహులు కంట్లో నలుసులా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది. దీనికితోడు పార్టీ శ్రేణుల్లోనూ గందరగోళం ఏర్పడుతోంది. పలు నియోజకవర్గాల్లో గ్రూపులుగా చీలిపోవడంతో పార్టీలో సమన్వయం సాధించడం ద్వితీయ శ్రేణి నాయకులకు తలకు మించిన భారంగా మారుతోంది.
రాజీనామాస్త్రంతో పరిష్కారం
చేవెళ్లలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంకు టికెట్ దక్కకపోవడంతో టీఆర్‌ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి ఆయన.. ఏకంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పార్టీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సొంత పార్టీలో వైరివర్గం లేకుండా పోయింది. రత్నం మాత్రం పార్టీని వీడడమేగాకుండా.. తనతోపాటు భారీ అనుచరగణాన్ని తనతోపాటు తీసుకెళ్లారు. ఇది పార్టీ గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు.
అసమ్మతి కూటమి
షాద్‌నగర్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అభ్యర్థిత్వం ఖరారు కావడమే తరువాయి.. గులాబీదళంలో ముసలం పుట్టింది. టికెట్ ఆశించిన నేతలంతా ఒకతాటి మీదకు వచ్చి అంజయ్యకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేశారు. వీర్లపల్లి శంకర్, అందె బాబయ్య నిరసనగళం వినిపించడమేగాకుండా.. ఆయనను వ్యతిరేకిస్తున్న వారితో జట్టు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. పనిలోపనిగా కాంగ్రెస్‌లో ఉన్న లుకలుకలను కూడా అదనుగా మలుచుకొని అసమ్మతి కూటమిగా బరిలో దిగేందుకు ఎత్తుగడ వేస్తున్నారు. పార్టీలో నెలకొన్న అసమ్మతిని చల్లార్చేందుకు ఎంపీ జితేందర్‌రెడ్డి, మంత్రి లక్ష్మారెడ్డి నేరుగా రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. ఆఖరికి మంత్రి కేటీఆర్ కూడా అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారితో మాట్లాడినా మెత్తబడకపోవడం గమనార్హం.
చాపకింద నీరులా..
ఇబ్రహీంపట్నంలోనూ అసమ్మతి రాజకీయాలకు తెరపడలేదు. తాజా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని సొంతపార్టీలోని వైరివర్గం వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కంచర్ల చంద్రశేఖరరెడ్డి పార్టీ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనతోపాటు ఎంపీపీ నిరంజన్‌రెడ్డి, సీనియర్ నేత శేఖర్‌గౌడ్ కూడా మంచిరెడ్డికి టికెట్ ఇవ్వడంపై తాడోపేడో తేల్చుకోవడానికి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. అవసరమైతే స్వతంత్రంగా బరిలో దిగాలని కంచర్లపై ఆయన అనుచరగణం ఒత్తిడి తెస్తోంది.
మేడ్చల్‌లోను అదే సీనూ..
మేడ్చల్, ఉప్పల్‌లోనూ అసమ్మతి రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని పక్కనపెట్టిన అధిష్టానం.. ఎంపీ మల్లారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో మేడ్చల్ టికెట్ ఆశించిన హరివర్ధన్‌రెడ్డి, నక్కా ప్రభాకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కినుక వహించారు. అలాగే ఉప్పల్‌లో బేతి సుభాష్‌రెడ్డి అభ్యరిత్వంపై కార్పొరేటర్లు నిరసనగళం వినిపిస్తున్నారు. మరోవైపు రాజేంద్రనగర్‌లో తోకల శ్రీశైలం రెడ్డి, మహేశ్వరంలో కొత్త మనోహర్‌రెడ్డి, శేరిలింగంపల్లిలో సాయిబాబా, రాగం నాగేందర్, శంకర్‌గౌడ్ కూడా చిటపటలాడుతునే ఉన్నారు. ఎల్‌బీనగర్‌లో రామ్మోహన్‌గౌడ్‌కు వ్యతిరేకంగా కార్పొరేటర్లంతా తిరుగుబావుటా ఎగురవేశారు. ఈనేపథ్యంలో అసమ్మతినేతలను శాంతింపజేయడం అభ్యర్థులతో పాటు అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
కింకర్తవ్యం..
కల్వకుర్తిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు ఇంటి సెగ తాకుతునే ఉంది. నాలుగు గ్రూపులుగా వీడిపోయిన ఆశావహులతో మంతనాలు జరిపిన మంత్రి కేటీఆర్.. దాదాపుగా అందరినీ శాంతింపజేశారు. అభ్యర్థి గెలుపే ధ్యేయంగా సర్దుకుపోవాలని హితోపదేశం చేశారు. స్థానిక నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించే బాధ్యతను మంత్రి జూపల్లి కృష్ణారావుకు అప్పగించారు. అయితే, మంత్రి పర్యటనలో మాత్రం ఐక్యతారాగం వినిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం అసమ్మతిని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాత్రం జైపాల్ యాదవ్ అభ్యర్థిత్వంతో కినుక వహించారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. 2014 ఎన్నికల్లో అటు జైపాల్‌యాదవ్‌ను.. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని వ్యతిరేకించిన నేతలంతా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన కసిరెడ్డికి మద్దతుగా నిలిచారు.
అనంతరం జరిగిన సమీకరణల నేపథ్యంలో ఆయన టీఆర్‌ఎస్ కండువా కప్పుకోవడం.. ఎమ్మెల్సీగా గెలుపొందడం చకచకా జరిగిపోయాయి. అయితే, తాజా పరిణామాలతో కసిరెడ్డి వర్గీయులు సందిగ్ధంలో పడిపోయారు. జైపాల్‌కు మద్దతుగా ప్రచారం చేసేది లేదని, ‘మీరు ప్రచారం చేసినా పార్టీని వీడుతాం’ అంటూ అల్టిమేటం జారీ చేస్తుండడం కసిరెడ్డిని ఆత్మరక్షణలో పడేసింది. ‘మా మాట వినకుంటే మీ దారి మీది.. మా దారి మాది’ అని తేల్చిచెబుతుండడంతో కష్టకాలంలో వెన్నంటి నిలిచిన అనుచరులను బుజ్జగించలేక సతమతమవుతున్నారు ఆయన. అవసరమైతే ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని ఒత్తిడి చేస్తున్నారు. దీనిపై కసిరెడ్డి అంతరం గం ఏమిటో మరికొన్ని రోజుల్లో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment