అలకవీడిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి | Kichannagari Laxma Reddy MLA MLA Ticket Issues Rangareddy | Sakshi
Sakshi News home page

అలకవీడిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

Published Sat, Oct 6 2018 2:11 PM | Last Updated on Sat, Oct 6 2018 2:11 PM

Kichannagari Laxma Reddy MLA MLA Ticket Issues Rangareddy - Sakshi

మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్‌ ముఖ్య నేత, మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అలకవీడారా..? పార్టీ అనుమానపు చూపులను తట్టుకోలేక ఒకానొక దశలో పోటీకి దూరంగా ఉండేందుకు సిద్ధమైన ఆయన మళ్లీ మనసు మార్చుకున్నారా? టీపీసీసీ ముఖ్య నేతలు కేఎల్లార్‌తో చర్చలు జరిపి ఆయన జారిపోకుండా జాగ్రత్త పడ్డారా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్న కేఎల్లార్‌ ఈనెల 4న జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార శంఖారావం కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. అయితే, అసలు కేఎల్లార్‌ ఎందుకు అలిగారు.. పార్టీ నాయకత్వానికి, కేఎల్లార్‌కు పొరపొచ్చాలు వచ్చాయా? మేడ్చల్‌ అసెంబ్లీ టికెట్‌ కాంగ్రెస్‌ ఇవ్వనందా.. టీఆర్‌ఎస్‌ ఇస్తానందా? అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.
  
సీటు కోసం కుట్ర జరిగిందా? 
వాస్తవానికి, మేడ్చల్‌ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీపడేవారిలో కేఎల్లార్‌ పేరు మొదటి వరుసలో ఉంటుంది. మాజీ ఎమ్మెల్యేగా, నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఆయన పేరును పరిశీలించిన తర్వాతే ఇతరుల పేర్ల జోలికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఆ సీటు కేఎల్లార్‌కు రాకుండా పీసీసీ ముఖ్యులతో కలిసి కొందరు స్థానిక నేతలు కుట్రపన్నారని కేఎల్లార్‌ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

అందులో భాగంగానే కేఎల్లార్‌ను పార్టీకి దూరం చేసే ప్రయత్నాలు చేశారని, అక్కడ టీఆర్‌ఎస్‌ నేతలను కలిశారు.. ఇక్కడ కలిశారంటూ ప్రచారం చేశారని చెబుతున్నారు. అయితే, కేఎల్లార్‌ మాత్రం గుంభనంగానే ఉన్నారని, ఎన్నికల్లో పోటీచేసేందుకు కూడా వెనక్కు తగ్గారని తెలుస్తోంది. పార్టీ అనుమానపు చూపులు తనను కలిచి వేస్తున్నాయని, ఒక్క సీటు కోసం తన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కన్నా అవసరమైతే ఎన్నికలకు దూరంగా ఉందామని కేఎల్లార్‌ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించడం జిల్లా పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం కూడా అయింది. 

ఎట్టకేలకు సుఖాంతం 
కేఎల్లార్‌ వ్యవహారాన్ని కొంతకాలం పాటు గమనించిన కాంగ్రెస్‌ అధిష్టానం అసలు విషయాన్ని గమనించి చర్చలకు ఉపక్రమించడంతో ఎట్టకేలకు కథ సుఖాంతమయిందని తెలుస్తోంది. పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క కేఎల్లార్‌తో చర్చలు జరిపి, ఆయనకు మేడ్చల్‌ టికెట్‌పై గట్టి హామీ ఇప్పించారని, దీంతో శాంతించిన ఆయన  గద్వాల ఎన్నికల ప్రచారానికి వెళ్లారనే చర్చ జిల్లా కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది. 

అగ్నికి ఆజ్యం పోసిన టీఆర్‌ఎస్‌

పార్టీలో అంతర్గత పరిస్థితులు ఇలా ఉంటే.. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మేడ్చల్‌ అసెంబ్లీ స్థానానికి ఎవరినీ అభ్యర్థిగా ప్రకటించకపోవడం అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. కేఎల్లార్‌ టీఆర్‌ఎస్‌లోకి వెళ్తారని, ఆయనకు టికెట్‌ ఇచ్చేందుకే సుధీర్‌రెడ్డిని పక్కనపెట్టారని ఆయన వ్యతిరేకులు ప్రచారం చేసేందుకు అస్త్రం లభించినట్టయింది. కాంగ్రెస్‌ పార్టీలో కేఎల్లార్‌ అసంతృప్తిగా ఉన్నారనే సమాచారంతో టీఆర్‌ఎస్‌ కూడా ఆయన్ను బుట్టలోకి వేసుకునే ప్రయత్నాలు చేసింది. ఈ విషయాలన్నీ ప్రసార మాధ్యమాల్లో వార్తలుగా మారడంతో ఆయన ఓ దశలో అసహనానికి, ఆవేదనకు గురికావాల్సి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement