TRS leaders kcr
-
‘ఢీ’సెంబర్ 7
సమయం ఖరారైంది.. ఇక, సమరానికి తెర లేవనుంది.. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో జిల్లాలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఇప్పటికే ప్రచార హోరుతో రాజకీయం రంజుగా మారిన నేపథ్యంలో సీఈసీ ప్రకటన మరింత వేడిని పెంచింది. ప్రధాన పార్టీలన్నీ మరింత వేగంగా కదన రంగంలో దూసుకెళ్లేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ‘ప్రత్యేక’ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై నేపథ్యంలో జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారనుంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై నిన్న మొన్నటి వరకు రకరకాల ఊహాగానాలు రావడంతో అయోమయం నెలకొంది. మరోవైపు, కోర్టు కేసుల నేపథ్యంలో ఏం జరుగుతుందని ఉత్కంఠ కొనసాగింది. అయితే, రాష్ట్రంలో డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించడంతో ఉత్కంఠకు తెర పడింది. సీఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో ప్రస్తుతం అంతటా ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలై 19 వరకు కొనసాగనుంది. 20న నామినేషన్ల పరిశీలన, 22న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అనంతరం డిసెంబంర్ 7న ఎన్నికలు జరుగనున్నాయి. 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొదలైన సన్నాహాలు.. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాల్లో ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయి. ఓటర్ల జాబితాపై హైకోర్టులో విచారణ నేపథ్యంలో ఏర్పడిన అనుమానాలను పటాపంచలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా, వారు క్షేత్ర స్థాయిలో ప్రచారం ప్రారంభించారు. మిగతా పార్టీలు అభ్యర్థులను త్వరగా ప్రకటించి, ప్రచారంలో దూసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల 12న విడుదల కానుండడంతో నెల రోజుల కాలంలో అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించడానికి అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రచారంలో భాగంగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం మరింత వేడెక్కనుంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన నేతలు ‘అన్ని రకాల’ ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. వేడెక్కిన రాజకీయం.. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. కామారెడ్డి నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎల్లారెడ్డిలో ఏనుగు రవీందర్‌రెడ్డి, బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జుక్కల్‌లో హన్మంత్ సింధే ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయడానికి సన్నద్ధమైన నేపథ్యంలో సీట్ల పంపకాలు ఇంకా పూర్తి కాలేదు. దీంతో అభ్యర్థుల ఎంపికపై సందిగ్ధం నెలకొంది. కామారెడ్డిలో ప్రచార హోరు.. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ పేరు దాదాపు ఖరారైనట్లే. దీంతో ఆయన నెల రోజులుగా నియోజకవర్గాన్ని చుట్టి వస్తున్నారు. కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ వచ్చిన షబ్బీర్‌అలీ ప్రచారాన్ని మొదలుపెట్టారు. గత నెల 30న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించడం ద్వారా క్యాడర్లో జోష్ పెంచారు. అంతటితో ఆగకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రజా సమస్యలే ఎజెండాగా జనంలోకి వెళుతున్నారు. ఇప్పటికే ఆయన పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురైదుగురు టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే, టిక్కెట్ ఎవరికి వచ్చినా కలిసే పని చేయాలని అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో ఇటీవల అందరు కలిసి నియోజక వర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. ఇక్కడ బీజేపీ ఇంకా ప్రచారాన్ని మొదలుపెట్టలేదు. అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి పేరును ఖరారు. అయితే, ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ లో టిక్కెట్ రాని వారికి గాలం వేయాలని బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. బాన్సువాడ, జుక్కల్‌లో.. బాన్సువాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురైదుగురు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థిత్వం ఖరారైన తరువాత ప్రచార వేడి పెరగనుంది. ఎస్సీ రిజర్వుడు స్థానమైన జుక్కల్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌కు పోటీ తీవ్రంగా ఉంది. మాజీ ఎమ్మెల్యేలు గంగారాం, అరుణతార తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా నాయుడు ప్రకాశ్ పేరు దాదాపు ఖరారు కాగా, ఆయన ప్రచారం మొదలుపెట్టారు. -
టీఆర్ఎస్ అభ్యర్థుల్లో అసమ్మతి గళం
టీఆర్ఎస్ అభ్యర్థులపై ఆశావహుల నిరసన కొనసాగుతూనే ఉంది. తమకు టికెట్ దక్కుతుందని ఆశించిన నేతలకు భంగపాటు కలగడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిని అధిష్టానం సముదాయించే యత్నం చేసినా ఫలితం కనిపించడం లేదు. ఈనేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో అసమ్మతి నేతలు కూటమిగా ఏర్పాటు కావడంతో ఆందోళన చెందుతున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అసమ్మతి నేతలు దారికి రావడం లేదు. అభ్యర్థుల ఖరారుతో అలకబూనిన ఆశావహులు.. అధిష్టానంపై నిరసన స్వరం వినిపిస్తూనే ఉన్నారు. ఒకట్రెండు చోట్ల ఒకరిద్దరు మెత్తబడినా.. చాలామంది ఇంకా శాంతించకపోవడంతో గులాబీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. టికెట్ ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించే బాధ్యతను ఎంపీ/మంత్రులకు అప్పగించినా చిటపటలు ఆగడం లేదు. ఆఖరికి ప్రగతి భవన్లో మంత్రాంగం నెరిపినా ఫలితం లేకపోవడంతో హైకమాండ్‌కు ఏమీ పాలుపోవడం లేదు. దీంతో అసంతృప్తనేతలతో చర్చలకు ఫుల్స్టాప్ పెట్టి ప్రచారపర్వంలో నిమగ్నం కావాలని టీఆర్ఎస్ నాయకత్వం అభ్యర్థులకు సూచించింది. అయితే, ఆశావహులు కంట్లో నలుసులా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది. దీనికితోడు పార్టీ శ్రేణుల్లోనూ గందరగోళం ఏర్పడుతోంది. పలు నియోజకవర్గాల్లో గ్రూపులుగా చీలిపోవడంతో పార్టీలో సమన్వయం సాధించడం ద్వితీయ శ్రేణి నాయకులకు తలకు మించిన భారంగా మారుతోంది. రాజీనామాస్త్రంతో పరిష్కారం చేవెళ్లలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంకు టికెట్ దక్కకపోవడంతో టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి ఆయన.. ఏకంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పార్టీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సొంత పార్టీలో వైరివర్గం లేకుండా పోయింది. రత్నం మాత్రం పార్టీని వీడడమేగాకుండా.. తనతోపాటు భారీ అనుచరగణాన్ని తనతోపాటు తీసుకెళ్లారు. ఇది పార్టీ గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. అసమ్మతి కూటమి షాద్‌నగర్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అభ్యర్థిత్వం ఖరారు కావడమే తరువాయి.. గులాబీదళంలో ముసలం పుట్టింది. టికెట్ ఆశించిన నేతలంతా ఒకతాటి మీదకు వచ్చి అంజయ్యకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేశారు. వీర్లపల్లి శంకర్, అందె బాబయ్య నిరసనగళం వినిపించడమేగాకుండా.. ఆయనను వ్యతిరేకిస్తున్న వారితో జట్టు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. పనిలోపనిగా కాంగ్రెస్‌లో ఉన్న లుకలుకలను కూడా అదనుగా మలుచుకొని అసమ్మతి కూటమిగా బరిలో దిగేందుకు ఎత్తుగడ వేస్తున్నారు. పార్టీలో నెలకొన్న అసమ్మతిని చల్లార్చేందుకు ఎంపీ జితేందర్‌రెడ్డి, మంత్రి లక్ష్మారెడ్డి నేరుగా రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. ఆఖరికి మంత్రి కేటీఆర్ కూడా అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారితో మాట్లాడినా మెత్తబడకపోవడం గమనార్హం. చాపకింద నీరులా.. ఇబ్రహీంపట్నంలోనూ అసమ్మతి రాజకీయాలకు తెరపడలేదు. తాజా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని సొంతపార్టీలోని వైరివర్గం వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కంచర్ల చంద్రశేఖరరెడ్డి పార్టీ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనతోపాటు ఎంపీపీ నిరంజన్‌రెడ్డి, సీనియర్ నేత శేఖర్‌గౌడ్ కూడా మంచిరెడ్డికి టికెట్ ఇవ్వడంపై తాడోపేడో తేల్చుకోవడానికి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. అవసరమైతే స్వతంత్రంగా బరిలో దిగాలని కంచర్లపై ఆయన అనుచరగణం ఒత్తిడి తెస్తోంది. మేడ్చల్లోను అదే సీనూ.. మేడ్చల్, ఉప్పల్‌లోనూ అసమ్మతి రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని పక్కనపెట్టిన అధిష్టానం.. ఎంపీ మల్లారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో మేడ్చల్ టికెట్ ఆశించిన హరివర్ధన్‌రెడ్డి, నక్కా ప్రభాకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కినుక వహించారు. అలాగే ఉప్పల్‌లో బేతి సుభాష్‌రెడ్డి అభ్యరిత్వంపై కార్పొరేటర్లు నిరసనగళం వినిపిస్తున్నారు. మరోవైపు రాజేంద్రనగర్‌లో తోకల శ్రీశైలం రెడ్డి, మహేశ్వరంలో కొత్త మనోహర్‌రెడ్డి, శేరిలింగంపల్లిలో సాయిబాబా, రాగం నాగేందర్, శంకర్‌గౌడ్ కూడా చిటపటలాడుతునే ఉన్నారు. ఎల్బీనగర్లో రామ్మోహన్‌గౌడ్‌కు వ్యతిరేకంగా కార్పొరేటర్లంతా తిరుగుబావుటా ఎగురవేశారు. ఈనేపథ్యంలో అసమ్మతినేతలను శాంతింపజేయడం అభ్యర్థులతో పాటు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కింకర్తవ్యం.. కల్వకుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు ఇంటి సెగ తాకుతునే ఉంది. నాలుగు గ్రూపులుగా వీడిపోయిన ఆశావహులతో మంతనాలు జరిపిన మంత్రి కేటీఆర్.. దాదాపుగా అందరినీ శాంతింపజేశారు. అభ్యర్థి గెలుపే ధ్యేయంగా సర్దుకుపోవాలని హితోపదేశం చేశారు. స్థానిక నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించే బాధ్యతను మంత్రి జూపల్లి కృష్ణారావుకు అప్పగించారు. అయితే, మంత్రి పర్యటనలో మాత్రం ఐక్యతారాగం వినిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం అసమ్మతిని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాత్రం జైపాల్ యాదవ్ అభ్యర్థిత్వంతో కినుక వహించారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. 2014 ఎన్నికల్లో అటు జైపాల్‌యాదవ్‌ను.. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని వ్యతిరేకించిన నేతలంతా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన కసిరెడ్డికి మద్దతుగా నిలిచారు. అనంతరం జరిగిన సమీకరణల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకోవడం.. ఎమ్మెల్సీగా గెలుపొందడం చకచకా జరిగిపోయాయి. అయితే, తాజా పరిణామాలతో కసిరెడ్డి వర్గీయులు సందిగ్ధంలో పడిపోయారు. జైపాల్‌కు మద్దతుగా ప్రచారం చేసేది లేదని, ‘మీరు ప్రచారం చేసినా పార్టీని వీడుతాం’ అంటూ అల్టిమేటం జారీ చేస్తుండడం కసిరెడ్డిని ఆత్మరక్షణలో పడేసింది. ‘మా మాట వినకుంటే మీ దారి మీది.. మా దారి మాది’ అని తేల్చిచెబుతుండడంతో కష్టకాలంలో వెన్నంటి నిలిచిన అనుచరులను బుజ్జగించలేక సతమతమవుతున్నారు ఆయన. అవసరమైతే ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని ఒత్తిడి చేస్తున్నారు. దీనిపై కసిరెడ్డి అంతరం గం ఏమిటో మరికొన్ని రోజుల్లో తేలనుంది. -
అయోమయంలో..గులాబీ దళం
సాక్షిప్రతినిధి, నల్లగొండ: టీఆర్ఎస్ నాయకులకు కంటిమీది కునుకు ఉండడం లేదు. ఎవరితోనూ పొత్తులేదు.. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్రకటనతో అన్ని నియోజకవర్గాల నాయకులు ఎగిరిగంతేశారు. కానీ, నోటిఫికేషన్ వెలువడి రెండు రోజులైనా అభ్యర్థుల ప్రకటన వెలువడలేదు. ఓవైపు తమకు టికెట్ వస్తుందా ..? రాదా..? అన్న సంశయాలకు తోడు ఇప్పుడు కాంగ్రెస్, సీపీఐలతో కలిసి పొత్తు చర్చలు గుట్టుగా సాగుతున్నాయని ప్రచారం జరు గుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. సీపీఎంతోనూ పొత్తు ఉంటుందేమోనన్న వార్తలు వారికి గుబులు పుట్టిస్తున్నాయి. ఆయా నియోజవర్గాలకు ఇన్‌చార్జ్‌లున్నా, వారినీ ఇప్పటి దాకా ప్రకటించలేదు. ఇటీవల పార్టీలో చేరిన వారికీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోనన్న కంగారులో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఆలేరు, సూర్యాపేట, నియోజకవర్గాల్లో మాత్రమే గొంగిడి సునీత, గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డిలకు కచ్చితంగా టికెట్ వస్తుందన్న భరోసా ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి పైళ్ల శేఖర్‌రెడ్డి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన భువనగిరి టికెట్ ఆశించే పార్టీలో చేరినా, చేరికల కార్యక్రమంలో అధినేత టికెట్ విషయంపై ఒక్క మాటా మాట్లాడలేదని అంటున్నారు. మరో రెండు రోజులు వేచి చూసి ఇండిపెండెంట్‌గానైనా ఆలేరు నుంచి నామినేషన్ వేసే ఆలోచనలో పైళ్ల శేఖర్‌రెడ్డి ఉన్నారన్న సమాచారం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఆయన ఆలేరు కోరుకున్నా అక్కడ గొంగిడి సునీత ముందు నుంచీ ఉన్నందున కాదన్నారని చెబుతున్నారు. అయితే, భువనగిరి నియోజకవర్గంలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, కొనపురి రాములు వంటి నాయకులు టికెట్ రేసులో ఉన్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఈ దశలోనే పైళ్ల శేఖర్‌రెడ్డి భువనగిరి టికెట్ ఆశించే పార్టీలో చేరారు. కానీ, ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే, సీట్ల సర్దుబాటు మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సీపీఐ, కాంగ్రెస్‌లో ఒక అవగాహనకు రావడంతో జిల్లాలో మునుగోడు, దేవరకొండ స్థానాలు సీపీఐకి ఇచ్చేయడానికి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. ఇప్పుడు ఈ రెండు పార్టీలకు టీఆర్ఎస్ తోడైతే, కేవలం పది స్థానాల్లోనే కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తులు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఈ పది స్థానాల్లో ఆరు స్థానాలు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలే కావడం గమనార్హం. ఆలేరు, సూర్యాపేట, నకిరేకల్, హుజూర్‌నగ ర్, నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాల్లో ఆలేరు, నకిరేకల్ మినహా అంతా సీనియర్లు, మాజీ మంత్రులే ఉన్నారు. ఆలేరు, నకిరేకల్ లో మాత్రం తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన బిక్షమయ్య గౌడ్, చిరుమర్తి లింగయ్య ఉన్నారు.ఒక వేళ కాంగ్రెస్‌తో, సీపీఐతో పొత్తు లేదనుకున్నా, టీఆర్ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని అనుకున్నా, ఆయా నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీ ఉండడంతో ఎవరికి టికెట్ దక్కుతుందో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొని ఉంది. నల్లగొండలో దుబ్బాక నర్సింహారెడ్డి, చకిలం అనిల్‌కుమార్ మధ్య టికెట్ దోబూచులాడుతోంది. మునుగోడులో కర్నెప్రభాకర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిల మధ్య పోటీ ఉంది. భువనగిరిలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, కొనపురి రాములుకు తోడు ఇపుడు పైళ్ల శేఖర్‌రెడ్డి లైన్లో ఉన్నారు. హుజూర్‌నగర్‌కు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ పేరును పరిశీలిస్తున్నా, ఎలాంటి ప్రకటనా చేయలేదు. నాగార్జున సాగర్ నియోకవర్గ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. భువనగిరి, నల్లగొండ లోక్‌సభ స్థానాల అభ్యర్థిత్వాలూ ఖరారు కాలేదు. డాక్టర్స్ జేఏసీలో పనిచేసిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పార్టీలో చేరాక భువనగిరి ఎంపీ అభ్యర్థి అని ప్రచారం జరిగినా, ఇప్పటి దాకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నల్లగొండ లోక్‌సభ స్థానానికి జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చినా, బుధవారం పార్టీలో చేరిన రాజేశ్వర్‌రెడ్డి కోసం బండాను పక్కన పెట్టి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. అయితే, రాజేశ్వర్‌రెడ్డికి నల్లగొండ లోక్‌సభ టికెట్ ఇస్తున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. ఇలా.. మెజారిటీ స్థానాల్లో పేర్లు ఖరారు కాక గులాబీ శ్రేణులు గందరగోళంలో పడిపోయాయి.