అయోమయంలో..గులాబీ దళం | trs leaders in confusion | Sakshi
Sakshi News home page

అయోమయంలో..గులాబీ దళం

Published Fri, Apr 4 2014 2:03 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

trs leaders in confusion

సాక్షిప్రతినిధి, నల్లగొండ: టీఆర్‌ఎస్  నాయకులకు కంటిమీది కునుకు ఉండడం లేదు. ఎవరితోనూ పొత్తులేదు.. ఒంటరిగానే  ఎన్నికల బరిలోకి దిగుతామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్రకటనతో అన్ని నియోజకవర్గాల నాయకులు ఎగిరిగంతేశారు. కానీ, నోటిఫికేషన్ వెలువడి రెండు రోజులైనా అభ్యర్థుల ప్రకటన వెలువడలేదు. ఓవైపు తమకు టికెట్ వస్తుందా ..? రాదా..? అన్న సంశయాలకు తోడు ఇప్పుడు కాంగ్రెస్, సీపీఐలతో కలిసి పొత్తు చర్చలు గుట్టుగా సాగుతున్నాయని ప్రచారం జరు గుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
 
సీపీఎంతోనూ పొత్తు ఉంటుందేమోనన్న వార్తలు వారికి గుబులు పుట్టిస్తున్నాయి. ఆయా నియోజవర్గాలకు ఇన్‌చార్జ్‌లున్నా, వారినీ ఇప్పటి దాకా ప్రకటించలేదు. ఇటీవల పార్టీలో చేరిన వారికీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోనన్న కంగారులో టీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు. ఆలేరు, సూర్యాపేట, నియోజకవర్గాల్లో మాత్రమే గొంగిడి సునీత, గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డిలకు కచ్చితంగా టికెట్ వస్తుందన్న భరోసా ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
 
ఇటీవల టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి పైళ్ల శేఖర్‌రెడ్డి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన భువనగిరి టికెట్ ఆశించే పార్టీలో చేరినా, చేరికల కార్యక్రమంలో అధినేత టికెట్ విషయంపై ఒక్క మాటా మాట్లాడలేదని అంటున్నారు. మరో రెండు రోజులు వేచి చూసి ఇండిపెండెంట్‌గానైనా ఆలేరు నుంచి నామినేషన్ వేసే ఆలోచనలో పైళ్ల శేఖర్‌రెడ్డి ఉన్నారన్న సమాచారం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఆయన ఆలేరు కోరుకున్నా అక్కడ గొంగిడి సునీత ముందు నుంచీ ఉన్నందున కాదన్నారని చెబుతున్నారు.
 
అయితే, భువనగిరి నియోజకవర్గంలో ఎలిమినేటి కృష్ణారెడ్డి,  కొనపురి రాములు వంటి నాయకులు టికెట్ రేసులో ఉన్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఈ దశలోనే పైళ్ల శేఖర్‌రెడ్డి భువనగిరి టికెట్ ఆశించే పార్టీలో చేరారు. కానీ, ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే, సీట్ల సర్దుబాటు మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
 
ఇప్పటికే సీపీఐ, కాంగ్రెస్‌లో ఒక అవగాహనకు రావడంతో జిల్లాలో మునుగోడు, దేవరకొండ స్థానాలు సీపీఐకి ఇచ్చేయడానికి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. ఇప్పుడు ఈ రెండు పార్టీలకు టీఆర్‌ఎస్ తోడైతే, కేవలం పది స్థానాల్లోనే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పొత్తులు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఈ పది స్థానాల్లో ఆరు స్థానాలు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలే కావడం గమనార్హం.

ఆలేరు, సూర్యాపేట, నకిరేకల్, హుజూర్‌నగ ర్, నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాల్లో ఆలేరు, నకిరేకల్ మినహా అంతా సీనియర్లు, మాజీ మంత్రులే ఉన్నారు. ఆలేరు, నకిరేకల్ లో మాత్రం తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన బిక్షమయ్య గౌడ్, చిరుమర్తి లింగయ్య ఉన్నారు.ఒక వేళ కాంగ్రెస్‌తో, సీపీఐతో పొత్తు లేదనుకున్నా, టీఆర్‌ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని అనుకున్నా, ఆయా నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీ ఉండడంతో ఎవరికి టికెట్ దక్కుతుందో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొని ఉంది.
 
నల్లగొండలో దుబ్బాక నర్సింహారెడ్డి, చకిలం అనిల్‌కుమార్ మధ్య టికెట్ దోబూచులాడుతోంది. మునుగోడులో కర్నెప్రభాకర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిల మధ్య పోటీ ఉంది. భువనగిరిలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, కొనపురి రాములుకు తోడు ఇపుడు పైళ్ల శేఖర్‌రెడ్డి లైన్లో ఉన్నారు. హుజూర్‌నగర్‌కు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ పేరును పరిశీలిస్తున్నా, ఎలాంటి ప్రకటనా చేయలేదు. నాగార్జున సాగర్ నియోకవర్గ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. భువనగిరి, నల్లగొండ లోక్‌సభ స్థానాల అభ్యర్థిత్వాలూ ఖరారు కాలేదు.
 
డాక్టర్స్ జేఏసీలో పనిచేసిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పార్టీలో చేరాక భువనగిరి ఎంపీ అభ్యర్థి అని ప్రచారం జరిగినా, ఇప్పటి దాకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నల్లగొండ లోక్‌సభ స్థానానికి జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చినా, బుధవారం పార్టీలో చేరిన రాజేశ్వర్‌రెడ్డి కోసం బండాను పక్కన పెట్టి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. అయితే, రాజేశ్వర్‌రెడ్డికి నల్లగొండ లోక్‌సభ టికెట్ ఇస్తున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. ఇలా.. మెజారిటీ స్థానాల్లో పేర్లు ఖరారు కాక గులాబీ శ్రేణులు గందరగోళంలో పడిపోయాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement