
అసమ్మతి నేతలపై ఆప్ వేటు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) నుంచి.. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులైన యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లను తొలగించారు. వీరివురూ ఇక పార్టీ పీఏసీలో పనిచేయరని.. వారిద్దరికీ పార్టీకి సంబంధించి కొత్త బాధ్యతలు అప్పగిస్తామని పార్టీ జాతీయ కార్యవర్గం(ఈసీ) సమావేశం అనంతరం ఆప్ అధికార ప్రతినిధి కుమార్ విశ్వాస్ మీడియాకు వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సమైక్య శక్తిగానే ఉందని.. వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత విభేదాలు పార్టీ ఐక్యతపై ప్రభావం చూపబోవని.. ఢిల్లీ ప్రజలు, దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమ పార్టీ శాయశక్తులా కృషిచేస్తుందని పేర్కొన్నారు.
వేటుకు కారణం ఏమిటి?
ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ జాతీయ కన్వీనర్‌గా కొనసాగరాదని.. ఆ పదవి నుంచి వైదొలగాలని యోగేంద్ర, ప్రశాంత్‌లు గళం విప్పారు. దీనిపై పార్టీకి రాసిన లేఖలను మీడియాకు లీక్ చేయటంతో పాటు.. కేజ్రీవాల్ వ్యవహార శైలిపైనా బహిరంగంగా విమర్శలు గుప్పించటంతో వివాదం రాజుకుంది.
ఆప్ నాయకత్వం ఏమంటోంది?
యోగేంద్ర, ప్రశాంత్‌లు కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా కుట్రపన్నారని.. పార్టీని తమ కుటుంబం గుప్పెట్లో ఉంచుకోవాలని ప్రశాంత్ ప్రయత్నిస్తున్నారని కేజ్రీవాల్ వర్గం ప్రత్యారోపణలు గుప్పించటంతో వివాదం ముదిరింది. కాగా, పార్టీలో విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకుని.. సమైక్యంగా కొనసాగాలని ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తూ అటు ఇంటర్నెట్‌లోని సామాజిక వెబ్‌సైట్లలోనూ.. ఇటు పార్టీ ఈసీ భేటీ వద్ద విజ్ఞప్తులు చేశారు.
ఏం నిర్ణయం తీసుకున్నారు?
బుధవారం ఢిల్లీలో సమావేశమైన ఆప్ జాతీయ కార్యవర్గం ఈ వివాదాలపై ఆరు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించింది. పీఏసీలో మొత్తం 21 మంది సభ్యులుండగా పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మరో నేత హబుంగ్ పయెంగ్ ఈ భేటీకి హాజరు కాలేదు. సమావేశంలో యోగేంద్ర, ప్రశాంత్‌భూషణ్‌లు పీఏసీ నుంచి తప్పుకోవాలని సూచించగా.. అందుకు వారు నిరాకరిస్తూ ఓటింగ్ కోరారు. దీంతో కేజ్రీవాల్ సన్నిహితుడు, ఉప ముఖ్యమంత్రి మనీష్‌సిసోడియా.. వారిద్దరినీ పీఏసీ నుంచి తప్పించాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి అనుకూలంగా 11 ఓట్లు పోలవగా.. వ్యతిరేకంగా 8 ఓట్లు పోలయ్యాయి. సమావేశానికి అధ్యక్షత వహించిన కుమార్‌విశ్వాస్ ఓటు వేయలేదు.
వారిద్దరి స్పందన ఏమిటి?
ఈసీ నిర్ణయం తీసుకున్న తర్వాత యోగేంద్ర, ప్రశాంత్‌లు భేటీ నుంచి వెళ్లిపోయారు. పార్టీకి నిబద్ధుడైన కార్యకర్తలా తాను పని చేయటం కొనసాగిస్తానని యోగేంద్ర మీడియాతో పేర్కొన్నారు. ప్రశాంత్ స్పందిస్తూ.. మెజారిటీ నిర్ణయానిదే విజయమని వ్యాఖ్యానించారు.
కన్వీనర్ పదవికి కేజ్రీవాల్ రాజీనామా.. తిరస్కరణ
ఆప్ ఈసీ సమావేశానికి ముందు.. కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా తనకు పని ఒత్తిడి పెరిగినందున.. పార్టీ జాతీయ కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తున్నానంటూ సంబంధిత లేఖను పార్టీ కార్యదర్శికి పంపించారు. ఈ అంశంపై చర్చించిన ఈసీ ఆ రాజీనామాను తిరస్కరించింది. గత వారం జరిగిన ఈసీలో సైతం కేజ్రీవాల్ రాజీనామా చేయగా.. ఈసీ తిరస్కరించింది.